వామ్మో.. మమ్మీల జులుస్‌.. ఎంత భయంకరంగా ఉందో!

3 Apr, 2021 06:47 IST|Sakshi
కైరోలోని ఈ ప్రధాన వీధిగుండానే నేడు మమ్మీల ఊరేగింపు

ఇరవై రెండు మంది రాజులు, రాణులు ఒకే దారిలో ఒకే వరుసలో ఒకరి వెనుక ఒకరు రథంపై ఊరేగింపుగా వెళుతుంటే కేవలం అదొక ఉత్సవంగా మాత్రమే ఉండదు. కన్నుల పండుగైన మహోత్సవంలా ఉంటుంది. ఈజిప్టు రాజధాని కైరోలోని ప్రజలు వీధులలో బారులు తీరి ఈరోజు (శనివారం) అటువంటి మహోత్సవాన్నే (జులుస్‌)వీక్షించబోతున్నారు. ఆశ్చర్యంగా.. అబ్బురంగా.. భయం భయంగా!! ఆశ్చర్యమూ, అబ్బురమూ ఎందుకో చెప్పనక్కర్లేదు. భయం మాత్రం.. ఆ రాజులు, రాణులు ‘మమ్మీలు’ అయినందుకు! భయం అంటే భయం అని కాదు. థ్రిల్లింగ్‌గా అనుకోండి. 


నైట్రోజన్‌ నింపిన పెట్టెల్లో ఉంచి తరలిస్తున్నారు.

మమ్మీలను మ్యూజియంలో చూడ్డం ఆసక్తిగానే ఉంటుంది. ఏళ్ల నాటి చక్రవర్తి లేదా మహారాణ .. చనిపోయినా కూడా చెక్కు చెదరకుండా ఒక అద్దాల పెట్టె లోపలి నుంచి వెల్లకిలా పడుకుని కనిపిస్తున్నప్పుడు కనురెప్ప వేయకుండా నిలబడి తదేకంగా చూస్తూ వేల ఏళ్ల కాలంలోకి ప్రయాణించవచ్చు. అవే మమ్మీలు మనం రోజూ వెళ్లొచ్చే రహదారిలో రథంపైన ఒక బారుగా కదులుతూ కనిపిస్తుంటే వేల ఏళ్ల నాటి ఆ కాలమే ఇప్పుడు మన కళ్ల ముందు ప్రయాణిస్తున్నట్లుగా ఉంటుంది. ఇవాళ కైరోలో స్థానికులకు అలాంటి అపూర్వమైన సందర్భం అనుభవంలోకి రాబోతోంది. పద్దెనిమిది మంది మహారాజులు, నలుగురు మహారాణులు ఒకరి వెంట ఒకరు సెంట్రల్‌ కైరోలోని ‘ఈజిప్షియన్‌ మ్యూజియం’ నుంచి బయల్దేరి అక్కడి సమీపంలోనే ఉన్న ‘నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఈజిప్షియన్‌’లో ‘కొలువు తీరుతారు’. ఈ నెల 18 నుంచి ఈ మమ్మీలన్నీ ఆ కొత్త ప్రదేశంలో తమ యథా‘పూర్వ’స్థితికి కొనసాగింపు గా సందర్శకుల వీక్షణ కోసం ఎదురు చూస్తుంటాయి. ‘మ్యూజియంలో ఉన్నవాటిని ఎప్పుడైనా వెళ్లి చూడవచ్చు. మ్యూజియంలోంచి రోడ్డు మీదకు వచ్చిన మమ్మీలను చూడ్డానికే త్వరపడాలి. మళ్లీ అవకాశం ఎప్పటికో గానీ రాదు’ అని ఈజిప్టు పురావస్తు శాఖ చాటింపు వేయిస్తోంది. బహుశా ఈ రోజు కనీసం 40 నిముషాల పాటు కైరో ప్రధాన రహదారి స్తంభించిపోవచ్చు. ఇంతవరకు మమ్మీలు ఉన్న ‘ఈజిప్షియన్‌ మ్యూజియం’ నుంచి ఇప్పుడు తరలబోతున్న ‘నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఈజిప్షియన్‌ సివిలైజేషన్‌’కి మధ్య దూరం 8 కి.మీ. సాధారణ ప్రయాణ దూరం 13 నిముషాలు. పదమూడు నిముషాల ప్రయాణానికి మమ్మీలకు నలభై నిముషాలు పట్టబోతోందంటే.. మమ్మీలు ఎంత నెమ్మదిగా, ఎంత పదిలంగా, ఎంత కదిలీ కదలనట్లుగా బట్వాడా అవబోతున్నాయో చూడండి. 

