Fake Profile: మెసేజుల్లో మర్యాద ఫోన్‌ కాల్స్‌లో అమర్యాద

9 Jul, 2021 00:50 IST|Sakshi

‘సంధ్యా.. (పేరుమార్చడమైనది) ఎంతసేపు కూర్చుంటావే అలా. నెలరోజులుగా చూస్తున్నాను. సరిగా తినడం లేదు. నిద్రపోవడం లేదు. ఆఫీసుకు కూడా వెళ్లడం లేదు. ఎందుకీ ఆలోచన’ గట్టిగానే మందలిస్తున్నట్టుగా అంది తల్లి.

‘అదేం లేదమ్మా!’ సర్దిచెబుతున్నట్టుగా అంది సంధ్య.
‘చూడమ్మా! నీవు ఆ కార్తీక్‌ (పేరు మార్చడమైనది)ని మర్చిపోలేకుంటే చెప్పు. అయిందేదో అయ్యింది. వాళ్ల వాళ్లతో మాట్లాడి,పెళ్లి చేస్తాం’ అనునయిస్తూ చెప్పింది తల్లి.
‘వద్దమ్మా! పెళ్లొద్దు. నే చచ్చిపోతాను’ అంటూ ఏడుస్తూ తల్లిని చుట్టేసింది.
‘ఏమైంద’ని తల్లీ తండ్రి గట్టిగా అడిగితే అసలు విషయం బయటపెట్టింది సంధ్య.
∙∙
సంధ్య సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. పెళ్లిసంబంధాలు చూస్తూ సంధ్య ప్రొఫైల్‌ని మ్యాట్రిమోనియల్‌ సైట్‌లో పెట్టారు పేరెంట్స్‌. వచ్చిన ప్రొఫైల్స్‌లో కార్తీక్‌ది సంధ్యకి బాగా నచ్చింది. సంధ్య కూడా కార్తీక్‌కు నచ్చడంతో ఇంట్లోవాళ్లతో మాట్లాడారు. ఇరువైపుల పెద్దలు ఓకే అనుకున్నారు. నెల రోజుల్లో పెళ్లి అనుకున్నారు. దాంతో ఇద్దరూ రోజూ కలుసుకునేవారు. సినిమాలు, షికార్లకు వెళ్లేవారు. త్వరలో జీవితం పంచుకోబోతున్నవారు అనే ఆలోచనతో పెద్దలూ అడ్డుచెప్పలేదు. పెళ్లి తర్వాత ఇద్దరూ విదేశాల్లో స్థిరపడాలనుకున్నారు. అందుకు ముందస్తుగా కావాల్సిన ప్రయత్నాలూ మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే కార్తీక్‌ పాస్‌పోర్ట్‌ చూసింది సంధ్య. అందులో అతని పుట్టినతేదీ వివరాలు చూసి, ఆశ్చర్యపోయింది. అదే విషయాన్ని కార్తీక్‌ని అడిగింది. ‘మ్యాట్రిమోనియల్‌ సైట్‌ ప్రొఫైల్‌లో వేరే వివరాలున్నాయి. పాస్‌పోర్టులో వేరేగా ఉన్నాయి’ అని నిలదీసింది. ‘అదేమంత పెద్ద విషయం కాదు. డేటాఫ్‌ బర్త్‌లో కొంచెం తేడా అంతేగా!’ అన్నాడు కొట్టిపారేస్తూ కార్తీక్‌.

ఇదే విషయాన్ని తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించింది సంధ్య.
ప్రొఫైల్‌లో తప్పుడు వివరాలు ఇవ్వడం, ఇన్ని రోజులూ అసలు విషయం చెప్పకుండా దాచడంతో సంధ్య తల్లిదండ్రులు కార్తీక్‌ని, అతని తల్లిదండ్రులను నిలదీశారు. సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు కార్తీక్‌. ‘ఇంకా ఎన్ని వివరాలు దాస్తున్నారో.. ఈ సంబంధం మాకొద్దు’ అని చెప్పేశారు సంధ్య అమ్మనాన్నలు. సంధ్య కూడా తల్లిదండ్రులతో ‘మీ ఇష్టమే నా ఇష్టం’ అనేసింది. దీంతో అనుకున్న పెళ్లి ఆగిపోయింది.
∙∙
నెల రోజులుగా తిండీ, నిద్రకు దూరమైన సంధ్య ఆ కొద్ది రోజుల్లోనే ఐదు కేజీల బరువు తగ్గిపోవడంతో భయపడిన సంధ్య తల్లిదండ్రులు డాక్టర్‌ని సంప్రదించారు. సంధ్య ఏదో మానసిక సమస్యతో బాధపడుతోందని చెప్పారు డాక్టర్‌. కార్తీక్‌ని మర్చిపోలేకనే ఇదంతానా అని తల్లి కూతురుని నిలదీయడంతో అదేం కాదంటూ అసలు విషయం చెప్పింది సంధ్య.

