ఆ ఉత్తరంలో ఐన్‌స్టీన్‌ భార్య ఏం రాసిందో చదవండి

3 Mar, 2021 07:02 IST|Sakshi

ఐన్‌స్టీన్‌ భౌతిక శాస్త్రవేత్త. భౌతిక శాస్త్రవేత్తతో పాటు ఆయనలో ఒక ప్రవక్తను, ఒక కాలజ్ఞుడిని చూసిన ఒకే ఒక వ్యక్తి ఆయన భార్య ఎల్సా! ఆమె తన అసహోదరుడు (కజిన్‌) ఎరిక్‌కి 1934 లో రాసిన ఒక ఉత్తరంలో ఐన్‌స్టీన్‌లోని భవిష్యదృష్టి గురించి ప్రస్తావించారు. ‘జైలు నుంచి విడుదల అయిన అడాల్ఫ్‌ హిట్లర్‌ అనే ఆ వ్యక్తి మారణహోమం సృష్టించి జర్మనీలోని యూదులందరినీ లక్షలాదిగా హతమార్చే అవకాశం ఉంది’ అని ఐన్‌స్టీన్‌ నాతో అన్నారు. ఆయన ఏదైనా సరిగ్గా ఊహించగలరు’ అంటూ రాసిన ఆ ఉత్తరం ఇప్పుడు యు.ఎస్‌.లో వేలానికి రావడంతో ఐన్‌స్టీన్‌తో ఎల్సాకు ఉన్న ‘అన్య విషయాల అన్యోన్యత’ ఆసక్తిని కలిగించే విశేషం అయింది.

ఐన్‌స్టీన్‌కు ఎల్సా రెండో భార్య. ఆమె పూర్తిపేరు ఎల్సా లోవెంథాల్‌. మొదటి భార్య మిలేవా 1919లో చనిపోవడంతో పెద్దవాళ్లు ఎల్సాను ఐన్‌స్టీన్‌కు ఇచ్చి చేశారు. అప్పటికి ఐన్‌స్టీన్‌ వయసు 40 ఏళ్లు. ఎల్సా వయసు 43 ఏళ్లు. భర్త కన్నా భార్య మూడేళ్లు పెద్ద. ఒక అంగరక్షకురాలిగా మాత్రమే ఆమె తన భార్య పాత్రను పోషించారు. ఐన్‌స్టీన్‌ అప్పటికే శాస్త్రవేత్తగా ప్రసిద్ధుడు. నిరంతరం దీర్ఘాలోచనలో ఉండేవారు. ఆయన్ని కలిసేందుకు కుప్పలు తెప్పలుగా కుహనా మేధావులు, ఆహ్వానం లేనివారి వస్తుండేవారు. వారి నుంచి ఐన్‌స్టీన్‌కు ఏకాంతం కల్పించడం కోసం ఎల్సా గేటు దగ్గరే కాపలా ఉండేవారు. ఐన్‌స్టీన్‌ లేరని చెప్పి పంపించేవారు. కొన్నిసార్లు ఎల్సా ఆయనకు ఆంతరంగిక సలహాదారుగా మారేవారు.

మాతృభూమిలో సొంత ఇల్లు లేకుంటే ఎలా అని ఆ మరో జగత్‌ మేధావి చేత జర్మనీలో 1929లో ఒక ఇల్లు కట్టించిన ఘనత ఆమెదే అయినా జర్మనీలో ఉండేందుకు ఆయన విముఖంగా ఉండేవారు. అందుకు హిట్లర్‌ ఒక కారణం. ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించిన మొదటి ప్రపంచ యుద్ధ సైనికుడిగా అరెస్ట్‌ అయి, జైల్లో శిక్షను అనుభవించి 1924లో హిట్లర్‌ విడుదలయీ రాగానే ఐన్‌స్టీన్‌ ఎల్సాతో అన్నమాట.. ‘ఇక కష్టమే’ అని. ఆ తర్వాతి మాట ‘యూదుల్ని బతకనివ్వడు’ అని. 1925లో హిట్లర్‌ ‘నాజీ’ పార్టీ పెట్టాడు. 1933లో జర్మనీకి అధినేత అయ్యాడు. ఆ యేడాదే ఐన్‌స్టీన్, ఎల్సా అమెరికా వెళ్లిపోయారు. ఆ సమయంలోనే.. జర్మనీలో యూదులపై హిట్లర్‌ పాల్పడబోయే దారుణాల గురించి భార్య దగ్గర మాట్లాడేవారు ఐన్‌స్టీన్‌. అందుకు కారణాలు విశ్లేషించేవారు. భర్తలో ఆమె ఒక కాలజ్ఞాని కనిపించింది అప్పుడే. ఆ సంగతినే తన కజిన్‌కి ఉత్తరంలో రాశారు.

‘యూదులపై జరగబోయే హింసాత్మక అకృత్యాల గురించి పదేళ్ల క్రితమే (1924) ఐన్‌స్టీన్‌ ఊహించారు’ అని 1934లో ఆమె రాసిన ఆ ఉత్తరంలో ఉంది! ఐన్‌స్టీన్‌ తన భార్యతో అన్నట్లే జరిగింది. 1939–45 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌ మొత్తం కోటీ 20 లక్షల మందిని ఊచకోత కోయించగా వారిలో 60 లక్షల మంది యూదులే! అదృష్టమో, దురదృష్టమో ఆ ఘోరకలికి మూడేళ్ల ముందే 1936లో తన అరవయ్యవ యేట ఎల్సా చనిపోయారు. యుద్ధం ముగిసిన పదేళ్లకు 1955లో ఐన్‌స్టీన్‌ తన డెబ్బయ్‌ ఆరేళ్ల వయసులో కన్నుమూశారు. ఎల్సా ప్రిన్‌స్టన్‌ (న్యూజెర్సీ) నుంచి జర్మనీలో ఉన్న తన కజిన్‌కి రాసిన ఆ ఉత్తరం యూ.ఎస్‌.లోని ప్రముఖ సంస్థ నేట్‌ డి శాండర్స్‌లో ప్రస్తుతం వేలానికి ఉంది. ఒక అజ్ఞాత వ్యక్తి ఆ ఉత్తరాన్ని వేలానికి ఉంచారు. 

మరిన్ని వార్తలు