ఫ్యాషన్‌ 2021: సౌకర్యమే స్టైల్‌

1 Jan, 2021 10:36 IST|Sakshi

కరోనా కారణంగా దాదాపు పది నెలలు ఇంటి పట్టునే ఉన్నవారు కాస్తా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న వేడుకలకి హాజరవడానికి సిద్ధపడుతున్నారు. 2020లో పండగలు, పార్టీలు, వేడుకలు, వైవిధ్యాలు.. అన్నీ ఇంట్లోనే. కంఫర్ట్‌ కోసం క్యాజువల్స్‌కే పరిమితం అయినా ఇక నుంచి గతం నేర్పిన పాఠాలతో కొత్తదనం నింపుకోక తప్పదు. 2021లో దుస్తుల ఎంపిక ప్రత్యేకంగా ఉంటుందనే ఆలోచనతో డిజైనర్లు సైతం ఆ దిశగా ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు. ఫ్యాషన్‌ పోకడల్లోనూ మార్పులు సంతరించుకోనున్నాయి. ఎంపికలు ప్రత్యేకంగా ఉండనున్నాయి. స్వీయ సంరక్షణ పేరిట తీసుకునే జాగ్రత్తల్లో మొదటి ఎంపిక ధరించే దుస్తులదే కాబట్టి మోర్‌ కేర్‌.. కంఫర్ట్‌ స్టైల్‌ ఈ సంవత్సరమంతా ట్రెండ్‌లో ఉండనుంది. మహమ్మారి సమయంలోనూ రాబోయే ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ డిజైనర్లైన తరుణ్‌ తహిలియాని, సబ్యసాచి, రోహిత్‌బాల్‌ వంటివారే కాకుండా వర్ధమాన డిజైనర్లు సైతం చేనేతలకు, హస్తకళలకు ప్రాముఖ్యమివ్వడం విశేషం. 

దేశవాళీ ఫ్యాబ్రిక్‌కే మొదటి స్థానం
ఆభరణాల ఊసు లేకుండా ప్రింట్లున్న చేనేత దుస్తులు ఏ సీజన్‌కైనా నప్పుతాయన్నది డిజైనర్ల అభిప్రాయం. ఈ విధంగా చూస్తే దేశవాళీ కాటన్‌తో తయారైన ఫ్యాబ్రిక్‌ ఎంపిక పట్ల ఈ ఏడాది మరింత ఆసక్తి పెరగనుంది. ఒంటికి హాయిని, చెమటను పీల్చుకోదగినవి ఎంపికలో ముందండబోతున్నాయి. కాంతిమంతమైన రంగులు ఎంచుకున్నప్పటికి సౌకర్యానికి ప్రాధాన్యమిచ్చేలా వదులుగా ఉండే దుస్తులకే ఓటు వేయనున్నారు. 

లేత రంగులకే ప్రాధాన్యం..
ఇంటికే పరిమితమైన ప్రాణం బయటకు వచ్చినా కొన్నాళ్లపాటు ఇంకా సౌకర్యాన్నే కోరుకుంటుంది. అందుకే ఈ ఏడాది లేత రంగుల దుస్తులకే ప్రాధాన్యత పెరగనుంది. కంటికి, ఒంటికి హాయినిచ్చే రంగు దుస్తులు ట్రెండ్‌ కాబోతున్నాయి. అంతేకాదు, జెండర్‌ ప్రమాణాలను స్పష్టంగా చూపే గులాబీ, బ్లూ, పచ్చ, లావెండర్‌ రంగులు మరింత వెలుగులోకి రానున్నాయి. దుస్తుల్లో బేబీ పింక్‌ కలర్‌ ఈ దశాబ్దంలోనే ముందంజలో ఉంది. ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీలు సైతం బేబీ పింక్‌లో డ్రెస్సులు, ఇతర ఉపకరణాలను రూపొందించాయి. ఇక ముందు ఇదే రంగు ముందంజలో ఉండబోతోంది. 

మళ్లీ మళ్లీ వాడదగిన వాటికే ఓటు
గత సంవత్సరం ఫ్యాషన్‌ పోకడలను అప్పుడప్పుడే వదలలేం. అలాగని ఫ్యాషన్‌కి తగ్గట్టుగా మారకుండా ఉండలేం. అందుకే, సౌకర్యంతోపాటు వాడిన డ్రెస్సులను తిరిగి వాడుకునేలా చిన్న చిన్న మార్పులు చేసుకోదగిన దుస్తుల ఎంపిక ఈ ఏడాది ఉంటుంది. ఇప్పటికే వాడని దుస్తులను కొద్దిపాటి మార్పులు చేసుకుంటూ మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ చేస్తూ ధరించవచ్చు. పండగలు, పెళ్లి వేడుకలనూ ఈ మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌తోనే గ్రాండ్‌గా రూపుకట్టనున్నారు. ఖర్చును కట్టడి చేయడానికి మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ ఒక ట్రెండ్‌గా మారనుంది. దీంట్లో భాగంగానే రెట్రో ట్రెండ్‌ ఉంటుంది.

జిమ్‌ వేర్‌ టు క్యాజువల్‌ వేర్‌
ఆరోగ్యంగా ఉండటం, ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తినడం, వ్యాయామశాలలకు వెళ్లడం వంటివి అత్యవసరం అయ్యాయి. దీంతో ఫ్యాషన్‌ వర్కౌట్‌ డ్రెస్సులకు డిమాండ్‌ పెరిగింది. వీటిలో గ్రాఫిక్‌ నమూనాలు, నాణ్యత గల డ్రెస్సుల ఎంపికవైపు జనం ఆసక్తి చూపుతున్నారు. వ్యాయామం కోసమే కాకుండా క్యాజువల్‌ వేర్‌గానూ విభిన్నంగా ఉపయోగించే దుస్తులు కూడా ఈ సంవత్సరం ట్రెండ్‌లో ఉండబోతున్నాయి. 

డిజైనర్‌ మాస్కులు 
డ్రెస్‌కి తగిన మాస్క్‌ అనేది జాబితాలో మరింత గ్రాండ్‌గా చేరిపోనుంది. కాటన్‌ డ్రెస్‌ వేసినప్పటికి, ముక్కును, నోటిని కవర్‌ చేసే మాస్క్‌ కొత్త కొత్త రూపాల్లో, డిజైనర్‌ టచ్‌తో వెలిగిపోనున్నాయి. ఎక్కడకు వెళ్లాలన్నా ముందు మాస్క్‌ తప్పనిసరి కాబట్టి వీటిమీద డిజైనర్లు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. 

డెనిమ్స్‌ ఫిట్‌ టు కంఫర్ట్‌
జీన్స్‌ గురించి ఆలోచన రాగానే చాలా మందిలో స్లిమ్‌ ఫిట్, టైట్‌ ఫిట్‌ అనేవే మెదులుతాయి. ఇక నుంచి డెనిమ్‌లోనూ కొంత వదులుగా ఉండేవి, సాగేవి, సౌకర్యానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చేవాటి సంఖ్య పెరగనుంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఖాదీ ఫ్యాబ్రిక్‌కు మంచి డిమాండ్‌ ఉంది. ఈ విధంగా మన దేశీయ చేనేతలతో రూపొందించిన దుస్తుల మీద మందంగా ఉండే డెనిమ్‌ లేదా ఖాకీ కలర్‌ జాకెట్స్‌ ఇండోవెస్ట్రన్‌ స్టైల్‌తో ఆకట్టుకోనుంది. 

– నిర్మలారెడ్డి

మరిన్ని వార్తలు