Russia- Ukraine: మూడో ముప్పు.. అసలు భయం అదే.. భారీ జనహనన ఆయుధాల వల్ల!

22 May, 2022 16:41 IST|Sakshi

ఫన్‌ డే: కవర్‌​ స్టోరీ

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం కొద్దిరోజులుగా అంతర్జాతీయ మీడియాను అట్టుడికిస్తోంది. ఈ రెండు దేశాల నడుమ ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం పర్యవసానాలపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం రోజులు గడిచే కొద్ది మరింతగా ముదిరి మూడో ప్రపంచయుద్ధానికి దారితీసే అవకాశాలు లేకపోలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆధునిక ప్రపంచం ఇప్పటికే రెండు ప్రపంచయుద్ధాలను చవిచూసింది. రెండో ప్రపంచయుద్ధం ఏకంగా అణుబాంబు ధాటి ఎలా ఉంటుందో మచ్చు చూపింది.

మూడో ప్రపంచయుద్ధం ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియకపోయినా, ఇదివరకటి రెండు ప్రపంచయుద్ధాలు మిగిల్చిన అనుభవాల నేపథ్యంలో అగ్రరాజ్యాలే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం ఇతోధికంగా సైనికశక్తిని, ఆయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తున్నాయి. అత్యంత ప్రమాదకరమైన జనహనన ఆయుధాలు యుద్ధంలో వినియోగంలోకి వస్తే, అప్పుడు భూమ్మీద జరగబోయే విలయం అంచనాలకు అందనిరీతిలో ఉంటుంది. 

ప్రపంచ జనాభాలో శాంతిని కోరుకునే సామాన్యులే ఎక్కువగా ఉన్నా, పాలకుల పుణ్యాన యుద్ధాలు సంభవిస్తూనే ఉన్నాయి. అంతర్జాతీయ వేదికలపై శాంతి ప్రవచనాలు వల్లించే అగ్రరాజ్యాలు సైనిక పాటవాన్ని, ఆయుధ సంపత్తిని విచ్చలవిడిగా పెంచుకుంటున్నాయి. అక్కడితోనే ఆగకుండా, స్వయంగా అధునాతన ఆయుధాలను తయారుచేసుకోలేని దేశాలకు ఆయుధాలను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాయి.

వనరుల కోసం చిన్న దేశాల్లో చిచ్చు రేపుతున్నాయి. చరిత్రను పరిశీలిస్తే, ప్రపంచంలో శాంతి నెలకొన్న కాలం తక్కువే. రాజ్యాల ఉనికి మొదలయ్యాక ఎక్కడో ఒకచోట యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఆధునిక చరిత్రనే తీసుకుంటే, రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత సోవియట్‌ రష్యా–అమెరికాల నడుమ ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగిన కాలాన్ని(1945–91) సుదీర్ఘ శాంతికాలంగా చరిత్రకారులు పరిగణిస్తున్నారు.

ఇది కూడా సంపూర్ణమైన శాంతికాలం కాదు, ‘సాపేక్షిక’ శాంతికాలం అనే వారు చెబుతున్నారు. సోవియట్‌ యూనియన్‌ ముక్కలయ్యాక అంతర్జాతీయంగా తలెత్తిన పరిణామాలతో అప్పటివరకు నెలకొన్న ‘సాపేక్షిక’ శాంతికాలానికి కూడా కాలం చెల్లింది. అప్పటి నుంచి ప్రపంచదేశాల సైనిక వ్యయం భారీగా పెరుగుతూ వస్తోంది. గడచిన రెండు దశాబ్దాలుగా సైనిక వ్యయం మరింతగా పెరిగింది.

గడచిన ఏడాది లెక్కల ప్రకారం ప్రపంచ దేశాల సైనిక వ్యయం 2 ట్రిలియన్‌ డాలర్లను అధిగమించినట్లు ‘స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ వెల్లడించింది. అంటే, ఈ మొత్తం మన భారతదేశ బడ్జెట్‌కు దాదాపు నాలుగు రెట్లు. అందులోనూ ఈ మొత్తంలో అమెరికా వాటానే అత్యధికంగా 39 శాతం వరకు ఉండటం గమనించాల్సిన అంశం.

