ప్రాణమిచ్చే దేశీ పంటలు!

24 Nov, 2020 09:13 IST|Sakshi

సాంప్రదాయ వరి సాగు, విత్తనోత్పత్తిలో దిట్ట వెంకన్న  

పాత పంటల దిగుబడుల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని, వీటిని పండిస్తే సమాజానికి ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని అందించడవచ్చని తపన పడుతున్న రైతు మైలారం వెంకన్న. వరి పంటలో సుసంపన్నమైన జీవ వైవిధ్యాన్ని పరిరక్షిస్తూ విత్తనోత్పత్తి చేపడుతూ శాస్త్రవేత్తల ప్రశంసలు అందుకుంటున్న ప్రకృతి వ్యవసాయదారుడాయన. ఆర్‌ఎంపీ వైద్యుడు కూడా అయిన వెంకన్న ఆదర్శ సేద్యపు వివరాలు ఆయన మాటల్లోనే...

జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం జీడికల్‌ గ్రామం మాది. నాకు 12 ఎకరాల పొలం ఉంది. 8 ఎకరాల్లో మామిడి, కూరగాయలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నా. మిగతా నాలుగు ఎకరాల్లో నవారా, కాలాబట్టి, రత్నచోడి, నారాయణ కామిని, సిరిసన్నాలు, రక్తశాలి వంటి సాంప్రదాయ వరి వంగడాలను ఇప్పటికి ఏడేళ్లుగా సాగు చేస్తున్నా. శాస్త్రీయ పద్ధతిలో విత్తనోత్పత్తి చేస్తున్నా. జీరో బడ్జెట్‌ ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్‌ పాలేకర్‌ స్ఫూర్తితో ఒక్క ఆవుతో 12 ఎకరాల్లో ప్రకృతి సాగు చేస్తున్నా.

పండుఈగ కోసం పందిరి తోటలో పెట్టిన ఎర 
బ్లాక్‌ రైస్, రెడ్‌ రైస్‌తో దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసుకోవడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని నిరూపితమైంది. దిగుబడి తక్కువ వచ్చినా.. రైతుకు రెట్టింపు ఆదాయం ఇచ్చేది ప్రకృతి వ్యవసాయం. కాలాబట్టి (బ్లాక్‌ రైస్‌) వరి రకం పంట కాలం 135 – 140 రోజులు. ఎకరాకు 15 క్వింటాళ్ల ధాన్యం దిగుబడినిస్తుంది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం ఉంది. గుండె జబ్బు, క్యాన్సర్, షుగర్‌ వ్యాధి నుంచి విముక్తి కలిగిస్తుందని చెబుతున్నారు. 

శరీర దృఢత్వం పెంపొందిస్తూ, శారీరక బాధలు తొలగించే రత్నచోడి వరి వంగడానికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. గింజ ఎర్రగా.. బియ్యం తెల్లగా ఉండే ఈ రకం 125 రోజుల పంట. ఎకరానికి 25 బస్తాల దిగుబడి సాధించవచ్చు. చేను పచ్చగా.. గింజ నల్లగా.. బియ్యం తెల్లగా ఉండే నారాయణ కామిని వరి అన్నం తింటే మోకాళ్ల నొప్పులకు ఉపశమనం కలుగుతుంది. మోకాళ్లలో గుజ్జు సైతం పెరిగే అకాశం ఉంటుంది. ఈ బియ్యం తింటే వైద్య ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు మోకాళ్ల చిప్పల మార్పిడి చేసుకునే అవసరం రాదని రైతు వెంకన్న చెబుతున్నారు. ఎకరాకు 25 బస్తాల దిగుబడి వస్తుంది.

తన తోటలో బీర కాయలను చూపుతున్న వెంకన్న
ఒక్క ఆవుతో నాలుగు ఎకరాల్లో సాంప్రదాయ వరి సాగు చేస్తున్నా. ఆవు పేడ, మూత్రంతో ఘనజీవాతం, జీవామృతం తయారు చేసి దుక్కి, పైపాటు ఎరువులుగా పంటలకు అందిస్తున్నా. చేప–బెల్లం ద్రావణం, కోడిగుడ్డు కషాయం, కళ్లిపోయిన పండ్లు–బెల్లం ద్రావణం, అల్లం+బెల్లం+వెల్లుల్లి ద్రావణం, బియ్యం కడిగిన నీటిలో ఆవు పాలను కలిపి సేంద్రియ ద్రావణాలను తయారు చేసి పంటలకు వాడుతున్నా. పందిరి కూరగాయ పంటలు కూడా సాగు చేస్తున్నా. పండీగ సమస్య తీర్చుకోవడానికి ప్లాస్టిక్‌ సీసాతో ట్రాప్‌ను ఏర్పాటు చేసుకొని మంచి ఫలితం సాధిస్తున్నా.
 
గోమూత్రం సేకరిస్తున్న దృశ్యం
తొలి నాలుగేళ్ల పాటు నా కుటుంబం అవసరాల మేరకే మరుగున పడిన దేశీ వరి పంటలను సాగు చేశా. మూడేళ్లుగా ఈ వంగడాల విత్తనోత్పత్తిపై కూడా దృష్టి సారించా. విత్తనాలను తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల రైతులు తీసుకెళ్తున్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం, గ్రామీణ్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఈ మధ్యనే మా పొలంలో రైతులకు పాత వరి రకాల విత్తనోత్పత్తిపై శిక్షణ ఇచ్చాం. పాత పంటల ప్రకృతి వ్యవసాయంతో మనమంతా సంపూర్ణ ఆరోగ్య వంతులుగా మారాలన్నదే నా తపన. 
(రైతు వెంకన్నను 78934 26155 నంబరులో సంప్రదించవచ్చు) 
కథనం: కొత్తపల్లి కిరణ్‌ కుమార్, సాక్షి, జనగామ
ఫొటోలు: గోవర్ధనం వేణుగోపాల్, సాక్షి

మరిన్ని వార్తలు