అరటిపండుతో పునుగులు ట్రై చేశారా?

31 Jan, 2021 11:27 IST|Sakshi

స్నాక్‌ సెంటర్‌

ఎగ్‌ బన్స్
కావలసినవి: గుడ్లు – 6
బన్స్ – 6, ఉల్లిపాయలు – 3
పచ్చిమిర్చి – 2
చీజ్‌ తురుము – 2 టీ స్పూన్లు
కొత్తిమీర తురుము – 1 టేబుల్‌ స్పూన్‌ 
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – అర టీ స్పూన్‌ 
కారం – 1 టీ స్పూన్‌
మిరియాల పొడి – 1 లేదా 2 టీ స్పూన్లు
ఉప్పు – తగినంత
తయారీ: ముందుగా బన్స్‌ పైభాగం తొలగించి గుంతల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చీజ్‌ తురుము, కొత్తిమీర తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అభిరుచిని బట్టి మరిన్ని జోడించుకోవచ్చు. ఆ మొత్తం మిశ్రమాన్ని కొద్దికొద్దిగా బన్స్‌ బౌల్స్‌లో వేసుకుని.. ప్రతి బన్‌లో ఒక కోడిగుడ్డు కొట్టి.. ఓవెన్‌లో ఉడికించుకుంటే భలే రుచిగా ఉంటాయి.

ఆపిల్‌ కోవా హల్వా

కావలసినవి: ఆపిల్స్‌ – 3 (పైతొక్క తొలగించి గుజ్జులా చేసుకోవాలి)
బాదం గుజ్జు – 3 టేబుల్‌ స్పూన్లు
కోవా – అర కప్పు
దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్‌ 
పంచదార – అర కప్పు
నెయ్యి – 4 లేదా 5 టేబుల్‌ స్పూన్లు
తయారీ: ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. 3 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేడికాగానే.. ఆపిల్‌ గుజ్జు, బాదం గుజ్జు వేసుకుని గరిటెతో తిప్పుతూ.. ఉడికించుకోవాలి. అందులో పంచదార యాడ్‌ చేసుకుని, బాగా కరిగే వరకూ తిప్పుతూ ఉండాలి. కోవా, దాల్చిన చెక్క పొడి వేసుకుని బాగా కలుపుతూ దగ్గరపడే వరకూ తిప్పుతూ మిగిలిన నెయ్యి వేసుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. 

అరటిపండు పునుగులు

కావలసినవి:
అరటి పండ్లు – 4 (మెత్తగా గుజ్జులా చేసుకోవాలి)
గోధుమ పిండి – పావు కప్పు
బియ్యప్పిండి – పావు కప్పు
మైదా పిండి – పావు కప్పు
మొక్కజొన్న పిండి – ముప్పావు కప్పు
ఉప్పు – తగినంత
బేకింగ్‌ పౌడర్‌ – 1 టీ స్పూన్‌
పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు
నూనె – డీప్‌ ఫ్రై కి సరిపడా

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని.. అందులో అరటిపండ్ల గుజ్జు, గోధుమ పిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్‌ పౌడర్, పంచదార, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి జోడించి, బాగా కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కాగుతున్న నూనెలో పునుల్లా వేసుకుని దోరగా వేయించి సర్వ్‌ చేసుకోవాలి.
- సేకరణ: సంహిత నిమ్మన

మరిన్ని వార్తలు