Fasting: ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌తో బరువు తగ్గొచ్చు.. ఇంకా..

27 Aug, 2021 16:59 IST|Sakshi

నోటికి తాళం..మెదడుకు ఉత్తేజం!

నూతన న్యూరాన్ల పుట్టుకను ప్రేరేపించే ఫాస్టింగ్‌

ప్రపంచంలోని దాదాపు అన్ని మానవ సమాజాలు ఆహారానికి విరామమివ్వడాన్ని పుణ్యకార్యంగానే భావిస్తాయి. ప్రాచీన ఆరోగ్య విధానాలైన ఆయుర్వేదం లాంటివి ఉపవాసమంటే ఆరోగ్యానికి సహవాసమని చెబుతున్నాయి. ఇక తెలుగు లోగిళ్లలో ‘‘లంఖణం పరమౌషధం’’ అనేది పెద్దవాళ్ల నోట తరుచూ వినే మాటే! ఇవన్నీ ఆషామాషీగా చెప్పిన కబుర్లు కావని,  నిజంగానే ఉపవాసానికి, ఆరోగ్యానికి లంకె ఉందని శాస్త్రీయ పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి.

ఆకలితో కాలే కడుపుకు అజీర్తి రోగాలు చేరవని, అప్పుడప్పుడు ఉపవాసం (ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌) వల్ల ఎనలేని లాభాలని సైంటిస్టులు వివరిస్తున్నారు. పూర్వం రోజుల్లో  కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో ఒకరోజు మొత్తం ఏమీ తినకుండా ఉండేవారు. దీనిద్వారా పుణ్యం, పురుషార్థం రెండూ కలసి వచ్చేవి. కానీ కాలం మారింది. శారీరక శ్రమ తగ్గి, చల్లటి గదుల్లో కూర్చొని పనిచేసే కొలువులు రావడం, వేళాపాళా లేని ఉద్యోగాలు, జంక్‌ఫుడ్‌ అలవాటై ఉపవాసం మరుగున పడిపోయింది. 

ఆధునిక జీవన శైలి పుణ్యమా అని ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ కాదుకదా, కనీసం కొన్ని గంటలు కూడా ఆకలికి ఓర్చుకోకుండా ఏదో ఒకటి నమిలే అలవాటు పెరిగింది. ఇలా అదే పనిగా నోటికి, పొట్టకి విశ్రాంతి ఇవ్వకపోవడంతో రకరకాల వ్యాధులూ విజంభిస్తున్నాయి. యుక్త వయసులోనే ఊబకాయం పలకరిస్తోంది. అందుకే అడ్డదిడ్డంగా తిండి తినే బదులు ఓ క్రమపద్ధతి అలవాటు చేసుకోవాలని, దీనికి ఉపవాసాన్నీ జోడించాలని తాజాగా అనేక పరిశోధనలు చెబుతున్నాయి.

ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌తో బరువు తగ్గడం, జీర్ణక్రియ మెరుగు పడడం, జీవితకాలం పెరగడంలాంటి పలు ప్రయోజనాలున్నాయని తెలిసిందే, కానీ దీనివల్ల మెదడుపై, నరాల చురుకుదనంపై పాజిటివ్‌ ప్రభావం ఉంటుందని తాజా పరిశోధనలు వివరిస్తున్నాయి. అసలేంటి ఈ ఫాస్టింగ్‌? ఎందుకు చేయాలి? ఎంతకాలం చేయాలి? ఎవరు చేయాలి? న్యూరోజెనిసిస్‌ అంటే ఏంటి? తెలుసుకుందాం...

న్యూరోజెనిసిస్‌ అంటే...
మెదడులో కొత్త న్యూరాన్లు పుట్టే ప్రక్రియనే సింపుల్‌గా న్యూరోజెనిసిస్‌ అంటారు. ఇది సాధారణంగా పిండదశలో జరిగే ప్రక్రియ. కానీ పెద్దల మెదడులోని కొన్ని భాగాల్లో ఈ ప్రక్రియ జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. మెదడులోని హిప్పోక్యాంపస్‌ ప్రాంతం జ్ఞాపకశక్తికి, కదలికలకు కీలకమైన ప్రాంతం. ఇది ఒత్తిడి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది, అవి ఎక్కువ స్థాయిలో విడుదలైతే క్రమంగా ఉన్న న్యూరాన్లు నశించిపోతుంటాయి. ఈ నశింపు ప్రక్రియ వేగవంతమైతే డెమెన్షియా, ఆల్జీమర్స్‌తో పాటు పలు ఇబ్బందులు ఎదురైతాయి. దీనికి అడ్డుకట్ట న్యూరోజెనిసిస్‌తోనే సాధ్యం.

