బొగ్గు గౌను.. మైనం చీర..ఫ్యాషన్‌ డిజైనర్‌ సృజన

28 Nov, 2021 06:36 IST|Sakshi
స్వచ్ఛమైన బంగారు జరీతో రాఖీ రూపొందించిన లెహంగా డ్రెస్‌, బొగ్గుతో గౌను, మైనం ఫ్యాబ్రిక్‌ను డిజైన్‌ చేసిన డ్రెస్‌తో రేఖా గుప్తా

కాలానుగుణంగా దుస్తులను రూపొందించి, విభిన్న మోడల్స్‌లో ఆకట్టుకునే ఫ్యాషన్‌ డిజైనర్లను ఎంతో మందిని చూశాం. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌లో బరేలీ జిల్లా వాసి ఫ్యాషన్‌ డిజైనర్‌ గుప్తా పరిచయం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆర్ట్‌ను సైన్స్‌ను కలగలిపి వినూత్న డిజైన్లు రూపొందించి లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఏడుసార్లు గుర్తింపు తెచ్చుకుంది.

టిష్యూ పేపర్‌తో చేసిన గౌను, మైనంతో చేసిన డ్రెస్, ఫెవికాల్‌తో చేసిన తెల్లటి దుస్తులు, బొగ్గు, తారుతో చేసిన గౌన్లు్ల, స్వచ్ఛమైన బంగారంతో రూపొందించిన లెహెంగా, వైట్‌ సిమెంట్‌తో చేసిన డ్రెస్, లిక్విడ్‌ సోప్‌తో చేసిన చీర.. ఇలా ఆమె రూపొందించిన వినూత్నమైన ఏడురకాల దుస్తులకు ఏడు సార్లు లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో చోటు దక్కింది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిగ్రీ చేసిన రాఖీ డ్రెస్‌ డిజైన్స్‌లో చేస్తున్న ఆసక్తికర ప్రయోగాలు తెలుసుకున్నా కొద్దీ ఆసక్తికరంగా ఉంటాయి.
మోడల్‌ దుస్తులతో

సైన్స్‌ ప్రాజెక్ట్‌
రాఖీ గుప్తా కుటుంబంలో అందరూ వైద్య వృత్తిలో ఉన్నారు. రాఖీ కూడా డాక్టర్‌ అవుతుంది అని అనుకున్నారు ఆమె తల్లీ తండ్రి. కానీ, చిన్ననాటి నుంచి రాఖీ ప్రవర్తన వేరుగా ఉండేది. తినడానికి ప్లేట్‌లో రొట్టెలను పెడితే, వాటిని అందంగా అలంకరించేది. స్కూల్లో టీచర్‌ సైన్స్‌ ప్రాజెక్ట్‌ చేయమంటే వార్తాపత్రికల కటింగ్‌తో డ్రెస్‌ డిజైన్స్‌ చేసి, పుస్తకంలో అతికించేది. ‘రెడ్‌ కార్పెట్‌పై నడిచే మోడల్స్‌ ధరించే దుస్తులంటే నాకు చాలా ఇష్టం. నా మనసు ఆసుపత్రిలో కాకుండా దేవకన్యలు, యువరాణుల దుస్తులలో చిక్కుకుంది. దీంతో నేను ఫ్యాషన్‌ డిజైనింగ్‌నే ఎంచుకున్నాను’ అంటుంది రాఖీ.

సరైన దారి..
2009లో ఢిల్లీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులో చేరాను. ఆ  కోర్సు సమయంలోనే ఫ్యాషన్‌ షోలు చేశాను. అక్కడ నా డిజైన్స్‌కు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత సంవత్సరం నాన్న చనిపోయారు. సర్వం కోల్పోయినట్టుగా అనిపించింది. డిజైనింగ్‌ నుంచి బయటకు వచ్చేశాను. అప్పుడు అమ్మ నాకు అండగా నిలిచింది. రంగుల ప్రపంచంపై నాకున్న ఇష్టాన్ని పదే పదే చెప్పేది. దీంతో తిరిగి డిజైనింగ్‌పై దృష్టి పెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డిజైనింగ్‌లో ఏదో కొత్త పని చేస్తూనే ఉన్నాను.

సైన్స్, కళల కలయికకు గుర్తింపు
ఫ్యాషన్‌ ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది. ఇందులో డిజైనర్లందరూ తమ సృజనను చూపుతూనే ఉంటారు. నేను సంప్రదాయ దుస్తులను ముఖ్యంగా పెళ్లి డ్రెస్సులను డిజైన్‌ చేసేదాన్ని. ఫ్యాషన్‌ అనేది కేవలం బట్టలకే పరిమితం కాదని, ఏదో కొత్తదనాన్ని చూపాలనుకున్నాను. అప్పుడే సైన్స్‌ ద్వారా ఏదైనా సృష్టించాలనుకున్నాను. ఆ తర్వాత నా ఆలోచనలపై పరిశోధన చేస్తూనే ఉన్నాను. ప్రజలు ఊహించని విధంగా మైనం, బొగ్గు బేస్‌ చేసుకొని రెండు డ్రెస్సులను తయారు చేశాను. ఆ రెండింటికీ లిమ్కాబుక్‌ రికార్డ్‌లో చోటు దక్కింది. ఎంతో మంది చేత ప్రశంసలు, గౌరవం దక్కాయి. డిజైనింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ వీలు చూసుకొని ఇతర వస్తువులనూ ఉపయోగిస్తూ ఫ్యాబ్రిక్‌ను తయారు చేయడం, వాటితో డ్రెస్సులను రూపొందించడం నా హాబీ. దీంట్లో భాగంగానే వైట్‌ సిమెంట్, ఫెవికాల్, సోప్‌ లిక్విడ్‌ ఇలాంటి వాటిని ఉపయోగిస్తూ చీరలు, డ్రెస్సులు రూపొందించాను. ఏడురకాల ఈ దుస్తులకు ఏడుసార్లు లిమ్కా బుక్‌రికార్డులో చోటు దక్కించుకున్నాను’’ అని వివరించారు రాఖీ గుప్తా.

ఫ్యాషన్‌ డిజైనర్‌గా రాణిస్తూ, సైన్స్‌ను కళను కలిపి తయారుచేసే డిజైన్లతో రికార్డులు సాధిస్తూ తీరిక లేకుండా ఉండే రాఖీ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటుంది. అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళుతుంది. వృద్ధాశ్రమంలోని బామ్మలకు నచ్చిన చీరలు ఇచ్చి వస్తుంటుంది. పిల్లలకు చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తుంది. బహుమతులు, భోజనం అందిస్తుంది. వినూత్నంగా ఆలోచించమని అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. ఆమె చేస్తున్న కృషికి గాను మహిళా సాధికారత అవార్డు, విశిష్ట పౌర పురస్కారం లభించాయి.

మరిన్ని వార్తలు