‘డియర్‌.. నీవెప్పుడూ ఆనందంగా ఉండాలి’ వచ్చిన మెసేజ్‌కి రిప్లై ఇవ్వలేదు సంధ్య. నెల రోజులుగా వాట్సప్‌ మెసేజ్‌లతో తల తిరిగిపోతోంది సంధ్యకి. ఆ వెంటనే వాట్సప్‌ కాల్‌. ‘నిన్నెలా ప్రశాంతంగా ఉండనిస్తాను. నీ ఫొటోలు అడల్ట్స్‌ ఓన్లీ సైట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. నిన్నిక ఎవ్వరూ పెళ్లి చేసుకోనివ్వకుండా చేస్తా’ అంటూ బూతులు మాట్లాడుతూ ఫోన్‌. ఎత్తకపోతే బెదిరింపులు, ఎత్తితే బయటకు చెప్పనలవికాని మాటలతో వేధింపులు.

డిప్రెషన్‌తో బయటకు రాలేకపోతోంది. ఇన్నాళ్లూ తల్లిదండ్రులకి ఎందుకు చెప్పడం, నేనే పరిష్కరించుకుంటాను అనుకున్న సంధ్య.. ఇక వేగలేక ‘చచ్చిపోతాను’ అంటూ తల్లి వద్ద ఏడ్వడంతో అసలు విషయం బయటకు  వచ్చింది.
‘అమ్మా, కార్తీక్‌ని మర్చిపోలేక కాదు. అతన్ని పెళ్లి చేసుకున్నా నిజంగానే చచ్చిపోతాను. ఈ వేధింపులు నా వల్ల కాదు’ అనడంతో సంధ్య తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

తెలివిగా ఎదుర్కోవాలి...
దొరికితే తన బండారం ఎక్కడ బయటపడుతుందో అని మెసేజుల్లో చాలా అందమైన, మర్యాదపూర్వకమైన భాష వాడేవాడు కార్తీక్‌. కానీ, ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడే వాడు. వాట్సప్‌ కాల్‌ అయితే రికార్డ్‌ కాదని అతని ప్లాన్‌. నిపుణుల సాయం తీసుకున్న సంధ్య, వారిచ్చిన సూచన మేరకు ఒక రోజు కార్తీక్‌ వాట్సప్‌ కాల్‌ చేసినప్పుడు స్పీకర్‌ ఆన్‌ చేసి, మరో ఫోన్‌లో అది రికార్డ్‌ చేసింది. ఆ వాయిస్‌ను పోలీసుల ముందు పెట్టింది. దీంతో వేధింపులకు చెక్‌ పడింది. కేసు ఫైల్‌ అయ్యి, అతను విదేశాలకు వెళ్లడం కూడా ఆగిపోయింది. తెలివిగా సమస్యను ఎదుర్కోవాలి. అవగాహన లేకుండా జీవితాలను చేజార్చుకోకూడదు.

– అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

ధైర్యంగా ఉండాలి
మ్యారేజీ బ్యూరోలు, డేటింగ్‌ సైట్స్‌లలో వివరాలతో పాటు, తప్పుడు ఫోటోలు కూడా పెడుతుంటారు. తెలిసి, తెలియక వారితో క్లోజ్‌ అయినప్పుడు ట్రాప్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేస్తారు. పూర్తి ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోవాలి. ఒక్క అభిరుచులు తెలుసుకోవడం మాత్రమే కాదు అతని గురించి పూర్తి బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌ చేసుకొని, మూవ్‌ అవడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకూడదు. తమకు అన్యాయం జరిగిందని అర్ధమైతే, ధైర్యంగా దగ్గరలోని పోలీసులకు వెంటనే సమాచారం అందించాలి.

– జి.ఆర్‌. రాధిక, ఎస్పీ, (సైబర్‌ క్రైమ్‌ విభాగం), ఏపీ పోలీస్‌

మరిన్ని వార్తలు