ఒక ఐడియా... కళను బతికిస్తోంది 

6 Apr, 2022 01:55 IST|Sakshi

తను కోరుకున్న వస్తువు దొరకనప్పుడు చాలా మంది పెద్దగా పట్టించుకోరు. ఉన్నదానితో సరిపెట్టుకుని పనిపూర్తిచేస్తారు. కానీ దొరకని వాటిని అందరికి అందుబాటులోకి తెచ్చే బిజినెస్‌ ఎందుకు చేయకూడదన్న ఒక ఐడియా వత్సల జీవితాన్నే మార్చేసి ఎంట్రప్రెన్యూర్‌గా మార్చింది. అందుకే మనకు వచ్చే ఐడియాలను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు.

ఐడియా వచ్చినప్పుడు అది సాధారణంగా అనిపించినప్పటికీ... ఆచరణలోకి వచ్చినప్పుడు వాటి విలువ, గొప్పతనాలు తెలుస్తాయి. కశ్మీర్‌కు చెందిన వత్సల తనకు పెళ్లికి కావలసిన కాశ్మీరీ సంప్రదాయక వస్త్రాలు, ఆభరణాలు దొరకకపోవడంతో కొంత నిరాశకు గురైంది. ఆ తర్వాత ఆ నిరాశ నుంచి పుట్టిన ఆలోచననే స్టార్టప్‌గా చేసుకుని అంచెలంచెలుగా పైకి ఎదిగింది. 

వత్సల హలి సొంత రాష్ట్రం కశ్మీర్‌ అయినప్పటికీ..తన తండ్రి ఉద్యోగ రీత్యా హరిద్వార్‌లో ఉండడంతో అక్కడే పుట్టిపెరిగింది. ఇంజినీరింగ్‌ అయ్యాక, కమ్యునికేషన్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చేసింది. ఎంబీఏ అయ్యాక ఓ అడ్వర్టైజింగ్‌ కంపెనీలో పనిచేసింది. తరువాత బెంగళూరులోని ఓలా కంపెనీలో పీఆర్‌ టీమ్‌లో ఉద్యోగిగా చేరింది. ఇక్కడ పనిచేసే సమయంలో అనేక స్టార్టప్‌ కంపెనీల ప్రారంభం, ఎదుగుదల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. అప్పటి నుంచి తాను కూడా ఏదైనా స్టార్టప్‌ ప్రారంభించాలని అనుకునేది వత్సల. ఓలాలో నాలుగేళ్లు పనిచేసాక... వత్సలకు పెళ్లి కుదిరింది.

తన పెళ్లికోసం బెంగళూరు, ఢిల్లీలలోని పెద్దపెద్ద మార్కెట్లలో షాపింగ్‌ చేయడం ప్రారంభించింది. ఎక్కడికెళ్లినా కశ్మీరీ శాలువలు తప్ప మరి ఇంకేమీ దొరకలేదు. కశ్మీరీ జరీతో తయారు చేసే చీరలు, ఆరీ ఎంబ్రాయిడరీ సూట్లు, డ్రెస్‌లు, జ్యూవెల్లరీలు ఏవీ దొరకలేదు. వత్సల షాపింగ్‌ పూర్తయింది కానీ ఎక్కడా కశ్మీరి సంప్రదాయానికి తగ్గట్టుగా ఉండేవి ఏవీ మార్కెట్లో దొరకడం లేదని నిరాశపడింది. అయినా ఉన్నవాటితో సర్దుకుని పెళ్లి చేసుకుంది.

ఉద్యోగం వదిలేసి.. 
పెళ్లి తరువాత ఏడాది పాటు ఉద్యోగం చేసింది. కానీ సొంత స్టార్టప్‌ పెట్టాలన్న కోరిక, కశ్మీరి సంప్రదాయ వస్త్రాలపై ఉన్న మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేసి, 2020లో ‘ఉర్జువ్‌– ద స్పిరిట్‌ ఆఫ్‌ కశ్మీర్‌’ పేరిట స్టార్టప్‌ను ప్రారంభించింది. ఉర్జువ్‌ ప్రారంభం సమయంలోనే.. కరోనా కూడా దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ‘‘అంతా శానిటైజర్ల వ్యాపారం పెడితే..నువ్వు బట్టల వ్యాపారం పెట్టావు? ఈ సమయంలో ఎవరు కొంటారు?’’ అని ఇంట్లో వాళ్లు, స్నేహితులు, బంధువులు నిరాశపరిచారు.

అయినా వత్సల ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. లక్షరూపాయలతో ఉర్జువ్‌ను ప్రారంభించి.. ఉన్నితో తయారు చేసిన స్టోల్స్‌ను మాత్రమే విక్రయించేది. ఇవి బాగా అమ్ముడవుతుండడంతో తరువాత కుర్తా, పీరాస్, సూట్లు, సమ్మర్‌ స్టోల్స్‌ అన్ని విక్రయిస్తోంది. బనారస్‌ వస్త్రంపై కశ్మీరి ఎంబ్రాయిడరీని వేస్తోంది. ఉర్జువ్‌ విక్రయాలలో ‘పష్మీనా’ శాలువలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఇవి వారసత్వంగా ఒకరి నుంచి ఒకరికి ఇచ్చుకుంటారు కశ్మీరీలు. అందుకే ఇవి ఎంతో ప్రత్యేకంగా అమ్ముడవుతాయి.

సోషల్‌ మీడియా ద్వారా.. 
వత్సల ఉత్పత్తులు నాణ్యంగానూ, కశ్మీరీ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుండడంతో చాలా వేగంగానే కస్టమర్లను ఆకర్షించాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా ఉర్జువ్‌ బాగా పాపులర్‌ అయ్యింది. తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి పరచడానికి ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌’లో ఫ్యాషన్‌ బిజినెస్‌ కోర్సు కూడా చేసింది వత్సల. ఒకపక్క సంప్రదాయ ఉత్పత్తులను విక్రయిస్తూనే.. కశ్మీరీ హస్తకళాకారులకు పనికల్పించి ఉపాధినిస్తోంది. ఈ కళానైపుణ్యాలను తరువాతి తరానికి అందించాలని తపనతో హస్తకళాకారులందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి వారి అభివృద్ధికి కృషిచేస్తోంది.

మరిన్ని వార్తలు