కడుపునిండా తినండి బాబూ!

26 May, 2022 00:48 IST|Sakshi

రెస్టారెంట్, ఫుడ్‌ కోర్టులలో కడుపునిండా భోంచేయాలంటే .. కనీసం రూ.200 పైనే వెచ్చించాల్సి ఉంటుంది. వివిధ వెరైటీ రుచులతో పుల్‌మీల్స్‌ ప్లేట్‌ తీసుకుంటే... హోటల్‌ ఉన్న ప్రాంతం, దానికి ఉన్న పాపులారిటిని బట్టి ప్లేటు రేటు ఉంటుంది. కొన్ని సార్లు పేరున్న రెస్టారెంట్లలో తిన్నప్పటికీ, భోజనం అంతరుచిగా ఉండదు.

ఇలాంటి హోటల్స్‌ ఉన్న ఈ రోజుల్లో తిన్నంత అన్నం, ఐదారు రకాల కూరలతో కడుపునిండా పెడుతున్నారు. ఎంతో రుచికరమైన భోజనం పెడుతూ నామమాత్రము ధర రూ.50 ఫుల్‌మీల్స్‌ అందిస్తున్నారు ఓ జంట. ఇంత తక్కువకు భోజనం పెడుతున్నారంటే ఏదో చారిటీ సంస్థో అనుకుంటే పొరపడినట్లే. ఒంట్లో జవసత్వాలు నీరసించినప్పటికీ కొన్నేళ్లుగా ఎంతో ప్రేమగా వండి వారుస్తూ వేలమంది మన్ననలు పొందుతున్నారు ఈ అజ్జా అజ్టీలు.

కర్ణాటకలోని మణిపాల్‌కు చెందిన వృద్ధ దంపతులే అజ్జా అజ్టీలు. రాజగోపాల్‌ నగర్‌ రోడ్‌లోని హోటల్‌ గణేష్‌ ప్రసాద్‌ (అజ్జా అజ్జీ మానే)ను 1951 నుంచి ఈ దంపతులు నడుపుతున్నారు. శాకాహార భోజనాన్ని అరిటాకు వేసి వడ్డించడాన్ని గత కొన్నేళ్లుగా సంప్రదాయంగా పాటిస్తున్నారు. అరిటాకు వేసి అన్నం, పప్పు, వేపుడు కూరలు, పచ్చడి, సలాడ్, రసం, పెరుగు పెడతారు. ఇవన్నీ బయట హోటల్‌లో తినాలంటే కనీసం రెండువందల రూపాయలైనా చెల్లించాలి. కానీ వీరు కేవలం యాభైరూపాయలకే భోజనం పెడుతూ కడుపు నింపుతున్నారు. ఇక్కడ పెట్టే భోజనం రుచిగా, శుచిగా ఉండడంతో కస్టమర్లు ఎగబడి ఇష్టంగా తింటున్నారు.

ఇంట్లో వండిన వంట, తక్కువ రేటు, ప్రేమగా వడ్డిస్తుండడంతో ఈ హోటల్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. స్థానికంగా అంతా అజ్జాఅజ్జీ మానే అని పిలుచుకుంటుంటారు. వయసులో పెద్ద వాళ్లు కావడంతో కస్టమర్లకు ఆ దంపతులు తల్లిదండ్రులుగా, బామ్మ తాతయ్యలు వండిపెట్టినట్లుగా భావించి ఎంతో ఇష్టంగా తింటున్నారు. ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ వారు అనుకున్న దానిని కొనసాగిస్తున్నారు. ఈ దంపతుల గురించి ఇటీవల రక్షిత్‌ రాయ్‌ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం అజ్జాఅజ్జీలు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నారు. వీరి సేవాగుణం గురించి తెలిసిన నెటిజన్లు వీరిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.

మరిన్ని వార్తలు