ఎంతకాలం చేయవచ్చు?
బ్రైన్‌ జర్నల్‌లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం ఫాస్టింగ్‌ ఎంతకాలం చేయాలన్నది మన లక్ష్యాన్ని బట్టి నిర్దేశించుకోవాలి. అంటే న్యూరోజెనిసిస్‌ను ప్రేరేపించడమే మన లక్ష్యం కనుక దీనిపైనే శ్రద్ధ పెట్టాలి. మన వయసును బట్టి న్యూరోజెనిసిస్‌ వేగం ఆధారపడిఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచే దీన్ని యాక్టివేట్‌ చేయగలిగితే పెద్దయ్యేకొద్దీ ఎంతో ఉపయోగం ఉంటుంది. 


ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ ప్రయోగం
ఎలుకల్లో ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ ప్రయోగం జరపగా, 12 గంటలు, 24 గంటలు ఉపవాసం ఉంచిన ఎలుకల్లో తక్కువ న్యూరాన్ల ఉత్పత్తి జరగగా, 16 గంటల ఉపవాసం ఉన్న ఎలుకల్లో న్యూరోజెనిసిస్‌ చాలా వేగంగా జరిగిందని తేలింది. అసలు ఉపవాసం లేనివాటిలో కొత్త న్యూరాన్ల ఉత్పత్తి ఊసే కనిపించలేదు.

అసలు ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగంటే?
ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగంటే నిద్ర లేవగానే నోట్లో ఏదో ఒకటి పడేసే అలవాటును దూరం చేసుకోవడమే! దీన్ని పాటించాలనుకున్న రోజున బ్రేక్‌ఫాస్ట్‌కు స్వస్తి పలకాలి. రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందు తినడం ఆపేయాలి. ఉదయం, రాత్రి తినవద్దన్నామని మిగిలిన సమయమంతా ఎడాపెడా తినేయకూడదు. మధ్యాహ్న భోజనాన్ని వీలయినంత తక్కువగా తీసుకోవాలి.

నోటి మరకు విరామం ఇవ్వడం మంచిదే
మనిషి 16 గంటలు ఉపవాసముంటే బాగా నీరసిస్తాడు కాబట్టి కనీసం 8 గంటల వ్యవధితో ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉపవాసం వల్ల న్యూరోజెనిసిస్‌ జరగడంతో పాటు, హద్రోగాలు, మెటబాలిజం సంబంధిత వ్యాధులు దరిచేరవని ప్రయోగాలు నిరూపిస్తున్నాయి. కొన్నిమార్లు క్రమం తప్పని ఉపవాసం క్యాన్సర్‌ను కూడా అడ్డుకునే అవకాశాలున్నాయన్నది సైంటిస్టుల భావన. సో... నోటి మరకు విరామం ఇవ్వడం మంచిదే కదా!

అంత సులభమమేమీ కాదు
ఈట్‌ స్టాప్‌ ఈట్‌ ఫిట్నెస్‌ నిపుణుడు బ్రాడ్‌ పిలాన్‌  ప్రవేశపెట్టారు. ఇందులో వారంలో ఏవైనా రెండు రోజులు 24 గంటల పాటు ఉపవాసం ఉండాలి. అంటే ఓ రోజు రాత్రి డిన్నర్‌ చేశాక మరుసటి రోజు రాత్రి డిన్నర్‌ చేసేంతవరకు ఉపవాసం ఉండాలి. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌ నుంచి బ్రేక్‌ఫాస్ట్‌ మధ్య ఉపవాసంగానూ చేసుకోవచ్చు. ఉపవాసం సమయంలో నీళ్లు, కాఫీ, జీరో కేలరీలు ఉండే ఇతర పానీయాలు తీసుకోవచ్చు. బరువు తగ్గేందుకు ఈ పద్ధతి అనుసరించేటట్లయితే ఆహారం తీసుకొనే దశలో మాత్రం సాధారణంగానే భోజనం ఉండాలి. నిజానికి 24గంటల పాటు ఉపవాసం ఉండడం చాలామందికి అంత సులభమైన విషయం కాదు. 

