The Elephant Whisperers: ఆస్కార్‌ గెలిచిన ఇండియన్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్‌.. స్క్రిప్ట్‌రైటర్‌ ఈ అమ్మాయే!

18 Mar, 2023 17:01 IST|Sakshi

‘గరిమ పుర ఎవరు?’ అనే ప్రశ్నకు చాలామంది జవాబు  చెప్పలేకపోవచ్చు. ఆస్కార్‌ గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ గురించి తెలియని వారు తక్కువ మంది ఉండవచ్చు.

27 సంవత్సరాల గరిమ ఈ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌కు స్క్రిప్ట్‌రైటర్‌... పంజాబ్‌లోని పటియాలాలో పుట్టిన గరిమ హైస్కూల్‌ చదువు పూర్తికాగానే కళాశాల విద్య కోసం మహారాష్ట్రలోని పుణెకు వచ్చింది. అక్కడే తనకు ప్రపంచ సినిమాలు, లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలపై ఆసక్తి ఏర్పడింది.

‘సింబియాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మీడియా’లో పట్టా పుచ్చుకున్న తరువాత డాక్యుమెంటరీలపై మరింత ఆసక్తి పెరిగింది. డాక్యుమెంటరీలు తీయాలనుకొని ముంబైలో అడుగుపెట్టిన గరిమ ఒక మీడియా సంస్థలో చేరింది. ‘వృత్తి జీవితం బాగానే ఉందిగానీ తాను వచ్చింది ఇందు కోసం కాదు కదా!’ అని ఆలోచించింది.

ఎనిమిది నెలల తరువాత ఉద్యోగాన్ని వదులుకొని స్క్రిప్ట్‌ రైటర్‌గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ ప్రయత్నాలు ఫలించి వెబ్‌సిరీస్‌కు రాయడం మొదలుపెట్టింది. నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ ‘లిటిల్‌ థింగ్స్‌’ తో రైటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది గరిమ. పట్టణ ప్రజల జీవనశైలిపై తీసిన ఈ సిరీస్‌ కోసం తొలిసారిగా ఇతర రచయితలతో కలిసి పనిచేసింది.

ఒంటరిగా కూర్చుని, నిశ్శబ్ద వాతావరణంలో రాసే అలవాటు ఉన్న గరిమ ఇతర రచయితలతో కలిసి చర్చలు చేస్తూ రాయాల్సి వచ్చింది. ‘ఇతరులతో కూర్చొని చర్చిస్తూ రాయడం వల్ల మనల్ని మనం ఎంతో మెరుగు పరుచుకోవచ్చు. ఇలా కూడా ఆలోచించవచ్చా అనిపిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే కలానికి కొత్త మెరుపు వస్తుంది’ అంటుంది గరిమ.

2019లో వైల్ట్‌లైఫ్‌ డైరెక్టర్‌ గుంజన్‌ మీనన్‌ గరిమను డైరెక్టర్‌ కార్తికీ గోంజాల్వెజ్‌కు పరిచయం చేసింది. కార్తికీ దగ్గర ఒక మంచి కథ ఉంది. ఆమె మంచి రైటర్‌ కోసం వెదుకుతోంది. కట్‌ చేస్తే... 2020లో గరిమను వెదుక్కుంటూ కార్తికీ వచ్చింది. ఇక అప్పటి నుంచి స్క్రిప్ట్‌ రైటింగ్‌ పనుల్లోకి దిగింది గరిమ. అయితే ఇదేమీ కాల్పనిక స్క్రిప్ట్‌ కాదు.

నాలుగు గోడల మధ్య ఏకాంతంగా రాసుకునే స్క్రిప్ట్‌ కాదు. అడవి దారి పట్టాలి. అనాథ ఏనుగుల కళ్లలోకి చూసి మౌనంగా మాట్లాడాలి. వాటిని సొంత పిల్లల్లా ఆదరించిన దంపతుల మనసు పొరల్లోకి వెళ్లాలి. తెలుసుకున్నదానికి సృజన జోడించాలి. ‘30 ఏళ్లు కూడా దాటని ఈ అమ్మాయి ఇంత పనిచేయగలదా?’ అనే సందేహం ఎప్పుడూ కార్తికీ గోంజాల్వెజ్‌కు రాలేదు.

తనపై కార్తికీ పెట్టిన నమ్మకాన్ని గరిమ వృథా చేసుకోలేదు. స్క్రిప్ట్‌కు జవసత్వాలు ఇచ్చింది. ‘కాలం మారింది. స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల పుణ్యమా అని యువతరం చిత్రపరిశ్రమలోకి వెల్లువలా వస్తోంది. ఇప్పుడు ఒకరి సృజనాత్మక శ్రమను దోచుకోవడం అనేది కష్టం. కష్టపడే వారికి విజయం త్వరగా చేరువయ్యే కాలం ఇది’ అంటోంది గరిమ. అలనాటి పుస్తకాల నుంచి తాజాగా విడుదలైన పుస్తకాల వరకు ఎన్నో పుస్తకాలు చదువుతుంటుంది గరిమ.

1973లో వచ్చిన ఎరిక జోంగ్‌ ‘ఫియర్‌ ఆఫ్‌ ప్లైయింగ్‌’ పుస్తకం అన్నా, అందులో జోంగ్‌ రాసిన వాక్యం...‘ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది. అయితే అరుదైన ప్రతిభ అనేది మనం ఎంత సాధన చేస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం అనేదానిపైనే ఆధారపడి ఉంటుంది’ అనే వాక్యం అన్నా ఆమెకు చాలా ఇష్టం.

చదవండి: హ్యాపీ పేరెంటింగ్‌: వసపిట్ట పాఠాలు

మరిన్ని వార్తలు