షోడశ సంస్కారాలు

23 Nov, 2020 06:35 IST|Sakshi

వేదవాఙ్మయం

గృహస్థు పాటించాల్సిన సంస్కారాల గురించి మనకు మన ప్రాచీన మహర్షులు గృహ్య సూత్రాల రూపంలో, కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పి ఉన్నారు. సంస్కారం అంటేనే సంస్కరించునది అని అర్థం. అంటే, ఈ సంస్కారాలు పాటించడం ద్వారా మనిషి సంస్కారవంతుడు అగుచున్నాడు. ఏవిధంగా అయితే మట్టిలో ఇతర ఖనిజలవణాలతో కలిసిపోయి దాదాపుగా మట్టిలాగే దొరికిన బంగారం, సంస్కరించబడి, అనుభవయోగ్యమైన సువర్ణంగా, ఆభరణాలుగా మారుతుందో, అలాగే మనిషి కూడా సంస్కారాలు పాటించడంద్వారా ఉన్నతమైన జీవన విధానాన్ని, పరిపక్వమైన మానసికస్థితిని పొందుచున్నాడు. తద్వారా సమస్తజనాలూ సుఖసంతోషాలతో నివసించగలిగేలా క్రమశిక్షణతో కూడిన నడవడికగల ఒక సర్వోన్నత ధార్మికసమాజాన్ని నిర్మించగలిగాడు. సంస్కారాల సంఖ్యగురించి అభిప్రాయ భేదాలున్నా, లోకంలో ప్రాచుర్యంపొందినవి మాత్రం పదహారే. ఈ పదహారు రకాల సంస్కారాల గురించి, అవి అనుసరించాల్సిన సమయాల గురించి, వాటి విధానాల గురించి, ఈ వ్యాసంలో క్లుప్తంగా తెలుసుకుందాం. 

మనిషికి ఈ సంస్కారాలు జరిగినట్లుగా మనకంటికి ఏమైనా మార్పులు కనిపిస్తాయా? అంటే కొన్ని సంస్కారాల తాలూకు మార్పులు కంటికి కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. ఎందుకంటే, కొన్ని సంస్కారాలు శరీర సంబంధ వేషభాషలలో మార్పులు తీసుకొస్తే, కొన్ని సంస్కారాలు మానసిక పరిపక్వతనీ, ఉన్నతమైన ఆలోచనావిధానాన్నీ, సామాజిక శ్రేయస్సును కలిగిస్తాయి. శరీర సంబంధ మార్పులు కంటికి కనిపిస్తాయి, కానీ మానసికమైన మార్పులు మాత్రం వారి ప్రవర్తనలో, మాట్లాడే విధానంలో, ఎదుటివారిని గౌరవించే తీరులో, వారు తీసుకునే నిర్ణయాలలో ప్రతిబింబిస్తాయి. ఏది ఏమైనా, ‘వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేనచ వకారైః పంచభిర్యుక్తః నరోభవతి పూజితః’ అను ఆర్యోక్తిని అనుసరించి, ఒక వ్యక్తి గౌరవించబడాలంటే, పంచవకారాలైన వస్త్రం, వేషభాషలు, విద్యా వినయాలను పాటించాలి. వాటిని నేర్పించేది కూడా ఈ సంస్కారాలే.

గర్భాధానం మొదలుగాగల పదిహేను సంస్కారాలు మనిషి జీవించి వుండగా జరిపించేవి కాగా, పదహారవ సంస్కారమైన అంత్యేష్టిమాత్రం మనిషి మరణించిన తరువాత జరిపించేది. ఇది మానవశరీరాన్ని అగ్ని మొదలైన పంచభూతాలకు హవిస్సుగా అర్పించే పరమ పవిత్రమైన సంస్కారంగా శాస్త్రాలు పేర్కొన్నాయి. దాదాపుగా ప్రతి సంస్కారమూ అగ్నిని ఆధారంగాచేసుకునే జరపాలని సమస్త గృహ్యశాస్త్రాలూ చెప్తున్నాయి. సంస్కారాల వలన సంస్కరింపబడి, దయ ఓర్పు మొదలైన ఆత్మగుణాలు కలిగినవారు పరమపదాన్ని పొందుతారని స్మృతులు చెప్తున్నాయి. సంస్కారాల వరుసక్రమంలో అభిప్రాయ భేదాలున్నా, దాదాపుగా అందరూ అంగీకరించిన వరుసక్రమాన్ని అనుసరించే వాటిని వివరించడం జరుగుతుంది.

మరిన్ని వార్తలు