ఆరోగ్య జాగ్రత్తల్లో ‘చెప్పు’కోవాల్సిన విషయాలు..

22 Oct, 2021 11:00 IST|Sakshi

మనం ధరించే దుస్తుల నుంచి చెప్పుల వరకు అన్నీ సరైన కొలతలలో ఉండకపోతే చూడ్డానికి ఎబ్బెట్టుగానే కాదు... అసౌకర్యంగా కూడా అనిపిస్తుంది. దుస్తులు మాత్రం ఇంచుమించు అందరూ సరయిన కొలతల్లోనే ఉండేలా చూసుకుంటారు కానీ, చెప్పుల విషయంలో అంతగా పట్టించుకోరు. నిజానికి దుస్తులకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో, పాదరక్షలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి తిరిగి ఇంటికి వచ్చేవరకు మన పాదాలను అంటిపెట్టుకుని ఉండి, జాగ్రత్తగా కాపాడేది పాదరక్షలే కాబట్టి ఎలాంటి పాదరక్షలను, ఎప్పుడు ఎంచుకోవాలి అనే విషయాలపై అవగాహన కోసం...

చెప్పుల విషయంలో అలక్ష్యంగా వ్యవహరిస్తే చిక్కులు తప్పవు. ముఖ్యంగా పాదరక్షలు కొనేటప్పుడు సౌకర్యంగా ఉండేలా చూసుకోవడమే కాదు, సరైన సైజును ఎంచుకోవాలి. ముఖ్యంగా ఆర్థోపెడిక్, డయాబెటిస్‌ రోగులు, వివిధ రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వాళ్లు సరైన పాదరక్షలను ఎంచుకోకపోతే ఇబ్బందులే. 

చదవండి: Wonder of Science: బాప్‌రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!!
 

చిన్నసైజు వద్దు...
పాదం పరిమాణం కంటే చిన్నగానూ, బిగుతుగానూ ఉండే చెప్పులు ధరిస్తే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. సరైన చెప్పులు వేసుకోకపోతే పాదాలకు పగుళ్లు, ఇన్ఫెక్షన్లూ తప్పవు. బిగుతైన బూట్లు ధరించడం వల్ల గోళ్ల పెరుగుదల నిలిచిపోవడమే కాక గోటి చివర్లు వేళ్లలోనికి గుచ్చుకుని ఇన్ఫెక్షన్ల బారిన పడాల్సి వస్తుంది. షుగర్‌ రోగులకు ఇలాంటివి తీవ్రం గా మారే ప్రమాదం ఉంది. అలాగని పెద్ద సైజు చెప్పులు, బూట్లు వేసుకోవడమూ ఏమంత మంచిది కాదు. మడమల సమస్యలు ఎదురవుతాయి. వీటిమూలంగా కాళ్లు బెణకడం, నడకలో తేడా రావడం తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

చెప్పుల షాపింగ్‌కి మధ్యాహ్నాలు లేదా సాయంత్రాలే ఉత్తమం
గుండె సంబంధిత వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, బీపీ, డయాబెటిస్‌ వంటి లైఫ్‌స్టైల్‌ సంబంధిత రోగులకు సహజంగానే కాళ్ల వాపులుంటాయి. అలాగే ఎక్కువసేపు కుర్చీలో కూర్చొని పనిచేసే వాళ్లకు సైతం పాదాల వాపు సర్వసాధారణం. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాలల్లో కదలికలు నిలిచిపోయి పాదాలలో వాపు వస్తుంది. ఇది ఎక్కువగా మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల సమయంలో వాపు ఉంటుంది. ఈ సమయంలో చెప్పులు కొనుగోలు చేస్తే సాధారణ సైజు కంటే కొంచెం పెద్దవి తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పులు కొనడానికి మధ్యాహ్నం లేదా సాయంత్రాలే మంచిది. సరైన సైజ్‌ చెప్పులు, బూట్లు వేసుకోవడం వల్ల సౌకర్యంగా ఉండటంతోపాటు పాదాలు కూడా పదిలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 

చదవండి: రెస్టారెంట్‌ విచిత్ర షరతు.. ఫైర్‌ అవుతున్న నెటిజన్లు!