రష్యా–అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న కాలంలోనే చైనా తృతీయ సైనికశక్తిగా ఆవిర్భవించింది. ప్రపంచ సైనిక శక్తుల్లో భారత్‌ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. సైనిక వ్యయంలో మాత్రం భారత్‌ మూడో స్థానంలో నిలుస్తోంది. ఈ అంశంలో  తొలి రెండు స్థానాల్లోను అమెరికా, చైనా నిలుస్తుండగా, రష్యా ఐదో స్థానంలో ఉండటం విశేషం.

అణ్వాయుధాలతోనే అసలు భయం
అణ్వాయుధాల వ్యాప్తి నిరోధానికి ఎన్ని అంతర్జాతీయ ఒడంబడికలు జరిగినా, పలు దేశాలు యథాశక్తి అణ్వాయుధాలను సమకూర్చుకుంటూనే ఉన్నాయి. అదను చూసుకుని అడపా దడపా అణ్వాయుధ పరీక్షలు జరుపుతూనే ఉన్నాయి. వర్తమాన ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా, అణ్వాయుధ ప్రయోగం జరిగే అవకాశాలను కొట్టిపారేయలేని పరిస్థితి.

ఈ అంశమే యుద్ధం పేరు చెబితేనే ప్రపంచం ఉలిక్కిపడేలా చేస్తోంది. ఎందుకంటే ఒక్కో అణ్వాయుధం కలిగించే విధ్వంసం మామూలుగా ఉండదు. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా ప్రయోగించిన అణుబాంబుల విధ్వంసం ఎరిగినదే. అప్పటి అణుబాంబులతో పోల్చుకుంటే, ఇప్పటికాలంలో వివిధ దేశాలు సమకూర్చుకున్న అణ్వాయుధాలు చాలా శక్తిమంతమైనవి. వీటిలో కొన్ని భారీస్థాయిలో విధ్వంసం సృష్టించగల ‘సూపర్‌ న్యూక్లియర్‌ బాంబులు’ కూడా ఉన్నాయి.

అంతర్జాతీయ సంస్థల అంచనాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల వద్ద 13,080 అణ్వాయుధాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగిస్తున్న రష్యా వద్దనే అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ యుద్ధంలో రష్యా సంయమనం కోల్పోయి, విచక్షణా రహితంగా అణ్వాయుధ దాడికి దిగితే, జరగబోయే నష్టం కేవలం ఉక్రెయిన్‌కి మాత్రమే పరిమితం కాదు.

దాని చుట్టుపక్కల దేశాల మీద కూడా ఆ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుంది. అణ్వాయుధ ప్రభావాన్ని భౌగోళిక, రాజకీయ సరిహద్దులు, కంచెలు అడ్డుకోలేవు. అవసరమైతే ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలనూ ప్రయోగిస్తామనే రీతిలో రష్యా చేస్తున్న బెదిరింపు ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 

అమెరికా–సోవియట్‌ రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగిన కాలంలో ఉభయ దేశాల మధ్య అణ్వాయుధాల పోటీ విపరీతంగా ఉండేది. ఒకదానితో మరొకటి పోటీ పడుతూ ఇబ్బడి ముబ్బడిగా అణ్వాయుధాలను తయారు చేసుకుని, పోగేసుకున్నాయి. ఈ రెండు దేశాల మధ్య 1980లలో అణ్వాయుధ పోటీ పెచ్చుమీరిందని, 1986లో తారస్థాయికి చేరుకుందని ‘బులెటిన్‌ ఆఫ్‌ అటామిక్‌ సైంటిస్ట్స్‌’ నివేదిక వెల్లడించింది.

1986లో రష్యా వద్ద 40 వేలకు పైచిలుకు, అమెరికా వద్ద 23 వేలకు పైచిలుకు అణ్వాయుధాలు ఉండేవి. ప్రచ్ఛన్నయుద్ధం కాస్త ప్రత్యక్షయుద్ధంగా పరిణమిస్తే, ఎదుటి దేశాన్ని పూర్తిగా నాశనం చేయాలనే లక్ష్యంతోనే ఉభయ దేశాలూ పోటాపోటీగా అణ్వాయుధాలను పోగేసుకున్నాయి. సోవియట్‌ రష్యా 1991లో ముక్కలవడంతో ప్రచ్ఛన్నయుద్ధానికి తెరపడింది.

