ఈ పువ్వులను వంటల్లోనూ ఉపయోగిస్తారని తెలుసా?

23 Jul, 2021 15:15 IST|Sakshi

పుష్పహారం కాదు.. పుష్పాహారం... 

అరటిపువ్వు, కాలీఫ్లవర్‌ వంటి వాటిని మనం ఎప్పటి నుంచో వంటల్లో ఉపయోగిస్తున్నాం. కుంకుమపువ్వునూ అనాదిగా పాలతో గర్భిణులచే తాగించడమూ మన సంస్కృతిలో భాగమే. ఇప్పుడు బ్రోకలీ వంటి విదేశీ పూలూ మన వంటల్లో భాగమయ్యాయి. ఇటీవల తామరపూలనూ ఆరోగ్యం కోసం మనం ఆహారంలో భాగం చేసుకుంటున్నాం. ఇక మందారపూలతో టీ తాగడమూ చూస్తున్నాం. ఆయా పూలతో మనకు సమకూరే పోషకాలూ, ఒనగూరే (ఆరోగ్య) ప్రయోజనాలను తెలుసుకుందాం. 

కాలీఫ్లవర్‌
గోబీ పువ్వు అని తెలుగులో, ఫూల్‌ గోబీ అని హిందీలో పిలిచే ఈ పువ్వును మనం ఎప్పటినుంచో వంటలో కూరగానూ, కాలీఫ్లవర్‌ పకోడీ రూపంలో శ్నాక్స్‌గానూ తింటూనే ఉన్నాం. ఇది క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తుంది. ముఖ్యంగా కాలీఫ్లవర్‌లో సల్ఫోరఫేన్‌ అనే ఫైటో కెమికల్‌ అనేక రకాల క్యాన్సర్‌లను నివారిస్తుంది. కాలీఫ్లవర్‌లోని ఇండోల్‌–3–కార్బినాల్‌ అనే స్టెరాల్‌ కూడా  క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. కాలిఫ్లవర్‌ తినేవారిలో అది ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము, ఒవేరియన్‌ క్యాన్సర్ల నివారణకు తోడ్పడుతుందని అనేక పరిశోధనల్లో తేలింది. ఇక ముందు చెప్పుకున్న సల్ఫోరఫేన్‌ పోషకం ఆటిజమ్‌ను నివారించడంలో కొంతమేర తోడ్పడుతుందని కొన్ని అధ్యయనాల్లో తెలిసివచ్చింది. అప్పటినుంచి ఈ విషయమై మరికొన్ని పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 

అరటిపువ్వు 
ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థం, కొవ్వులు, క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, పొటాషియమ్, మెగ్నీషియమ్, విటమిన్‌ ఈ పుష్కలంగా ఉంటాయి. అరటిపువ్వుతో ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. అరటిపువ్వుతో కూరలను వండి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి.  ఉదాహరణకు... అరటిలోని పోషకగుణాలు ఇన్ఫెక్షన్స్‌ తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇందులోని ఇథనాల్‌ హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి, గాయం త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది. అరటిపువ్వులోని పోషకాలు మలేరియా కారక క్రిములను ఎదుర్కొంటాయని ఒక అధ్యయనం చెబుతోంది. అయితే ఈ విషయం ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు.

అరటిపువ్వులోని యాంటీ ఆక్సిడెంట్స్‌... క్యాన్సర్‌ కారకాలుగా మారే ఫ్రీరాడికల్స్‌ని నివారిస్తాయి. రక్తంలోని చెక్కెరను నియంత్రించడం ద్వారా డయాబెటిస్‌ను నివారిస్తుంది. ఇందులో ఐరన్‌ ఎక్కువ కాబట్టి రక్తహీనత అనీమియాను అరికడుతుంది. అరటిపువ్వుల కూర తినడం మహిళల ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది. ఉదాహరణకు రుతు సమయంలో ఎక్కువగా బ్లీడింగ్‌ కావడం తగ్గుతుంది. రుతుస్రావం వచ్చే ముందు మూడ్స్‌ త్వరత్వరగా మారిపోవడం, కడుపునొప్పి వంటి అనేక సమస్యలు కనిపించే పీ–మెనుస్ట్రువల్‌ సిండ్రోమ్‌ (పీఎమ్‌ఎస్‌) తగ్గిపోతుంది. ఇందులోని మెగ్నీషియమ్‌ వల్ల యాంగై్జటీ తగ్గి, మంచి మూడ్స్‌ సమకూరుతాయి. బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో (బ్రెస్ట్‌ ఫీడింగ్‌ మదర్స్‌లో) పాలు బాగా ఊరేలా తోడ్పడుతుంది. 

కుంకుమపువ్వు
మనమెంతోకాలంగా కుంకుమపువ్వును ఓ సుగంధద్రవ్యంగా వాడుతున్న సంగతి అందరికీ తెలిసిన విషమయే. జఫ్రానీ బిర్యానీ అంటూ బిర్యానీ తయారీలోనూ, కశ్మీరీ పులావ్‌ వంటి వంటకాల్లోనూ కుంకుమపువ్వును ఉపయోగిస్తుంటాం. మంచి మేనిఛాయతో పండండి బిడ్డ పుట్టడానికి కుంకుమపువ్వు దోహదం చేస్తుందన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఆ మాటలో ఎంత వాస్తవం ఉందన్న సంగతి పక్కన పెడితే అనాదిగా అదో సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే ఇందులో బీ–కాంప్లెక్స్‌ విటమిన్‌కు సంబంధించిన థయామిన్, రైబోఫ్లేవిన్‌ అన్న విలువైన పోషకాలు గర్భవతుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే గర్భవతుల్లో ప్రోజెస్టెరాన్‌ అన్న హార్మోన్‌ కారణంగా మలబద్దకం రావడం చాలా సహజంగా జరుగుతుంటుంది.

చాలా పరిమితమైన మోతాదులో తీసుకుంటే కుంకుమపువ్వు జీర్ణప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది. ఆకలిని కూడా పెంచుతుంది. ఇలా ఎన్నో రకాలుగా ఇది గర్భవతులకు ఇది మేలు చేస్తుంది.  అయితే ఎక్కువ మోతాదులో దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఎందుకంటే ఇదో నేచురల్‌  హెర్బ్‌ కాబట్టి పరిమితికి మించినప్పుడు అది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేస్తుంది. అందుకే మరీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే గర్భస్రావం అయ్యే అవకాశమూ ఉంది. అందుకే చిటికెడంటే చిటికెడే వాడాలి. 

తామరపువ్వులు(కమలం పువ్వులు)
తామరపూలతో చాలా మంది టీ కాచుకొని తాగుతుంటారు. అయితే తూర్పు ఆసియా ఖండంలో అనేక మంది తామరతూళ్లను వంటకోసం ఉపయోగిస్తుంటారు. తామరపూలలో విటమిన్‌ ఏ, బీ, సి లు చాలా ఎక్కువ. విటమిన్‌ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక విటమిన్‌ బి కాంప్లెక్స్‌లో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్‌ సి అన్నది స్వాభావికమైన యాంటీ ఆక్సిడెంట్‌ అన్న విషయం తెలిసిందే. దాంతో ఇది క్యాన్సర్‌లతో పోరాడుతుంది. విటమిన్‌ బి కాంప్లెక్స్, విటమిన్‌–సి రోగనిరోధకశక్తిని పెంచి ఎన్నో వ్యాధులకు కవచంగా పనిచేస్తాయి. 

గులాబీ 
మనదేశంలో గులాబీరేకులతో స్వీట్‌పాన్‌లోని తీపినిచ్చే గుల్‌ఖండ్‌ తయారు చేస్తారన్న విషయం తెలిసిందే. ఇది మినహా మన దగ్గర ఆహారంలో దీని ఉపయోగం చాలా తక్కువే అయినా చైనీయులు తమ ఔషధాల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు. ఇందులో ఫీనాలిక్స్‌ అనే పోషకాలు ఉన్నాయి. అవి గాయపు మంటను తగ్గిస్తాయి. రోజాపువ్వు రేకులతో టీ కాచుకోవడం చాలా మంచిది. ఇది గుండెజబ్బు ముప్పునూ, క్యాన్సర్, డయాబెటిస్‌నూ రిస్క్‌ను తగ్గిస్తుంది. దీన్ని చాలా పరిమితంగా టీ కాచుకోడానికీ లేదా ఫ్లేవర్‌గా ఉపయోగించడమే మంచిది. 

బ్రకోలీ / బ్రోకలీ 
బ్రకోలీ అనేది ఓ ఇటాలియన్‌ పేరు. ఇటాలియన్‌ భాషలో ‘బ్రొకోలో’ అంటే క్యాబేజీ తాలూకు పుష్ప శిఖరాగ్రం (ఫ్లవరింగ్‌ క్రెస్ట్‌ ఆఫ్‌ క్యాబేజీ) అని అర్థం. గతంలో క్యాలీఫ్లవర్‌లా అంత విస్తృతంగా దొరకకపోయినా... ఇప్పుడు మన భారతీయ నగర మార్కెట్లలోనూ విరివిగానే దొరుకుతోంది. ఇందులో విటమిన్‌ ఏ పాళ్లు చాలా ఎక్కువ. మేని నిగారింపుకూ, మంచి దృష్టికి ‘విటమిన్‌–ఏ’ దోహదపడుతుంది. ఇందులోని పోషకాలు దేహంలో పేరుకుపోయిన విషాలను తొలగించే ‘డీ–టాక్సిఫైయర్స్‌’గా ఉపయోగపడతాయి. 

మందారపువ్వు
చాలా మంది దీన్ని పువ్వులను ఎండబెట్టుకొని టీ కాచుకొని తాగుతారు. మందారపువ్వు జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తుంది.  శరీర జీవక్రియలను క్రమబద్ధం చేస్తుంది. ఇందులో విటమిన్‌–సితో పాటు అనేక యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్నాయి. అవి కాలేయ క్యాన్సర్‌ వంటి అనేక క్యాన్సర్‌లను నివారిస్తాయి. మందారపూలతో కాచిన టీ వల్ల రక్తపోటు, యాంగై్జటీ కూడా తగ్గుతాయి. అయితే ఈ చాయ్‌ను పరిమితంగా తాగితేనే మేలు. ఇదే కాదు అన్ని రకాల టీలనూ పరిమితంగా తాగడమే మంచిది. 

మరిన్ని వార్తలు