Beach Jewellery: అలంకరణకు కొన్ని గవ్వలు .. ధర రూ.100 నుంచి వెయ్యి వరకు!

3 Jun, 2022 18:55 IST|Sakshi

సముద్ర తనయకు గవ్వలు అంటే ఎంతో ఇష్టం. అందుకేనేమో.. సౌందర్యాన్ని పెంచుకోవడంలో తరుణులు గవ్వలను ఎంచుకుంటున్నారు.  బీచ్‌ జ్యువెల్రీగా పేరొందిన గవ్వల ఆభరణాలు  ఇప్పుడు మన సంప్రదాయ పెళ్లి కూతురు వేడుకలోనూ అందంగా అమరిపోయాయి. 

ఆధునిక వస్త్రధారణ పైకి అంతే ఆధునిక కళను మోసుకొస్తున్నాయి. చీరకట్టుకు కొత్త సొగసును ఇస్తున్నాయి.  ఏ వేడుకైనా అందుకు తగినట్టుగా ఇమిడిపోతున్న గవ్వల గమకాలు ఇక అందరూ ఒడిసిపట్టుకోవచ్చు. 

ఫ్యాషన్‌ జ్యువెలరీగానూ, సంప్రదాయ ఆభరణంగానూ గవ్వల స్థానం రోజు రోజుకూ పెరగుతుందనడానికి ఈ మోడల్సే ఓ ఉదాహరణ. ఎవరికి వారు వినూత్నంగా తమదైన సృజనతో డిజైన్‌ చేసుకోవచ్చు. పెళ్లి కూతురు పసుపు–మెహందీ వేడుకల్లో ఆభరణాలుగా పువ్వుల అలంకరణ చేస్తుంటారు. వీటి స్థానంలో గవ్వలు కూడా వచ్చి చేరి, 
మరింతగా కనువిందు చేస్తున్నాయి. 

రంగుతాళ్లతో దోస్తీ
పెయింట్‌ చేసిన లాకెట్స్‌కు గవ్వలను చేర్చి, రంగు తాళ్లతో అమర్చితే అందమైన ఆభరణంగా మారిపోతుంది. ఇవి కాటన్‌ దుస్తుల మీదకు అందంగా నప్పుతాయి. మోడర్న్‌ డ్రెస్సుల మీదకు మరింత మోహనంగా అమరిపోతాయి.

వరుసలు వరుసలు
మెడలో హారాలుగానే కాదు, కొప్పులో మల్లెలుగానూ గవ్వలు కొత్త కళను తీసుకువస్తున్నాయి. కాసులపేరు వలె గవ్వలపేరు ఓ అందమైన అలంకరణ. దానికి కొన్నిపూసలు జోడీ కడితే అన్ని రంగుల కూర్పుతో ఇంద్రధనుసును మెడలో వేసుకున్నట్టే 
ఉంటుంది. 

ఎంబ్రాయిడరీలో మేటి
బ్లౌజ్‌కు, లెహంగాలకు చేసే ఎంబ్రాయిడరీలో గవ్వలు జత చేరి మరింత ఆకర్షణీయంగా కనువిందుచేస్తున్నాయి. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో రూ.100 నుంచి గవ్వల అలంకరణ బట్టి వేయి రూపాయల వరకు పలుకుతున్న ఈ ఆభరణాలు అలంకరణలో అదుర్స్‌ అనిపిస్తాయి.

అద్దాలతో జోడీ
డిజైనర్‌ డ్రెస్సుల గురించి మాట్లాడుకునే సందర్భాలలో మిర్రర్‌ వర్క్‌ గురించిన సందర్భం వస్తుంటుంది. ఈ అద్దాల అలంకరణనే ఆభరణాలలోకి తీసుకుంటే ఫ్యాబ్రిక్‌ మెటీరియల్‌– గవ్వలతో మరింత ఆకర్షణీయమైన జ్యువెల్రీని రూపుకట్టవచ్చు.
ఇక్కడా ఓ లుక్కేయండి:  Cannes 2022 Look: కాన్స్‌.. మన తారల లుక్‌ అదుర్స్‌! డ్రెస్‌ ఎంపికలోనే అంతా!

మరిన్ని వార్తలు