ఈ బనానా రంగు, రుచి సెపరేట్‌!

28 Jul, 2022 15:33 IST|Sakshi

సోషల్‌ మీడియా పుణ్యమాని ప్రపంచంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతోంది. వింతలు విడ్డూరాలకు కొదవేలేదు. మనకు తెలియని ఎన్నో అద్భుత విషయాలు క్షణాల్లో తెలుస్తున్నాయి. తాజాగా తియ్యతియ్యని అరటి పళ్లు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. అరటిపళ్లు ఏంటీ? గొప్పదనం ఏం ఉంది? మామూలే కదా అనుకుంటున్నారా? అయితే మీరు ఇది చదవాల్సిందే. ఎందుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అరటి పళ్లు సాదాసీదావి కావు. రంగూ రుచిలోనూ చిత్రంగా అనిపించేవే ‘బ్లూ జావా బనానా లేదా నీలం రంగు అరటిపళ్లు’.  

ఆగ్నేయాసియాల్లో విరివిగా పండే బ్లూ జావా అరటిపళ్లు ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాలోని హవాయి, ఫిజీ వంటి ప్రాంతాల్లో ఇవి పండుతాయి. వెనీలా రుచిని కలిగి ఉండే ఈ నీలం అరటి పళ్లను బనానా ఐస్‌క్రీమ్, హవాయి బనానా అని కూడా పిలుస్తారు. మొదట్లో దక్షిణాసియా దేశాల్లోనే వీటిని ఎక్కువగా పండించేవారు.  నీలం రంగు అరటిపళ్లు హైబ్రిడ్‌ అని చెప్పవచ్చు. ఆగ్నేయాసియాలో పండే ‘ముసా బాల్‌బిసియానా, ముసా అక్యుమనిటా’ అనే  రెండు అరటి మొక్కల నుంచి ఉద్భవించిందే హైబ్రిడ్‌ నీలం రంగు బనానా.

మొదట్లో ఈ అరటిపళ్లు నీలం రంగులో ఉన్నప్పటికీ అవి పక్వానికి వచ్చాక క్రమంగా నీలం రంగు మసక బారుతుంది. సాధారణ అరటి పళ్ల కంటే ఇవి కాస్త పెద్దగా ఉండడమే గాక, ఎక్కువరోజులు తాజాగా ఉంటాయి. పైకి నీలంగా కనిపించే ఈ బనానా లోపల మాత్రం అన్నింటిలాగానే తెల్లగా ఉంటుంది. నలుపు రంగులో ఉన్న చిన్న విత్తనాలు ఉంటాయి. దీనిలో పొటాషియంతో పాటు ఇతర రకాల ఖనిజ పోషకాలు అధికంగా ఉండడం వల్ల మంచి స్నాక్‌గా దీన్నీ తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి సైతం ఇది బాగా ఉపయోగపడుతుంది.

అరటిపండును వంద గ్రాములను తీసుకుంటే  దానిలో ఫ్యాట్‌ 0.3 గ్రాములు, కార్బోహైడ్రేట్స్‌  22.8 గ్రాములు, 89 కేలరీలు ఉంటాయి. పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల రోజువారి ఆహారంలో ఈ బనానా తీసుకోవడం వల్ల బరువును అదుపులో కూడా ఉంచుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉండడంతో మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక బ్లూ బనానా చెట్టు ఆకులు కూడా బాగా ఉపయోగపడతాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలను వేడిగా, ఫ్రెష్‌గా ఉంచేందుకు వాడే అల్యూమినియం ఫాయిల్స్‌కు ప్రత్యామ్నాయంగా ఈ బనానా ఆకులను వాడవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్న విచిత్ర బ్లూ బనానాను వీలైతే ఒక్కసారైనా టేస్ట్‌ చేసి చూడండి. l

మరిన్ని వార్తలు