ఒక కాలితో ట్రయల్‌ వద్దే వద్దు...
పాదరక్షలు కొనుగోలు చేసేటప్పుడు ఒక కాలికి మాత్రమే ట్రయల్‌ వేసి సరిపోయిందని సంతృప్తి పడవద్దు. రెండు కాళ్లకూ వేసుకుని నాలుగడుగులు అటూ ఇటూ నడిచి, అవి సౌకర్యంగా అనిపిస్తేనే కొనుగోలు చేయాలి. అదేవిధంగా బూట్లు కొనేటప్పుడు సాక్స్‌ తొడుక్కోకుండా ట్రయల్‌ చేయడం సరి కాదు. బూట్లకు ముందు కనీసం అర అంగుళం ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే కాలిగోర్ల పెరుగుదల నిలిచిపోవడం, తద్ద్వారా ఇన్ఫెక్షన్ల సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అదే విధంగా పాదరక్షలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవడం కూడా ఎంతో అవసరం. 

 ఒక్కోసారి చెప్పుల నుంచి వాటిని తయారు చేసిన మెటీరియల్‌ మూలాన ఘాటైన వాసనలు వస్తుంటాయి.  మంచి నాణ్యత గల చెప్పులు ఈ ఘాటైన వాసనను విడుదల చేయవు, చెప్పుల వాసన ఘాటుగా ఉంటే,  మైకం, కళ్లు తిరగడం, కడుపులో తిప్పడం వంటి అసౌకర్యాలు కలుగుతాయి. 

రంగు కూడా ముఖ్యమే!
చెప్పుల రంగు మామూలుగా ఉందో లేదో గమనించండి. సాధారణంగా మంచి నాణ్యత గల చెప్పుల రంగు ముదురుగా ఉండదు. అదే చవక రకం చెప్పుల రంగు చాలా బ్రైట్‌గా ఉంటుంది, ఈ రంగులలో ఎక్కువగా కాడ్మియం, సీసం, ఇతర హెవీ మెటల్‌ అంశాలు ఉంటాయి, ఇది పిల్లల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి లేత రంగులే మంచిది. 

కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్ద చెప్పులు వేసుకుంటే బ్యాలన్స్‌ చేసుకోలేక పడిపోతారని, మెత్తటి చెప్పులయితే నడక సరిగా ఉండదనే అపోహతో బిగుతుగా ఉండే గట్టి చెప్పులు కొంటారు. నిజానికి, బిగుతైన చెప్పులు ధరించిన పిల్లలు పాదాల, కాలి వేళ్ల పెరుగుదలకు ఆటంకం కలిగించినట్లే. స్లిప్పర్‌ లోపల ఉన్న పొడవు పిల్లల పాదం కంటే కనీసం ఒక సెం.మీ అయినా ఎక్కువుండాలని నిపుణుల సలహా. 

బరువైన చెప్పులు వద్దు...
మీరు కొనాలనుకుంటున్న చెప్పులను ఒకసారి చేతితో పట్టుకుని చూడండి. బరువు తక్కువగా ఉండి, చేతుల్లో భారమైన అనుభూతి లేనట్లయితే, అది కొత్త మెటీరియల్‌తో తయారయిందని చెప్పవచ్చు. బరువుగా అనిపిస్తే వాటిని కొనుగోలు చేయవద్దు.

చివరగా ఒక మాట... చెప్పులే కదా అని తేలిగ్గా తీసేయద్దు. వీటి గురించి చెప్పుకోవాలంటే ఇంకా బోలెడన్ని సంగతులున్నాయి.  

చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !!

మరిన్ని వార్తలు