రోజు మార్చి రోజు(ఆల్టర్నేటివ్‌ డే) విధానంలో వారంలో మూడు రోజులు రోజు మార్చి రోజు ఉపవాసం ఉండాలి. లేదా 500 కేలరీల ఆహారం తీసుకోవాలి. ఇందులో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నప్పటికీ దీన్ని పాటించడం చాలా కష్టం. మరీ ముఖ్యం ఉపవాసం రోజు రాత్రి ఖాళీ కడుపుతో నిద్రపోవడం అంత సులభం కాదు. అంతేకాదు, భవిష్యత్తులో ఈ విధానం వల్ల సమస్యలు వచ్చే ప్రమాదమూ ఉంది.
మరికొన్ని పద్ధతులు

లీన్‌  గెయిన్స్‌ ప్రొటోకాల్‌ పద్ధతి
లీన్‌  గెయిన్స్‌ ప్రొటోకాల్‌ పద్ధతిలో ఉదయం అల్పాహారం తీసుకోకూడదు. మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 8గంటల లోపల రెండు, లేదా మూడు అంతకంటే ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవచ్చు.  అంటే రాత్రి ఎనిమిది నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు అంటే సుమారు 16 గంటల పాటు ఉపవాసం ఉండాలి. మహిళలైతే 15గంటలు ఉంటే చాలు.  ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ తినకుండా ఉండలేని వాళ్లకు ఈ పద్ధతి పాటించడం కష్టం. కానీ అల్పహారం ఎగరగొట్టే వాళ్లకు సులభం. అయితే, ఫాస్టింగ్‌ సమయంలో నీళ్లు, కాఫీ, ఇతర జీరో కేలరీల పానీయాలు తీసుకోవచ్చు. దీనివల్ల భోజనంపై ధ్యాస కూడా తగ్గుతుంది. ఉపవాసం ముగిశాక తీసుకునే ఆహారం మాత్రం పూర్తి బలవర్థకంగా ఉండాలి. విపరీతంగా జంక్‌ఫుడ్‌ తినేవారికి, అధికంగా బరువు ఉండే వారికి ఈ విధానంతో ఫలితం ఉండదు. 

ఫాస్ట్‌ డైట్‌ పద్దతిలో వారానికి రెండు రోజులు మాత్రం ఉపవాసం ఉండాలి. ఈ రెండు రోజుల్లో మహిళలు 250 కేలరీల చొప్పున, పురుషులు 300 కేలరీల చొప్పున రెండు సార్లు ఆహారం తీసుకోవాలి. అంటే మహిళలు 500 కేలరీలు, పురుషులు 600 కేలరీలకు మించకుండా ఆహారం తీసుకోవాలి. ఈ విధానంలోని సానుకూల ఫలితాలపై ఇప్పటికీ సరైన పరిశోధనలు లేనప్పటికీ చాలామంది 5:2డైట్‌ను అనుసరిస్తున్నారు.  

ది వారియర్‌ డైట్‌ పద్ధతిలో రోజూ తెల్లవారుజామున 4గంటల నుంచి మధ్యాహ్నం 12లోపు తక్కువ పరిమాణంలో పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. తర్వాత సాయంత్రం 4నుంచి 8 గంటల లోపు లార్జ్‌ మీల్‌ భుజించాలి. ఇది ప్రస్తుతం ఎక్కువ వాడుకలో ఉన్న విధానం. 

స్పాంటేనియస్‌ మీల్‌ స్కిప్పింగ్‌ విధానంలో వారంలో రెండు రోజులు బ్రేక్‌ఫాస్ట్‌ లేదా డిన్నర్‌ తీసుకోకూడదు. అయితే, ఏయేరోజు పాటించాలనేది మీ ఇష్టం. ఉదాహరణకు ఏదైనా రోజు ఆకలి లేనప్పుడు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ మానేసి, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్‌ సమృద్ధిగా తినాలి. ఎప్పుడైనా ప్రయాణాలు చేస్తున్నప్పడు ఒక్కోసారి తినడానికి ఏమీ దొరకవు. అలాంటప్పుడు ఈ పద్ధతి అవలంబించుకోవచ్చు.  

ఆరోగ్యానికి మంచిది కదా అని అన్ని రకాలు ట్రై చేయవద్దు. ఉపవాసం శ్రేయస్కరం కావచ్చు కానీ అతి మంచిది కాదు.
-డి. శాయి ప్రమోద్‌ 

 చదవండి: జర జాగ్రత్త!.. ఆహారం.. విరామం.. అతి చేస్తే హానికరం

మరిన్ని వార్తలు