నాన్నా... నీ స్పర్శ ఈ బొంత రూపంలో.. కూతురి భావోద్వేగం.. మదిని మెలిపెట్టే వీడియో!

2 Jul, 2022 09:31 IST|Sakshi

మనకు ఎంతో ఇష్టమైనవారు దూరమైనప్పుడు భరించలేని బాధ కలుగుతుంది. వారు లేకపోయినప్పటికీ జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉంటారు. దూరమైన వారు వాడిన వస్తువులు, వారికి ఇష్టమైన వాటిని ఇంట్లో జాగ్రత్తగా భద్రపరుస్తూ వారు ఉన్నట్లుగా భావిస్తుంటారు కొందరు.

కానీ నిఖిత అనే అమ్మాయి తన తండ్రి స్పర్శ మరింత దగ్గర ఉండాలని భావించింది. ఇందుకోసం తన తండ్రి ధరించిన దుస్తులను బొంతలుగా మార్చింది. ఆ బొంత స్పర్శలో తండ్రి ప్రేమను ఆస్వాదిస్తూ సాంత్వన పొందుతోంది. 
 
ముంబైకి చెందిన నిఖిత ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తోంది. ఎంతో సరదాగా ఉండే నిఖిత తండ్రి రెండేళ్ల క్రితం చనిపోయారు. తండ్రి మరణాన్ని కుటుంబం మొత్తం జీర్ణించుకోలేకపోయింది. చిన్నప్పటి నుంచి ఆయనతో గడిపిన క్షణాలు నిఖితకు పదేపదే గుర్తుకొచ్చేవి... ఇలా ఆలోచిస్తోన్న సమయంలో ఆయన ధరించిన బట్టలు కనిపించాయి నిఖితకు.

‘‘ఎంతో ఖరిదైన, మంచి రంగు రంగుల షర్ట్స్‌ ధరించేవారు నాన్న. వీటిని ఇలా వదిలేస్తే పాడైపోతాయి. వీటిని నాన్న జ్ఞాపకంగా భద్రంగా మార్చాలి’’ అనుకుంది. అనుకున్న వెంటనే తన తండ్రికి ఎంతో ఇష్టమైన పింక్, బ్లు కలర్‌ చొక్కాలన్నింటిని ప్యాక్‌ చేసి ‘పుర్కాల్‌ స్త్రీ శక్తి సమితి’ వాళ్లకు పంపింది.

పుర్కాల్‌ వారు ఆ చొక్కాలతో తయారు చేసిన బొంతలను అనుకోకుండా వాళ్ల నాన్న పుట్టినరోజు మార్చి 8న పంపించారు. ఈ విషయాన్ని తాజాగా జూన్‌ 19 ‘ఫాదర్స్‌ డే’ రోజున నిఖిత తన ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్లో పోస్టు చేసింది.  

ఇప్పటిదాక ఈ విషయం తెలియని నిఖిత సోదరుడు నిఖిత ఇచ్చిన బొంతను ఆశ్చర్యంతో తెరిచి చూసిన వీడియో, తన తండ్రి బతికి ఉన్నప్పుడు ఆనందంగా గడిపిన క్షణాలున్న వీడియోను పోస్టుచేస్తూ..‘‘నాన్న నువ్వు మా పక్కన లేకపోయినప్పటికీ, నీ స్పర్శ ఈ బొంత రూపంలో మమ్మల్ని ఎప్పుడూ వెచ్చగా ఉంచుతుంది’’ అని క్యాప్షన్‌తో పోస్టు చేసింది.

దీంతోపాటు తన తండ్రి చొక్కాలను బొంతగా ఎలా మార్చిందో వివరించి చెప్పింది. ఇప్పటిదాక నిఖిత పోస్టుకు పన్నెండు లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. లక్షమందికి పైగా యూజర్లు ఆమె చేసిన పనిని మెచ్చుకోలుగా లైక్‌ చేశారు. కొంతమంది యూజర్లు తమకిష్టమైన వారిని గుర్తుచేసుకుంటూనే, ఐడియా చాలా బావుంది. మేముకూడా ఇలా చేస్తామని భావోద్వేగ కామెంట్లు పెడుతుంటే నిఖిత పోస్టు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 

ఎంతో ఇష్టమైన వారిని కోల్పోయారని జీవితాంతం కుమిలిపోకుండా, వారి జ్ఞాపకాలను రకరకాలుగా భద్రపరచుకుంటూ వారు మనతోనే ఉన్నట్లు భావించవచ్చు అని నిఖిత ఆలోచన చెబుతోంది. దీని ద్వారా తమ వారిని కోల్పోయిన వారికి కొంత ఊరట కలుగుతుంది. 

పుర్కాల్‌.. 
చిన్ని స్వామి అనే పెద్దావిడ నిరుపేద మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో ‘పుర్కాల్‌ స్త్రీ శక్తి సమితి’ని డెహ్రాడూన్‌లో స్థాపించింది. చేతులతో తయారు చేయగల... ఇళ్లలో వినియోగించే వస్తువులు, ఫ్యాషన్‌ ఉత్పత్తుల తయారీలో మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తోంది.

గత పదిహేడేళ్లుగా డెహ్రడూన్‌లోని నలభై గ్రామాల్లోని దాదాపు రెండువందల మంది మహిళలకు ఈ సమితి బాసటగా నిలిచింది. వీరు రూపొందిస్తోన్న వాటిలో ముఖ్యమైనవి బొంతలు కాగా, కుషన్‌ కవర్స్, ఆఫ్రాన్స్, టీ కాసీస్, బ్యాగ్స్, సాఫ్ట్‌ టాయిస్, పెట్స్‌ కోసం ప్లేమ్యాట్స్‌ వంటివెన్నో తయారు చేసి విక్రయిస్తున్నారు. వీరు తయారు చేసినవే గాక, నిఖితలాంటి వాళ్లు ఇచ్చిన ఆర్డర్లను అందమైన జ్ఞాపకాలుగా మార్చడం వీరి ప్రత్యేకత. 

A post shared by Nikhita Kini (@nikhitakini)

మరిన్ని వార్తలు