ఆ తర్వాత అమెరికా, రష్యాలు వేలాది అణ్వాయుధాలను నిర్వీర్యం చేసుకున్నాయి. అయినప్పటికీ, ఈ రెండు దేశాల వద్దే ఇప్పటికీ అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయి. అణ్వాయుధాలకు తోడు అత్యంత శక్తిమంతమైన ఇతర రకాల బాంబులు, క్షిపణులు వంటివి కూడా ఈ దేశాలు పెద్దసంఖ్యలోనే పోగేసుకుంటున్నాయి.
అణ్వేతర బాంబుల్లో అమిత శక్తిమంతమైనవి

అణ్వేతర బాంబుల్లో అత్యంత శక్తిమంతమైన బాంబులు కొన్ని భారీ విధ్వంసాన్ని సృష్టించగలిగినవి ఉన్నాయి. అమెరికా 2003లో ‘జీబీయూ–43/బీ మాసివ్‌ ఆర్డ్‌నన్స్‌ ఎయిర్‌ బ్లాస్ట్‌’ (ఎంఓఏబీ) అనే భారీ బాంబును రూపొందించుకుంది. దీనిని ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’గా ప్రకటించుకుంది. ఏకంగా 9,800 కిలోల బరువుగల ఈ బాంబు పేలితే 11 టన్నుల టీఎన్‌టీ శక్తి విడుదలవుతుంది.

అమెరికాకు పోటీగా రష్యా 2007లో ‘ఏవియేషన్‌ థర్మోబేరిక్‌ బాంబ్‌ ఆఫ్‌ ఇంక్రీజ్డ్‌ పవర్‌’ (ఏటీబీఐపీ) అనే భారీ బాంబును రూపొందించుకుంది. దీనిని ‘ఫాదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’గా ప్రకటించుకుంది. దీని బరువు 7,100 కిలోలు కాగా, ఇది పేలితే 44 టీఎన్‌టీ శక్తి విడుదలవుతుంది. దీనికంటే ముందు, సోవియట్‌ యూనియన్‌గా ఉన్న సమయంలోనే రష్యా ‘జార్‌ బాంబా’ను రూపొందించుకుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బాంబు. దీని బరువు 27 వేల కిలోలు. ఇది పేలితే 50–58 మెగాటన్నుల టీఎన్‌టీ శక్తి విడుదలవుతుంది. గతంలో దీనిని పరీక్షించిన వీడియోను రష్యా 2020లో ‘యూట్యూబ్‌’లో విడుదల చేసింది. 

ఇదిలా ఉంటే, అమెరికాకు చెందిన ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’, రష్యాకు చెందిన ‘ఫాదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’ తరహాలోనే చైనా కూడా భారీస్థాయి బాంబును సొంతంగా రూపొందించుకున్నట్లు మూడేళ్ల కిందట కథనాలు వచ్చాయి. అయితే, ఆ బాంబు శక్తిసామర్థ్యాల వివరాలేవీ వెలుగులోకి రాలేదు. చైనా ఆ వివరాలను అధికారికంగా ప్రకటించలేదు.

అంతకంటే ముందు ఇజ్రాయెల్‌ నుంచి భారత్‌ ‘స్పైస్‌’ (స్మార్ట్‌ ప్రిసైస్‌ ఇంపాక్ట్‌ అండ్‌ కాస్ట్‌ ఎఫెక్టివ్‌) బాంబును భారత వైమానిక దళం కోసం కొనుగోలు చేసింది. దీని బరువు 907 కిలోలు. భారత్‌ సమకూర్చుకున్న ‘స్పైస్‌’బాంబుకు పోటీగానే చైనా తనదైన భారీ బాంబును స్వయంగా రూపొందించుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

భారీ జనహనన ఆయుధాలు
అగ్రరాజ్యాలు సహా పలు దేశాలు ఇప్పటికే అణ్వాయుధాలు సహా అనేక భారీ జనహనన ఆయుధాలు కలిగి ఉన్నాయి. అణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు, జైవ ఆయుధాలు వంటివి భారీ జనహనన ఆయుధాల (వెపన్స్‌ ఆఫ్‌ మాస్‌ డిస్ట్రక్షన్‌) కిందకే వస్తాయి. మొదటి ప్రపంచయుద్ధంలో జైవ, రసాయనిక ఆయుధాల వినియోగం వ్యాప్తిలోకి వచ్చింది.

