పెళ్లి వేడుకలు.. ఘనమైన అలంకారాలతో.. ప్రాచీన కళకు కొత్త హంగులు

8 Apr, 2022 19:27 IST|Sakshi

ఘనమైన అలంకారాలతో.. ప్రాచీన కళకు కొత్త హంగుల

సంప్రదాయ వేడుకల్లో తెలుగింటి వేషధారణకే అగ్రతాంబూలం ఉంటుంది. అయితే, రాచకళ తీసుకు రావాలన్నా, మరిన్ని హంగులు అమరాలన్నా ప్రాచీనకాలం నాటి డిజైన్స్‌కే పెద్ద పీట వేస్తున్నారు నేటి డిజైనర్లు. ‘నవతరం కోరుకుంటున్న హంగులను కూడా సంప్రదాయ డ్రెస్సులకు తీసుకువస్తున్నాం’ అని చెబుతున్నారు వెడ్డింగ్‌ డ్రెస్‌ డిజైనర్‌ భార్గవి అమిరినేని. కాబోయే పెళ్లికూతుళ్లు కోరుకుంటున్న డ్రెస్‌ డిజైన్స్‌ గురించి ఈ విధంగా వివరిస్తున్నారు..

‘కలంకారీ ప్రింట్స్, బెనారస్, కంచి పట్టులను సంప్రదాయ డిజైన్స్‌కు వాడుతుంటారు. అయితే, నవతరం మాత్రం వీటితోనే ఆధునికపు హంగులను కోరుకుంటున్నారు. ట్రెడిషనల్‌ ఫ్యాబ్రిక్‌తోనే వెస్ట్రన్‌ కట్‌ కోరుకుంటున్నారు. నెక్, హ్యాండ్‌ డిజైన్స్‌ విషయంలోనే కాదు తమ ‘ప్రేమకథ’కు కొత్త భాష్యం చెప్పేలా ఉండాలని పెళ్లి కూతుళ్లు కోరుకుంటున్నారు. అందుకే వివాహ వేడుకలకు మరింత కొత్త హంగులు వచ్చి చేరుతున్నాయి. రంగుల కాంబినేషన్లు మాత్రం వేడుకను బట్టి మారిపోతున్నాయి. వీటిలో పేస్టల్‌ నుంచి గాఢమైన రంగుల వరకు ఉంటున్నాయి. డబుల్‌ లేయర్‌ దుపట్టాలు, లేయర్డ్‌ స్కర్ట్, టాప్స్‌.. కూడా వీటిలో ఎక్కువ ఉంటున్నాయి’ అని వివరించారు.  

వివాహ వేడుకలకు సిద్ధమవ్వాలంటే ఘనమైన అలంకారాలతో గొప్పగా సింగారించాలనుకుంటారు. అందుకు తగినట్టే  నేటి వేడుకలకు తరతరాలుగా వస్తున్న ప్రాచీన కళకు కొత్త హంగులను అద్దుతున్నారు.  

మహారాణి దర్పం 
పెళ్లి కూతురు వేషధారణలో కంచి పట్టుచీర తప్పక ఉంటుంది. దీనికి కాంబినేషన్‌ బ్లౌజ్‌తోపాటు కుడివైపున వేసుకునే దుపట్టా కూడా ఓ హంగుగా అమరింది. దుపట్టాను బ్లౌజ్‌కు సరైన కాంబినేషన్‌ సెట్‌ అయ్యేలా మెజెంటా కలర్‌ను ఎంచుకొని, గ్రాండ్‌గా మగ్గం వర్క్‌తో మెరిపించడంతో లుక్‌ మరింత ఆకర్షణీయంగా మారింది.  కాస్ట్యూమ్‌తోపాటు ఆభరణాలు కూడా పాతకాలం నాటివి ఎంపిక చేయడంతో రాయల్‌ లుక్‌ వచ్చేసింది. ఈ గెటప్‌కి వడ్డాణం లేదా వెయిస్ట్‌ బెల్ట్‌ యాడ్‌ చేసుకోవచ్చు. దుపట్టాను అవసరం అనుకుంటే వాడచ్చు. లేదంటే, ఎప్పటికీ గుర్తుగా కూడా ఉంచుకోవచ్చు. ఎంబ్రాయిడరీ బ్రోచ్‌లు కూడా అలంకరణలో వచ్చి చేరుతున్నాయి.  

కాన్సెప్ట్‌ బ్లౌజ్‌
పెళ్లికూతురు డ్రెస్‌ అనగానే అందరికన్నా ప్రత్యేకంగా కనిపించాలనే తాపత్రయం ఉంటుంది. దీంట్లో భాగంగా పెళ్లికూతురు ధరించే బ్లౌజ్‌పైన అమ్మాయికి అబ్బాయి తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్టుగా, అలాగే వారి పేర్లూ వచ్చేలా డిజైన్‌ చేయడంతో గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఆభరణాల్లో ఉండే పచ్చలు, కెంపులు బ్లౌజ్‌ డిజైన్లలోనూ వాడుతున్నారు. ఈ బీడ్స్‌ ధరించే ఆభరణాలకు మ్యాచ్‌ అయ్యేలా చూసుకుంటున్నారు.  

పెద్దంచు మెరుపు
సంప్రదాయ లుక్‌ ఎప్పుడూ అందానికి సిసలైన నిర్వచనంలా ఉంటుంది. పెద్ద అంచు లెహంగా మీదకు ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్, దుపట్టా జత చేస్తే చాలు వేడుకలో ఎక్కడ ఉన్నా అందంగా కనిపిస్తారు. అయితే, హాఫ్‌ శారీ అనగానే గతంలో దుపట్టాలను ఓణీలా చుట్టేసేవారు. ఇప్పుడు ఒకే వైపున వేసుకోవడం కూడా ఫ్యాషన్‌లో ఉంది.  డిజైన్స్‌లోనే కాదు అలంకారంలోనూ వచ్చిన మార్పు మరింత మెరుపునిస్తుంది. 

కలంకారికి మిర్రర్‌
ప్రాచీనకాలం నుంచి వచ్చిన మనవైన కళల్లో కలంకారీ ఒకటి. ఇప్పుడు ఈ ఆర్ట్‌పీస్‌ మరింత ఘనంగా సందడి చేస్తోంది. కలంకారీ క్రాప్‌టాప్‌కు మిర్రర్‌తో హ్యాండ్స్, నెక్‌లైన్‌ను డిజైన్‌ చేయడం ఈ డ్రెస్‌ స్పెషల్‌. బ్రొకేడ్‌ లెహెంగా మీదకు ఈ కలంకారీ బ్లౌజ్‌ జత చేయడంతో మరింత గొప్పగా అమరింది.

– నిర్మలారెడ్డి 

మరిన్ని వార్తలు