Geethika Kanumilli: అదిరిపోయే బ్రైడల్‌ కలెక్షన్‌.. చూపు తిప్పుకోలేరు!

24 Sep, 2021 09:08 IST|Sakshi

బ్రైడల్‌ కలెక్షన్‌

ఎరుపు మెరుపులు

నుదుటన ధరించే సిందూరం ఎరుపు.. చేతిన పూసిన గోరింటాకు ఎరుపు.. నవ వధువు చెక్కిళ్లు ఎరుపు .. ‘పెళ్లి సంప్రదాయంలో ఎరుపు రంగుకి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఈ ఎరుపు మెరుపులను బ్రైడల్‌ కలెక్షన్‌ ద్వారా తీసుకువచ్చాను’ అంటున్నారు హైదరాబాద్‌ డిజైనర్‌ గీతికా కానుమిల్లి. 

‘‘మన ఇతిహాసాలు, పురాణాల నుంచి కొన్ని ఆకట్టుకునే థీమ్స్‌ తీసుకొని, వాటిని బేస్‌ చేసుకుంటూ డిజైన్‌ చేయడం ప్రత్యేకాంశంగా ఎంచుకున్నాను’ అని వివరించారు డిజైనర్‌ గీతికా కానుమిల్లి. హైదరాబాద్‌ నిఫ్ట్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసిన గీతిక కరోనా తర్వాత చేసిన వెడ్డింగ్‌ డిజైన్స్‌ని పరిచయం చేస్తూ ‘ఇటీవల కవి పుష్యమిత్ర ఉపాధ్యాయ రాసిన ‘ద్రౌపదీ అందుకో ఆయుధాలను, ఇప్పుడు రక్షించడానికి గోవిందుడు రాడు’ అనే వాక్యం నన్ను అమితంగా ఆకట్టుకుంది.

నేటి అమ్మాయిలు ఆత్మస్థైర్యంతో అన్నింటా ముందడుగు వేస్తున్నారు. అలాగే వారు ధరించే దుస్తుల ద్వారా కూడా తమ ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలింపజేస్తున్నారు. వారి ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచేలా ఈ బ్రైడల్‌ కలెక్షన్‌లో శారీస్, లెహంగాలకి బెల్ట్స్, పాకెట్స్‌ డిజైన్‌ చేశాను. హ్యాండ్‌ ఎంబ్రాయిడరీలోనూ, అలాగే మన సంప్రదాయానికి కొంత వెస్ట్రన్‌ స్టైల్‌ని జత చేశాను.

కాన్సెప్ట్‌ డిజైన్‌
రాబోయే కలెక్షన్‌లో గరళకంఠుడి థీమ్‌తో నీలం రంగును ఎంచుకొని డిజైన్‌ చేయబోతున్నాను. ఆ తర్వాత ఐవరీ అంటే దంతం రంగుతో భారతంలోని శకుంతల దుస్తులను స్ఫూర్తిగా తీసుకొని డిజైన్‌ చేస్తున్నాను. పాశ్చాత్య దేశాల్లో డిజైనర్లు ఏదైనా ఒక కాన్సెప్ట్‌ ద్వారా తమ ప్రత్యేకతను తమ డిజైన్స్‌లో చూపుతారు. మన దగ్గర ఇంకా అంతగా ఈ కాన్సెప్ట్‌ డిజైన్‌ థీమ్‌ రాలేదు. ముఖ్యంగా మన చారిత్రక కథనాలతోనే ఎన్నో స్ఫూర్తిమంతమైన డిజైన్లు తీసుకురావచ్చు. 

చేనేత యువత
మన చేనేతల ప్రత్యేకత అంతర్జాతీయంగా వెళ్లాలంటే ముఖ్యంగా యువతను ఆకట్టుకునే విధంగా డిజైన్‌ చేయాలి. అందుకు తగిన ప్లాన్లు చేస్తున్నాను. చేనేతలతో డిజైన్లు ఖరీదైనవి చేయచ్చు. తక్కువ ధరలో వచ్చేలా ఫ్యాన్సీ డ్రెస్సులనూ రూపొందించవచ్చు. ఆ విధంగా కలంకారీ చేనేతతో చేసిన డిజైన్స్‌ ఉన్నాయి. 

లవ్‌ స్టోరీస్‌...
కేవలం సంప్రదాయ డిజైన్స్‌ మాత్రమే కాకుండా ‘లవ్‌ స్టోరీస్‌’ పేరుతో జీరో టు ప్లస్‌ సైజ్‌ వరకు అన్ని రకాల వెస్ట్రన్‌ వేర్, ఇతర అలంకరణ వస్తువుల తయారీ కూడా చేపట్టాను’’ అంటారు తన డిజైన్స్‌ గురించి పరిచయం చేసిన గీతికా కానుమిల్లి. 
– గీతికా కానుమిల్లి, ఫ్యాషన్‌ డిజైనర్‌
 

మరిన్ని వార్తలు