ఈ ఆయుధాలు భారీ జననష్టాన్ని కలిగించడంతో 1925లో జెనీవా ఒడంబడిక జైవ, రసాయనిక ఆయుధాల వినియోగాన్ని నిషేధించింది. అయినా, ఇటలీ 1935లో ఈ నిషేధాన్ని బేఖాతరు చేస్తూ, ఇథియోపియాపై జరిపిన దాడుల్లో ‘మస్టర్డ్‌ గ్యాస్‌’ అనే రసాయనిక ఆయుధాన్ని ప్రయోగించింది. ఐక్యరాజ్య సమితి చొరవతో 1970లో అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒడంబడిక (ఎన్‌పీటీ) ఉనికిలోకి వచ్చింది.

చివరగా 2016 నాటికి 191 దేశాలు ఇందులో భాగస్వాములయ్యాయి. ఈ ఒడంబడికపై సంతకాలు చేసిన అగ్రరాజ్యాలేవీ తమ అణ్వాయుధాలను పూర్తిగా వదులుకోకపోవడం గమనార్హం. దీనిపై భారత్, ఇజ్రాయెల్, పాకిస్తాన్, దక్షిణ సూడాన్‌ దేశాలు మాత్రం ఇప్పటివరకు సంతకాలు చేయలేదు. 

ఉక్రెయిన్‌–రష్యా పోరు పరిస్థితులు
ఉక్రెయిన్‌పై రష్యా ఈ ఏడాది ఫిబ్రవరి 24న దండెత్తింది. అప్పటి నుంచి ఉభయ దేశాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ సమాజం ఈ పోరును యుద్ధంగానే గుర్తిస్తున్నా, రష్యా మాత్రం దీనిని సైనికచర్యగానే చెప్పుకుంటోంది. ఈ పోరులో అవసరమైతే ప్రయోగించడానికి సిద్ధంగా అణ్వాయుధాలను కూడా యుద్ధక్షేత్రానికి తరలిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించడంతో అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు మొదలయ్యాయి.

ఉక్రెయిన్‌–రష్యాల మధ్య మూడునెలలుగా కొనసాగుతున్న ఈ పోరులో ఇప్పటికే భారీనష్టం వాటిల్లింది. లక్షలాదిమంది ఉక్రెయిన్‌ పౌరులు దేశాన్ని విడిచిపెట్టి పొరుగు దేశాలకు వలసపోయారు. రష్యా సైనికదాడుల్లో వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. రష్యా దాడులపై ఉక్రెయిన్‌ సైన్యం ఇంకా ప్రతిఘటన కొనసాగిస్తూనే ఉంది. 

నిజానికి రష్యా–ఉక్రెయిన్‌ల మధ్య గొడవ ఈనాటిది కాదు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న క్రిమియా, లుహాన్‌స్క్, దోనెత్‌స్క్‌ ప్రాంతాల కోసం 2014 నుంచే ఉభయ దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఉక్రెయిన్‌పై ‘సైనిక చర్య’ను నిలిపివేయాలంటే క్రిమియా ప్రాంతాన్ని తమకు అప్పగించాలని, లుహాన్‌స్క్, దోనెత్‌స్క్‌ ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించాలని రష్యా పట్టుబడుతోంది.

ఉక్రెయిన్‌ ‘నాటో’లోను, యూరోపియన్‌ యూనియన్‌లోను చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలు తమ భద్రతకు ముప్పు కలిగించేవిగా ఉన్నాయని కూడా రష్యా ఆరోపిస్తోంది. పోరు మొదలైన తర్వాత పోలండ్‌–బెలారస్‌ సరిహద్దుల్లో రష్యా–ఉక్రెయిన్‌ ప్రతినిధులు జరిపిన శాంతిచర్చలు విఫలం కావడంతో ఇప్పటికీ ఉభయ బలగాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. 

ఐక్యరాజ్య సమితి సాధారణ సభ మార్చి 2న సమావేశమైనప్పుడు ఉక్రెయిన్‌పై పోరును విరమించుకోవాలని మెజారిటీ సభ్య దేశాలన్నీ రష్యాను డిమాండ్‌ చేశాయి. ఈ అంశంపై జరిపిన ఓటింగులో రష్యాకు వ్యతిరేకంగా 140 దేశాలు ఓటు వేశాయి. ఉక్రెయిన్‌లో జరుగుతున్న హింసకు, మానవతా సంక్షోభానికి రష్యా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఐక్యరాజ్య సమితిలోని అమెరికా రాయబారి లిండా థామస్‌ గ్రీన్‌ఫీల్డ్‌ తేల్చి చెప్పారు.

అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వెల్లువెత్తుతున్నా, రష్యా ఏమాత్రం పట్టించుకోకుండా ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్య సమితి గొంతును పట్టించుకోని రష్యా అధ్యక్షుడు పుతిన్, ఏదో ఒక దశలో సంయమనం కోల్పోయి, ఎన్‌పీటీని కూడా తుంగలోకి తొక్కి అణుదాడికి ఆదేశాలు జారీచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

అదే గనుక జరిగితే, ప్రపంచంలో అనేక విపరిణామాలు తప్పవు. పరిస్థితిని చక్కదిద్దడానికి అంతర్జాతీయ సమాజం అప్పుడు ఏం చేసినా, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగానే ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉక్రెయిన్‌కు బాసటగా ‘నాటో’ రంగంలోకి దిగినట్లయితే, తదనంతర పరిణామాలు మూడో ప్రపంచయుద్ధానికి దారితీసే అవకాశాలూ లేకపోలేదు.
 
సైనిక వ్యయంలో టాప్‌–5 దేశాలు (2021 సంవత్సరం)
దేశం    -    వ్యయం  (బిలియన్‌ డాలర్లలో)
అమెరికా    -    801.0
చైనా    -    293.0
భారత్‌ -         76.6
యునైటెడ్‌ కింగ్‌డమ్‌  -     68.4
రష్యా        -     65.9

ఈ పట్టికలోని మొత్తాల కంటే చైనా, రష్యాల సైనిక వ్యయం వాస్తవానికి మరింత ఎక్కువగానే ఉంటుందని, పరిమిత సరఫరాదారులు గల ఆయుధాల మార్కెట్, కరెన్సీల కొనుగోలు శక్తిలోని వ్యత్యాసాల కారణంగానే ఈ రెండు దేశాల సైనిక వ్యయం డాలర్లలో తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని ‘ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్ట్రాటెజిక్‌ స్టడీస్‌’ (ఐఐఎస్‌ఎస్‌) విశ్లేషిస్తోంది.

ఆ దేశాల వద్దనున్న సైనిక బలగాలు, ఆయుధాలు, సైనిక వాహనాలు వంటి అంశాలను పరిశీలిస్తే,  ఈ విషయం తేలికగానే అవగతమవుతుంది. ‘గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ ఇండెక్స్‌’ లెక్క ప్రకారం సైనిక పాటవాన్ని అంచనా వేయడంలో 0.0000 స్కోర్‌ అత్యుత్తమం. అయితే, దీనిని సాధించడం ఏ దేశానికైనా అసాధ్యం.

త్రివిధ దళాల్లోని సైనికుల సంఖ్య, ఆయుధ సంపత్తి, త్రివిధ సైనిక వాహనాలు, సాంకేతిక సామర్థ్యం సహా యాభై వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకుని, గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ ఇండెక్స్‌–2022 ప్రకటించిన జాబితా ప్రకారం ప్రపంచంలోని తొలి ఐదు బలమైన సైనికశక్తులు.

దేశం                  పవర్‌ ఇండెక్స్‌ స్కోర్‌

అమెరికా            0.0453
రష్యా                 0.0501
చైనా                 0.0511
భారత్‌              0.0979
జపాన్‌              0.1195

ఏ దేశం వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయంటే...
రష్యా- 6,257 
(క్రియాశీలమైనవి: 1,458, అందుబాటులో ఉన్నవి: 3,039, కాలం చెల్లినవి: 1,760)
అమెరికా- 5,550
(క్రియాశీలమైనవి: 1,389, అందుబాటులో ఉన్నవి: 2,361, కాలం చెల్లినవి: 1,800)
యునైటెడ్‌ కింగ్‌డమ్‌- 225 (అందుబాటులో ఉన్నవి)
ఫ్రాన్స్‌- 290 (అందుబాటులో ఉన్నవి)
చైనా- 350 (అందుబాటులో ఉన్నవి– చురుగ్గా అణ్వాయుధాలను పెంచుకుంటోంది)
పాకిస్తాన్‌- 165 (అందుబాటులో ఉన్నవి)
భారత్‌- 156 (అందుబాటులో ఉన్నవి)
ఇజ్రాయెల్‌- 90 (అందుబాటులో ఉన్నవి)
ఉత్తర కొరియా- 40–50 (అంచనా మాత్రమే. అసలు లెక్క ప్రపంచానికి తెలియదు) 

-∙పన్యాల జగన్నాథదాసు

మరిన్ని వార్తలు