ఈ ట్రెండ్‌ సామాన్యులను కూడా క్రియేటర్స్‌గా మారుస్తోంది..

9 Oct, 2021 16:11 IST|Sakshi

సృజనకు చేయూత

ఆర్జనకు ఆసరా–ఫేస్‌బుక్‌/ఇన్‌స్టా డైరెక్టర్‌ వెల్లడి

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లు ఇప్పుడు సృజనాత్మక వారధులు. యువ  విజయాలకు సారధులు. ఈ ట్రెండ్‌ సామాన్యులను కూడా క్రియేటర్స్‌గా మారుస్తున్న నేపధ్యంలో చక్కని కంటెంట్‌ని సృష్టిస్తున్న క్రియేటర్లకు విభిన్న మార్గాల్లో చేయూతని అందించేందుకు ఆయా సోషల్‌ మీడియా వేదికలు పలు కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నాయి. అందులో భాగంగా ‘క్రియేటర్స్‌ డే’ పేరిట ఒక సరికొత్త ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పేస్‌బుక్‌ డైరెక్టర్‌ పరాస్‌ శర్మ సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

సెలబ్రిటీలైనా, సామాన్యులైనా..
ఇంటర్నెట్‌ సేవలు ధరల పరంగా కూడా అందుబాటులోకి రావడంతో దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల నుంచీ క్రియేటర్స్‌ వెల్లువెత్తుతున్నారు. మహారాష్ట్రలోని జల్నా, హర్యానాలోని హిసార్, అసాన్‌సోల్, షోలాపూర్‌ వంటి చోట్ల నుంచి కూడా క్రియేటర్స్‌ వస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. క్రియేటివ్‌ కంటెంట్‌కు సంబంధించి సెలబ్రిటీలైనా, సామాన్యులైనా మాకు క్రియేటర్స్‌ అంతా సమానమే. 

క్రియేటివిటీకి...తోడ్పాటు..
ఫేస్‌ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికల ద్వారా ఇప్పటికే పేరొందిన లేదా ఔత్సాహిక క్రియేటర్‌ అయినా సరే... పలు సహాయ సహకారాలు అందిస్తున్నాం. కొత్త వారి కోసం శిక్షణ అవకాశాలు, పేరొందిన వారి కోసం బిజినెస్‌ మోడల్, కమ్యూనిటీస్‌ ఏర్పాటుకు మేం సహకరిస్తున్నాం.  క్రియేటర్ల కోసం క్రియేటివ్, మోనెటైజేషన్‌ టూల్స్‌ అందిస్తున్నాం. అదే విధంగా లెర్నింగ్, మెంటర్‌ షిప్, కొలాబరేషన్‌ అవకాశాలు కూడా.

అలాగే  కమ్యూనిటీని నిర్మించుకోవాలనుకునే క్రియేటర్స్‌ కోసం ఇన్‌స్టాగ్రామ్‌కు పలు అనుబంధ సేవలు ఉన్నాయి. ఎవరైతే తమ ఉత్పత్తిని విక్రయించాలనుకోరో.. దాని కోసం ఇన్‌–స్ట్రీమ్‌ యాడ్స్‌ వంటి మోనెటైజేషన్‌ టూల్స్‌ ఉన్నాయి. అలాగే క్రియేటర్స్‌ కెరీర్‌ కోసం కొన్ని లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌ కూడా అందిస్తున్నాం తాజాగా బార్న్‌ఆన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేరుతో లాంచ్‌ చేసిన ఇ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ కూడా అలాంటిదే. 

క్రియేటర్స్‌ డే ఎందుకంటే..
క్రియేటర్లకు సహకరించేందుకు డిజైన్‌ చేస్తున్న కార్యక్రమాల్లో ఇదొక భాగం. సృజనాత్మక కంటెంట్‌ను సృష్టిస్తున్నవారు ఇతర క్రియేటర్లతో పరిచయాలు, భావాలను పంచుకోవాడాలను కోరుకుంటున్నారు.. ఈ నేపధ్యంలో వృద్ధి పధంలో ఉన్నవారి కోసం వారి కి చక్కని కెరీర్‌ నిర్మాణం దిశగా నడిపించేందుకు వేలాది మంది పాల్గొనేటా క్రియేటర్స్‌ డేని  నిర్వహిస్తున్నాం. ఏడాది మొత్తం క్రియేటర్స్‌ కోసం వర్క్‌షాప్స్, ట్యుటోరియల్స్‌ కూడా  నిర్వహంచనున్నాం. ఏడాదిలోపు కనీసం 2వేల మంది క్రియేటర్లతో కలిసి పనిచేయాలని ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నాం. 

తెలుగుప్రజలు..సృజనశీలురు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో సృజనశీలురు ఉన్నారు. అందుకే ఇవి మాకు కీలకంగా మారాయి. ఎక్కడెక్కడ వారో నిరంతరం తమ క్రియేటివిటీకి పదను పెడుతూ సోషల్‌ మీడియా ద్వారా  పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు. సూపర్‌ ఉమన్‌గా పేరొందిన మహాతల్లి... ఇందుకో ఉదాహరణ. అలాగే బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గా అవకాశం దక్కించుకున్న అలేఖ్య హారిక కూడా మరో నిదర్శనం. 

వినోదం, విజ్ఞానం కూడా..
ఆహార విహారాల నుంచి మరెన్నో అంశాలపై క్రియేటివ్‌ వీడియోలు వ్యాప్తి చెందుతున్నాయి. ఉదాహరణకు హ్మ్, విలేజ్‌ ఫుడ్‌ ఫ్యాక్టర్‌... వంటి పేజీల ద్వారా అద్భుతమైన వంటకాలు, వండే విధానాలు ప్రజలకు చేరుతున్నాయి. ఇక కరోనా సందర్భంగా ఈజీ కుక్‌ రిసిపీలు కూడా వెల్లువెత్తాయి. వరల్డ్‌ మరాఠా ఆర్గనైజేషన్, గుర్‌గావ్‌ హెల్ప్‌లైన్‌ వంటివి ఏర్పాటై పలు ప్రాంతాల్లో వైద్య సేవలు కూడా అందించాయి. 

చదవండి: వైరల్‌: 17 ఏళ్లుగా అడవిలోనే ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తి.. కారణం?
 

మరిన్ని వార్తలు