ఏడు వింతలే అని ఎవరు చెప్పారు? ఇది ఎనిమిదో వింత!

10 Jul, 2021 09:14 IST|Sakshi

Kolkata Eco Park: ఈఫిల్‌ టవర్‌ చూడాలంటే... యూరప్‌ ట్రిప్‌ అక్కర్లేదిప్పుడు. వెస్ట్‌బెంగాల్‌ టూర్‌ చాలు.
కోల్‌కతా నగరం... పారిస్‌ ఈఫిల్‌ టవర్‌కు ఏ మాత్రం తీసిపోని ప్రతిరూపాన్ని నిర్మించింది.

విస్తారమైన పార్కింగ్‌ లాట్‌తో చాలా ముందుచూపుతో నిర్మించిన టూరిస్ట్‌ ప్రదేశం ఇది. ఎంట్రీ టికెట్‌ కేవలం ముప్పై రూపాయలు. పచ్చటి లాన్‌లలో చేతులు పట్టుకుని విహరించే పర్యాటక ప్రేమికులు, సరస్సులో బోట్‌ షికారు చేస్తూ కేరింతలు కొట్టే పిల్లలు, పిల్లగాలికి మెల్లగా కదిలే తేలికపాటి అలలను ఆస్వాదించడానికి ఒడ్డున బెంచీల మీద సీనియర్‌ సిటిజెన్, సైకిల్‌ తీసుకుని ఆవరణ అంతా తిరిగి చూస్తున్న యూత్, మూడు ఎంట్రీ గేట్‌లు... ఈ దృశ్యమే ఈ పార్క్‌ మనం అనుకున్నంతకంటే ఇంకా చాలా పెద్దది కావచ్చేమోననే సందేహాన్ని కలిగిస్తుంది. ఈ టవర్‌ వ్యూ పాయింట్‌ నుంచి దాదాపుగా కోల్‌కతా నగరమంతటినీ చూడవచ్చు.


రోమన్‌ కలోజియం నమూనా

ఏడు వింతల ప్రతిరూపం
ఈ ఎకో పార్క్‌ ఈఫిల్‌ టవర్‌ ప్రతిరూపంతో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ తాజ్‌మహల్, గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనాతోపాటు ప్రపంచంలోని ఏడు వింతల కట్టడాలకూ ప్రతిరూపాలున్నాయి. లండన్‌ బిగ్‌బెన్‌ టవర్, జపాన్‌ గార్డెన్, బెంగాలీ గ్రామం, హెర్బల్‌ గార్డెన్‌లతో కనువిందు చేస్తున్న ఈ ప్రదేశం ఆనందమయమైన విహారానికి అధునాతనమైన వేదిక.

మరో సంగతి!

కోల్‌కతా ఈఫిల్‌ టవర్‌ గురించి తెలిసిన వెంటనే మనకు ఇండియాలో ఈఫిల్‌ టవర్‌ అనే ట్యాగ్‌లైన్‌ గుర్తుకువస్తుంది. కానీ ఇంతకంటే ముందు మనదేశంలో ఈఫిల్‌ టవర్‌కు మరో రెండు ప్రతిరూపాలున్నాయి. చండీగఢ్‌లో పన్నెండు మీటర్ల ఎత్తులో ఒకటి ఉంది. రాజస్థాన్‌ రాష్ట్రం కోట నగరంలో ఒకటి ఉంది. అయితే వీటన్నింటిలోకి కోల్‌కతాలోని ఈఫిల్‌ టవర్‌ ప్రతిరూపం మాత్రమే పారిస్‌లోని అసలు ఈఫిల్‌ టవర్‌ను అచ్చంగా మూసపోసినట్లు ఉంటుంది.

ఎకోపార్కులోని ఈజిప్టు గిజా పిరమిడ్‌ నమూనా

ఈఫిల్‌ టవర్‌ ప్రతిరూపం తోపాటు ఈ వింతలన్నీ కోల్‌కతాలోని ఎకో పార్కులో ఉన్నాయి. ఇక్కడి ఈఫిల్‌ టవర్‌ పద్దెనిమిది అంతస్థుల నిర్మాణం, ఎత్తు 55 మీటర్లు (పారిస్‌ టవర్‌ ఎత్తు 324 మీటర్లు). 2015లో మొదలు పెట్టి నాలుగేళ్లలో పూర్తి చేశారు. ఈ పార్కు 2020లో పర్యాటక ద్వారాలు తెరుచుకుంది .

∙ఎకోపార్కులోని తాజ్‌మహల్‌ నమూనా (పై ఫొటో)


క్రైస్ట్‌ రిడీమర్‌ విగ్రహం దగ్గర టూరిస్ట్‌

మరిన్ని వార్తలు