గుండె సమస్యలను పారదోలడంలో ఇది బెస్ట్‌!

1 Nov, 2021 11:29 IST|Sakshi

శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో ఆరోగ్య సమస్యలు పొంచి ఉంటాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ స్థాయిలను అదుపులో ఉంచడానికి క్యారెట్‌ను ఖచ్చితంగా తీసుకోవాలి. క్యారెట్‌లో బీటా-కెరోటిన్ స్థాయిలు నిండుగా ఉంటాయి. ఈ బీటా-కెరోటిన్ మన శరీరంలో విటమిన్‌ ‘ఎ’గా రూపాంతరం చెంది రక్తంలోని చెడుకొవ్వులను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుందని ఇల్లినాయిస్ యూనివర్సిటీ అధ్యనాలు వెల్లడించాయి. తద్వారా గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది. దీనిలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియంలతోపాటు బరువు తగ్గేందుకు, జీర్ణక్రియ, కంటి ఆరోగ్యం, చర్మ-ఆరోగ్యం.. వంటి ప్రయోజనాలను చేకూర్చే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. క్యారెట్‌ను సలాడ్‌గా మాత్రమేకాకుండా ఈ కింది ప్రత్యేక రుచుల్లో కూడా తినొచ్చు. అవేంటో తెలుసుకుందాం..

క్యారెట్‌- ఆరెంజ్‌ డిటాక్స్‌ డ్రింక్‌
రెండు క్యారెట్లు, ఆరెంజ్‌ పండ్లు రెండు తీసుకుని విడివిడిగా జ్యూస్‌తయారు చేసుకోవాలి. తర్వాత రెండింటిని ఒక గ్లాసులో బాగా కలుపుకుని,దీనికి టేబుల్‌ స్పూన్‌ చొప్పున పసుపు, నిమ్మరసం, 2 స్పూన్ల అల్లం పేస్టు జోడించి బాగా కలుపుకోవాలి. ఈ ద్రావణాన్ని ఉదయాన్నేతాగితే శరీరంలోని వ్యర్ధాలను తొలగించడమేకాకుండా రోజంతా యాక్టీవ్‌గా ఉంచుతుంది.

క్యారెట్‌-అల్లం సూప్‌
బాణీలో రెండు స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌, తరిగిన అల్లం ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అరకప్పు తరిగిన ఉల్లి ముక్కలు , ముక్కలుగా కట్‌చేసిన క్యారెట్లను (6 పెద్దవి) వేసి, ఒక టీ స్పూన్‌ సాల్ట్‌, కప్పు నీళ్లు పోసి మెత్తబడేవరకు ఉడికించాలి. తర్వాత నీళ్లను ఒక గిన్నెలో ఒంపి క్యారెట్లను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఒంపిన నీళ్లను ఈ మిశ్రమానికి కలిపి స్టౌ మీద చిక్కబడే వరకు కలుపుకోవాలి. ఆర స్పూను చొప్పున మిరియాల పొడి, సాల్ట్‌ కలుపుకుంటే సూప్‌ రెడీ! వింటర్‌లో మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ సూప్‌ సహాయపడుతుంది.

క్యారెట్‌ క్రాకర్స్‌
ఒక గిన్నెలో మైదా పిండి, ఆవాల పొడి, వెన్న, జీలకర్ర, క్యారెట్, జున్ను, నీరు, గుడ్డు సొన వేసి మెత్తగా పిండిని కలుపుకోవాలి. 30 నిమిషాలు తర్వాత, పిండిని మందంగా పరిచి, గుండ్రంగా బిస్కెట్‌ సైజులో కట్‌చేసుకోవాలి. 10-12 నిముషాల వరకు బంగారు రంగు వచ్చేవరకు బేక్‌ చేస్తే క్యారెట్‌ క్రాకర్స్‌ రెడీ! దీనిని స్నాక్స్‌ రూపంలో తినొచ్చు.

చదవండి: African Wild Dogs: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!!

మరిన్ని వార్తలు