‘నాకేం వద్దు.. నాకు ఇలా బతకడమే బాగుంది’

16 Sep, 2022 01:17 IST|Sakshi

వారం రోజులుగా ఈ ‘దాదీజీ’ (అవ్వ) వీడియో వైరల్‌ అవుతోంది. దానికి కారణం ముంబై మెట్రో రైళ్లల్లో ఈ దాదీజీ చాక్లెట్లు అమ్ముతూ కనిపించడమే. ఆమె కథ ఏమిటో. పిల్లలు చూస్తున్నారో లేదో. కాని తన జీవితం తాను బతకడానికి చక్కని నవ్వుతో తియ్యని చాక్లెట్లు అమ్ముతోంది. ఒక ప్రయాణికుడు ఆమె వీడియో సోషల్‌ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌ అయ్యింది. చాలామంది సాయం చేస్తామని వచ్చారు. ‘చాక్లెట్లు కొనండి చాలు’ అని సున్నితంగా, ఆత్మగౌరవంతో తిరస్కరించిందామె.

ముంబై లోకల్‌ ట్రైన్‌లలో చక్కగా నవ్వుతూ, చుడీదార్‌లో చలాకీగా నడుస్తూ, చాక్లెట్లు అమ్మే ఆ పెద్దావిడను చూసి ఎవరో వారం క్రితం సోషల్‌ మీడియాలో పెట్టారు. ఆ వయసులో కూడా జీవించడానికి శ్రమ పడుతున్న ఆమెను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ అయితే ఆ వీడియోను ట్వీట్‌ చేసి అందరూ ఆమె దగ్గర చాక్లెట్లు కొనండి అని వినతి చేశారు. ఆ తర్వాత ‘హేమ్‌కుంట్‌ ఫౌండేషన్‌’కు చెందిన అహ్లూవాలియా అనే వ్యక్తి ఆమెకు పెద్ద ఎత్తున సాయం చేస్తాము ఆమె ఎక్కడ ఉంటుందో గుర్తించండి అని ముంబై వాసులను ఉద్దేశించి ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లను బాలీవుడ్‌ స్టార్లు కూడా రీట్వీట్‌ చేశారు. చాలామంది ముంబైవాసులు ‘మేము ఫలానా ట్రైన్‌లో చూశాం. ఆ స్టేషన్‌లో చూశాం’ అని స్పందనలు పెట్టారు. చివరకు వెతికి వెతికి ఆమెను పట్టుకున్నారు అహ్లూవాలియా మనుషులు.

ఆమె పేరు వజ్జీ... 
‘నా కుటుంబంలో సమస్య వచ్చింది. అప్పటినుంచి చాక్లెట్లు అమ్ముతున్నా’ అని ఆమె చెప్పింది వజ్జీ. ఫౌండేషన్‌ సభ్యులు ఆమెకు వెంటనే పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ‘నాకేం వద్దు. నాకు ఇలా బతకడమే బాగుంది’ అని చెప్పిందామె. ‘నా మనుషులు ఆమె చాక్లెట్లను రెట్టింపు రేటు ఇచ్చి కొందామన్నా ఆమె ఇవ్వలేదు. మామూలు రేటుకే ఇచ్చింది. ఇకపై ప్రతి వారం ఆమె చాక్లెట్లు మొత్తం మేము కొంటాం. ఎందుకంటే ఆ ఒక్క రోజు ఆమె అన్ని రైళ్లు తిరిగే అవస్థ తప్పుతుంది’ అని ట్వీట్‌ చేశాడు అహ్లూవాలియా. ‘ఆమె ఆత్మగౌరవం చూసి మేమందరం ఆమెకు మరింత అభిమానులం అయ్యాం’ అని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ ఏవో సమస్యలు వస్తాయి. కాని వజ్జీలా నవ్వుతూ హుందాగా వాటిని ఎదుర్కొనడం తెలియాలి. వజ్జీ నుంచి గ్రహించాల్సిన పాఠం అదే. 

మరిన్ని వార్తలు