మమ్మీల రథయాత్ర (అవును. అలంకరించిన రథాల మీదనే గాజు పెట్టెలలోని మమ్మీలను అమర్చి, చుట్టూ ‘పొత్తిగిలి’ ఏర్పాటు చేసి ప్రాణం పోకుండా వాటిని తీసుకెళతారు). ఆల్రెడీ ప్రాణం పోయిన వాటికి మళ్లీ ప్రాణం పోవడం ఏమిటి? ఇది పురావస్తు ప్రేమికుల భాష. ప్రాణం పోయాక కూడా మమ్మీలు వేల ఏళ్లపాటు భద్రంగా ఉన్నాయంటే ప్రాణంతో ఉన్నట్లుగా వారు భావిస్తారు. కదలికల వల్ల కాళ్లో, వేళ్లో, కళ్లో కాస్త చెదిరినా వాటి ప్రాణం పోయినట్లే. మళ్లీ వాటిని అతికించడానికి ఓ పెద్ద సర్జరీనే అవసరం అవుతుంది. సర్జరీ చేసినట్లు కనిపిస్తే అప్పుడది అతికించినట్లే అవుతుంది తప్ప అమరిక అవదు. అందుకే అంత జాగ్రత్త. ఈ మహా ఊరేగింపునకు ఈజిప్టు ప్రభుత్వం ‘ఫారోస్‌ గోల్డెన్‌ పరేyŠ ’ అనే పేరు పెట్టింది. ప్రాచీన ఈజిప్టు పాలకుల్ని ఫారోలు అంటారు. అందుకే పరేడ్‌కు ఆ పేరు. ఈ పరేడ్‌ ఒక క్రమబద్ధమైన విధానంలో జరుగుతుంది. ముందు వయసులో పెద్దవారు, తర్వాత వారికన్నా చిన్నవారు. ఇదీ మమ్మీల రాజులు, మమ్మీ రాణుల వరుస.  మమ్మీలను ఉంచిన రథాల అలంకరణ పూర్తిగా ఈజిప్టు సంప్రదాయ శైలిలో ఉంటుంది. అలంకరణ రథానికే తప్ప మమ్మీల గాజు పెట్టెలకు కాదు. మమ్మీలు ఇప్పుడున్న మ్యూజియం శతాబ్దం క్రితం నాటిది. తరలబోతున్న మ్యూజియం ఇటీవలి కాలం నాటిది. 2017 లో ప్రారంభం అయింది. మమ్మీలను ఆ కొత్త మ్యూజియంలో దించాక వాటిని కాస్త ఎత్తున, ఆధునీకరించిన కుదుళ్లలో వీక్షలకు మరింత చక్కగా కనిపించేలా అమర్చుతారు. మిగతా పరిరక్షణ విధానమంతా మామూలే. సమతుల ఉష్ణోగ్రతల వద్ద మమ్మీలను ఉంచడం ప్రధానం. అందుకోసం కొత్త మ్యూజియంలో మెరుగైన ఏర్పాట్లు ఉన్నాయి. 

మ్యూజియంలో అవసరం లేదు కానీ.. రథయాత్రలోనే మమ్మీలకు గట్టి ‘స్థిర’ భద్రతలు ఉండాలి. ప్రయాణ మార్గంలో ఎగుడు దిగుళ్లను ఇప్పటికే  చదును చేసి ఉంచారు. ఒక్కో మమ్మీని పెట్టిన పెట్టె పసిడివర్ణంలోని ఒక్కో రథంలో ఉంటుంది. ఆ రథంపై ఆ మమ్మీ పేరు, ఏ రాజ్యానికి పాలకుడు / పాలకురాలు అనే వివరాలు ఉంటాయి. అందరి కన్నా ముందు వరసలో రెండవ సీకెనార్‌ తావో చక్రవర్తి రథం ఉంటుంది. క్రీ.పూ. 1560–1555 కాలం నాటి పాలకుడు ఆయన. ‘ధైర్యవంతుడు’ అని పేరు. ఆయన వెనుకే తొమ్మిదవ రామ్సీస్‌ మమ్మీ రథం కదులుతుంది. క్రీ.పూ. 12వ శతాబ్దం చక్రవర్తి రామ్సీస్‌. ఆ వెనుక రెండవ రామ్సీస్‌ చక్రవర్తి, ఆ వెనుక మహా రాణి హాట్షిప్సట్‌. అతి శక్తిమంతురాలిగా ఆమె ప్రసిద్ధి. ఆ వెనుక ఒకరొకరుగా వయసుల వారీగానే కాకుండా చారిత్రక ప్రాధాన్యాన్ని బట్టి కూడా మెల్లిగా ‘కదులుతారు’. వాళ్ల కాలమాన ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ రథయానం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సాగుతుంది. ఊరేగింపులో చక్కటి వాద్య ధ్వనులు ఉంటాయి. ఈజిప్టు కళాకారుల నృత్యాలు ఉంటాయి. ఈ తతంగం అంతా లైవ్‌లో టీవీలో ప్రసారం అవుతుంది.

దొరికిన చోటు
కైరోలోని చరిత్రాత్మక ప్రాంతమైన ‘తహ్రీర్‌ స్క్వేర్‌’ లో ఉన్న ‘ఈజిప్షియన్‌ మ్యూజియం’లో గత వందేళ్లుగా ఈ 22 రెండు మమ్మీలు ఉన్నాయి. 1881 నుంచి, ఈజిప్టులో నైలు నదికి తూర్పుఒడ్డున ఉన్న లక్సర్‌ నగరంలో జరుగుతూ వస్తున్న పురావస్తు అన్వేషణల్లో బయట పడిన ఈ మూడు వేల ఏళ్ల నాటి ఈ మమ్మీలను ఈజిప్షియన్‌ మ్యూజియంకి చేర్చాక, 1950 లలో ఒక చిన్న అద్దాల గదిలోకి మార్చి, సందర్శకుల వీక్షణ కోసం ఒక దాని పక్కన ఒకటిగా పెట్టి, వాటిపై ఆ మమ్మీలు ఎవరివో వివరాలు రాసి ఉంచారు. డెబ్బై ఏళ్ల తర్వాత ఇప్పుడు తొలిసారి వీటిని నేషనల్‌ మ్యూజియంలోకి మార్చడం కోసం నైట్రోజన్‌ నింపిన పెట్టెల్లో ఉంచి తరలిస్తున్నారు. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు