శతక నీతి – సుమతి ‘‘..సతాం సంగో...’’ పాటించండి

11 Apr, 2022 04:27 IST|Sakshi

ధృతరాష్ట్రుడు పెనువేప విత్తు. దుర్యోధనుడికన్నా ప్రమాదకారి. అంత పరమదుర్మార్గుడయిన ధృతరాష్ట్రుడికి శ్రీ కృష్ణ పరమాత్మ ప్రత్యేకంగా దృష్టినిచ్చి నిండు సభలో తన విశ్వరూప దర్శనానికి అవకాశం ఇచ్చాడు. అలా ఎందుకిచ్చాడంటే... ఆయనకున్న ఒకే ఒక అర్హత చూసి.

ఆ ఒక్క సుగుణం ఏమిటి! ప్రతిరోజూ రాత్రి పరమ ధర్మాత్ముడయిన విదురుడిని పక్కన కూర్చోబెట్టుకుని మంచి మాటలు వింటాడు.. పాటించడు. కానీ విదురుడు లేకపోతే విలవిల్లాడిపోతాడు. ఆయన చెప్పేవన్నీ వింటాడు. ‘ఒక మహాత్ముడిని చేరదీసావు, ఆయనతో కలిసి ఉన్నావు, ఆయన చెప్పినవన్నీ వింటున్నావు.. ఈ ఒక్క కారణానికి నీకు విశ్వరూప సందర్శనకు అవకాశం ఇస్తున్నాను’ అన్నాడు కృష్ణ పరమాత్మ. సత్పురుషులతో సహవాసం అంత మేలు చేస్తుంది.

మంచివారితో ప్రయత్నపూర్వకంగా స్నేహం చేస్తుండాలి. వారు నిన్ను పేరు పెట్టి పిలిచినా, బంధుత్వంతో పిలిచినా, నీవు వారింటికి వెళ్ళగలిగినా, వారు  తరచుగా నీతో మాట్లాడుతున్నా నీవు చాలా అదృష్ట్టవంతుడివని జ్ఞాపకం పెట్టుకో... ఎందుకని అంటే... భగవంతుడు బాగా ఇష్టపడేది తనని పూజించే వాళ్లని కాదు, తాను చెప్పిన మాటలను ఆచరించేవారిని. మంచి వారితో కలిసుండే వారినే ఇష్టపడతాడు.. భాగవతంలో అజామిళోపాఖ్యానం– అనే అద్భుతమైన ఘట్టం ఒకటి ఉంది.

ఎప్పుడూ మంచి పనులు చేసేవారిని.. వారినే కాదు.. వారి వారి వారి తాలూకు వారి జోలికి కూడా వెళ్ళవద్దు, వారినెవరినీ  నా దగ్గరకు తీసుకుని రావద్దు–అంటాడు యమధర్మరాజు తన భటులతో...అందులో. అందుకే లోకంలో ఒక సామెత ఉంది... ‘‘అసారే ఖలు సంసారే సారమేతచ్చతుష్టయం కాశ్యం వాసః సతాం సంగో  గంగభః శంభుసేవనమ్‌’’. ఈ నాలుగు విషయాలు చాలా గొప్పవని తెలుసుకుని బతుకు..అని బోధిస్తారు. ఇవి తెలుసుకోకపోతే అసారమైన జీవితంలో ఉండిపోతావు.

అసారం..అంటే నీవెంట వచ్చేది కాదు, నీ ఆత్మోద్ధరణకు వచ్చేది కాదు, నీ జీవితాన్ని చక్కదిద్దేది కాదు. ఏవి చాలా గొప్పవి.. అంటే.. కాశీపట్టణానికి వెళ్ళి ఉండడం, సతాంసంగో–సత్పురుషులతో స్నేహం, గంగానదిలోస్నానం చేయడం, శంభుసేవనమ్‌–శివార్చన చేయడం. ఈ నాలుగింటికన్నా సారవంతమయినవి జీవితంలో ఉండవు. సతాంసంగో.. సత్పురుషులతో సహవాసం చాలా గొప్పది.


‘‘గంగాపాపం శశీతాపం దైన్యం కల్పతరుస్తథా పాపం తాపం చ దైన్యం చ ఘ్నన్నిత్‌ సంతో మహాశయః’’ అంటారు. గంగలో స్నానం చేస్తే పాపాలు మాత్రమే పోతాయి, ఎంత వేసవికాలంలో అయినా శరీరంలో ఎంత తాపం కలిగినా, ఒక్కసారి చంద్రుడిని చూసి వెన్నెలలోకి చేరారనుకోండి కేవలం తాపం మాత్రం పోతుంది. కల్పవృక్షం దగ్గరకు చేరితే దరిద్రం మాత్రమే పోతుంది. అదే సత్పురుషులతో కలిసి ఉంటే పాపాలు, తాపాలు, దరిద్రం అన్నీ పోతాయి. తమ కష్టాలను పక్కనబెట్టి ఇతరుల కష్టాలను తమవిగా పరిగణిస్తారు సజ్జనులు. మీ దగ్గర ఏవో ఆశించి అలా చేయరు. అది వారి సహజ లక్షణం. దీనుల విషయంలో వారి మనసు కరిగిపోతుంది. బద్దెన గారు సుమతీ శతకంద్వారా ఇస్తున్న సందేశం కూడా ఇదే .. ‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్‌ ...’’.. దుర్జనులతో స్నేహం చేయవద్దు అని.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
 

మరిన్ని వార్తలు