Eksha Hangma Subba: సూపర్‌ ఉమన్‌!

19 Oct, 2021 00:37 IST|Sakshi

ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు విమానాలను కూడా అవలీలగా నడిపేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో నైపుణ్యంతో రాణిస్తూంటే ‘ఇక్షా హంగ్మా సుబ్బ’ మాత్రం నాలుగు నైపుణ్యాలతో వందమందిలో ఒక్కటిగా దూసుకుపోతుంది. ఇక్షా హంగ్మా సుబ్బ.. ఏంటీ అనిపిస్తుంది కదూ! అవును ఈ పేరు పలకడానికి, వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నట్టుగానే ఇక్షా వృత్తినైపుణ్యాలు ఒకదానికి ఒకటి పొంతన లేకపోయినప్పటికీ, తనదైన శైలిలో రాణిస్తూ అందరిచేత సూపర్‌ ఉమన్‌ అనిపిస్తోంది.  

బోల్డ్‌ అండ్‌ బ్యూటిపుల్‌గా పేరొందిన ఇక్షా.. సిక్కిం పోలీస్‌ ఆఫీసర్, జాతీయ స్థాయి బాక్సర్, బైకర్, ఎమ్‌టీవీ సూపర్‌ మోడల్‌. సిక్కిం రాష్ట్రంలోని పశ్చిమ జిల్లా సొంబారియా గ్రామంలో ఐతరాజ్, సుకర్ణి సుబ్బా దంపతులకు 2000 సంవత్సరంలో ఇక్షా జన్మిచింది. ఒక సోదరుడు ఉన్నాడు. ప్రైమరీ,సెకండరీ విద్యాభ్యాసం అంతా సొంతూరులోనే పూర్తి చేసింది. తరువాత గ్యాంగ్‌టక్‌లోని బహదూర్‌ భండారీ కాలేజీలో డిగ్రీలో చేరింది. ఈ సమయం లోనే ఎన్‌ఎస్‌ఎస్‌లోలో చేరింది.

చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే ఇక్షాకు నటన అన్నా... మోడలింగ్‌ అన్నా అమితాసక్తి. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల మూలంగా డిగ్రీ చదువుతూనే పోలీసు ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ అయ్యి మంచి మార్కులతో సిక్కిం పోలీస్‌ విభాగంలో చేరింది. 14 నెలల శిక్షణ తరువాత ‘యాంటీ రైట్‌ ఫోర్స్‌’ విభాగంలో పోలీస్‌ ఆధికారిగా చేరింది. ఉద్యోగంలో చేరి, కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడుతున్నప్పటికీ చిన్నప్పటినుంచి ఉన్న మోడలింగ్‌ ఆసక్తి వెలితిగా తోచింది తనకు.

మిస్‌ సిక్కిం..
 పోలీస్‌ ఉద్యోగం చేస్తున్నప్పటికీ స్కూల్లో ఉన్నప్పుడు వివిధ మోడలింగ్, ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపిటీషన్‌లలో పాల్గొని గెలిచిన సందర్భాలు, కాలేజీలో ‘మిస్‌ ఫ్రెషర్‌’గా టైటిల్‌ను గెలుచుకున్న సందర్భాలు తనకి గుర్తొచ్చేవి. తన గ్రామం నుంచి రాష్ట్రస్థాయి మోడలింగ్‌ పోటీలలో పాల్గొని మిస్‌ సిక్కిం టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో ఇక్షాకు మోడలింగ్‌లోకి వెళ్లేందుకు నమ్మకం కుదిరింది. అక్కడి నుంచి వివిధ రకాల మోడలింగ్‌ కాంపిటీషన్స్‌ లో పాల్గొనేది. ఈ క్రమంలోనే ఎమ్‌టీవీ సూపర్‌ మోడల్‌ –2 రియాల్టీ షో ఆడిషన్స్‌కు హాజరై సెలక్ట్‌ అయింది.

ఈ సెలక్షన్స్‌ ద్వారా ఇక్షా గురించి అందరికీ తెలిసింది. మొత్తం పదిహేనుమంది పాల్గొన్న ఈ షోలో మొదట టాప్‌ నైన్‌లో చోటు సంపాదించుకుని పాపులర్‌ అయ్యింది. పోటాపోటీగా జరుగుతున్న ఈ షోలో ప్రస్తుతం మూడవ స్థానంలో కొనసాగుతూ అందర్ని ఆకట్టుకుంటోంది. టెక్‌ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సూపర్‌ మోడల్‌గా ఇక్షాను పొగుడుతూ ట్వీట్‌ చేయడం, షో న్యాయనిర్ణేతలు కూడా ఇక్షాను అభినందిస్తుండంతో అంతా ఆమెను అభినందనలలో ముంచెత్తుతున్నారు.   

ఇక్షా ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు ఆటలు బాగా పనికొస్తాయని ప్రోత్సహించడంతో స్థానికంగా నిర్వహించే బాక్సింగ్‌ తరగతులకు హాజరై బాక్సింగ్‌ నేర్చుకుని జాతీయస్థాయి బాక్సర్‌గా ఎదిగింది. అలా ఒకపక్క బాక్సింగ్‌ చేస్తూనే మరోపక్క ఉద్యోగం చేస్తూ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ సూపర్‌ ఉమన్‌గా నిలుస్తోంది. ఇక్షాకు మోడలింగ్‌తోపాటు డ్రైవింగ్‌ కూడా చాలా ఇష్టం. అందుకే ఆమె కేటీఎమ్‌ ఆర్‌సీ 200 మోటర్‌ బైక్‌ నడుపుతూ లాంగ్‌ రైడ్స్‌కు వెళ్తుంటుంది. చిన్న వయసులో ఇన్ని రకాల నైపుణ్యాలతో దూసుకుపోతూ ఎంతోమంది యువతీయువకులకు ప్రేరణగా నిలుస్తోంది  ఇక్షా.

మరిన్ని వార్తలు