మనసున్న మారాజు..

15 Apr, 2022 12:44 IST|Sakshi
రాజు కేంద్రె  

శిఖరం చేరడమే విజయం అనుకుంటే...అది చేరే ప్రస్థానంలో కష్టాలు పడుతున్న వారికి చేయూత ఇచ్చి, వెన్నుతట్టి, దారి చూపడం ఘన విజయం. ‘ఏకలవ్య’ మూమెంట్‌ ద్వారా రాజు కేంద్రె ఆ పనే చేస్తున్నాడు...

విదర్భ(మహారాష్ట్ర)లోని సంచార తెగల్లో చదువు అనేది అరుదైన విషయం. అయితే రాజు కేంద్రె తల్లిదండ్రులు మాత్రం చదువుకు బాగా విలువ ఇచ్చారు. తమకు అక్షరం ముక్క రాకపోయినా పిల్లలను మాత్రం అవకాశం ఉన్నంత వరకు చదివించాలనుకున్నారు. రాజు చదువు ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగింది. హైస్కూలు వరకు పెద్దగా తెలియలేదుగానీ, కాలేజిలో చేరిన తరువాత రకరకాల దూరాలు పరిచయం అయ్యాయి. ఇంగ్లీష్‌కు తనకు మధ్య ఉండే దూరం, కమ్యూనికెషన్స్‌ స్కిల్క్‌కు తనకు మధ్య ఉండే దూరం, ఇంకా రకరకాల ఆర్థిక, సామాజిక దూరాలు!

పుణె యూనివర్శిటీలో చదువుకోవాలనుకున్నప్పుడు కూడా ఇదే దూరం తనకు అడ్డుగా నిలిచించి. బుల్దాన జిల్లాలోని తన ఊరు నుంచి అక్కడికి 400 కిలోమీటర్ల దూరం. పుణె వెళ్లి చదువుకోవాలంటే, చదువు సంగతి సరే ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. దీంతో యశ్వంత్‌రావు చవాన్‌ మహారాష్ట్ర ఒపెన్‌ యూనివర్శిటీలో చదుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత... టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(తుల్జాపూర్‌)లో చేరడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. మేల్ఘాట్‌లోని ‘కొర్కు’లాంటి గ్రాస్‌రూట్‌ కమ్యూనిటీలతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. వారి పనితీరు, నైపుణ్యాలను దగ్గరి నుంచి చూశాడు. ‘వీరికి చదువు వస్తే ఎన్ని గొప్ప విజయాలు సాధించేవారో కదా’ అనుకున్నాడు.

అట్టడుగు వర్గాల విద్యార్థుల కోసం ‘ఏకలవ్య ఇండియా’ అనే స్వచ్ఛందసంస్థకు ఉద్యమస్ఫూర్తితో శ్రీకారం చుట్టాడు రాజు. స్పోకెన్‌ ఇంగ్లీష్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, సాఫ్ట్‌ స్కిల్స్, క్రిటికల్‌ థింకింగ్, టెక్నాలజికల్‌ స్కిల్స్, మాక్‌ ఇంటర్వ్యూ వరకు ఎన్నో నేర్పిస్తుంది ఏకలవ్య. దీంతో పాటు చదువుల ప్రస్థానంలో తన కష్టాల నుంచి ప్రతిష్ఠాత్మకమైన చీవ్‌నింగ్‌ స్కాలర్‌షిప్‌(యూకే గవర్నమెంట్‌ ఇంటర్నేషనల్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాం) గెలుచుకోవడం వరకు ఎన్నో విషయాలు చెబుతున్నాడు రాజు. అట్టడుగు వర్గాల తొలితరం విద్యార్థులకు కొండంత అండగా ఉన్న ‘ఏకలవ్య’కు ఎంటర్‌ప్రెన్యూర్స్, సోషల్‌ వర్కర్స్, డాక్టర్లు, వివిధ రంగాల ప్రముఖలు సహకారం అందిస్తున్నారు.

‘ఏకలవ్య’ ఆర్గనైజేషన్‌ ఇప్పటి వరకు 300 మంది విద్యార్థులు ప్రముఖ విశ్వవిద్యాలయాలలో చదువుకునేందుకు సహాయం చేసింది. చదువు విలువ గురించి పేదకుటుంబాల దగ్గరకి వెళ్లి ప్రచారం చేస్తుంది ఏకలవ్య, 2030 నాటికి వెయ్యిమంది వరకు గ్రాస్‌రూట్స్‌ లీడర్స్‌ను తయారుచేయాలనేది ‘ఏకలవ్య’ లక్ష్యంగా పెట్టుకుంది. ‘అట్టడుగు వర్గాల గురించి అంకితభావంతో పనిచేస్తున్న రాజు ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తున్నాడు’ అని ప్రశంసపూర్వకంగా అంటున్నారు స్కూల్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(టిస్‌) అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కృష్ణ సుధీర్‌ పటోజు.
 

మరిన్ని వార్తలు