రవి వర్మ ఆయిల్‌ పెయింటింగ్స్‌ ఎక్కడ నేర్చుకున్నారో తెలుసా ?

29 Apr, 2021 10:47 IST|Sakshi

రాజా రవి వర్మ.. భారతీయ చిత్రకారుడిగా ఆయన పేరు నేటికీ సజీవమే.1848 ఏప్రిల్‌​ 29న కేరళలోని కిలమానూరులో జన్మించిన రవి వర్మ ఏడేళ్ల వయసు నుంచే చిత్రాలు గీయడం ప్రారంభించారు. ప్రతీ రోజూ ఆయన చూసిన దృశ్యాలనే గోడలపై అందమైన చిత్రాలుగా రూపొందించేవారు. రకరకాల పువ్వులు, చెట్ల ఆకులతో తన చిత్రాలకు రంగులద్దేవారు. రవి వర్మ ప్రతిభను మెచ్చిన అప్పటి ట్రావెన్‌కోర్‌ మహారాజా ఆయన ఆస్థానంలోకి సగర్వంగా ఆహ్వానించారు. అక్కడే ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ రామస్వామి నాయుడు వద్ద శిష్యరికం చేసిన రాజా రవి వర్మ..బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్ జెన్సన్ వద్ద ఆయల్‌ పెయింటింగ్‌ ఎలా గీయాలో నేర్చుకున్నాడు.

వాటర్ కలర్‌లకు బదులుగా ఆయిల్ పెయింటింగ్‌ని ఉపయోగించిన తొలి భారతీయ చిత్రకారుడిగా రికార్డులకెక్కారు. రాజా రవి వర్మ ఆయన 18వ ఏట రాజ కుటుంబానికి చెందిన భాగీరథీబాయిని వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం ముగ్గురు పిల్లలు. అతి తక్కువ కాలంలోనే ప్రఖ్యాత చిత్రకారుడిగా రాజా రవి వర్మ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. దేశంలోని నలమూలల నుంచి పెయింటింగ్స్‌ గీయాలని రోజూ కొన్ని వందల అభ్యర్థలను వచ్చేవి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఆయన పెయింటింగ్స్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నా, ఆయన గీసే చిత్రాలు కేవలం దర్శనాత్మకంగా, ఛాందసంగా చిత్రాలు ఉంటాయన్న విమర్శలనూ ఎదుర్కోక తప్పలేదు. 

భారతీయ సాంప్రదాయ చిత్రకళకు  పాశ్చాత్యాన్ని జోడించి పెయింటింగ్స్‌ వేయడంలో రాజా రవి వర్మ సిద్దహస్తులు. అందుకే ఆయన్ను 'ఫాదర్‌ ఆఫ్‌ మోడ్రన్‌ ఇండియన్‌ ఆర్ట్‌'గా పిలుస్తారు. రామాయణ, మహాభారతములోని ఘాట్టాలను అందంగా చిత్రీకరంచే రాజా రవి వర్మ..నలదమయంతుల, శకుంతలా దుష్యంతుల చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. 1873 లో వియన్నాలో జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో మొదటి బహుమతిని గెలుచుకొని ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.


ఆయన పెయింటింగ్స్‌కు విదేశీయులు కూడా ముగ్ధులయ్యేవారు. హిందూ దేవతా స్త్రీల చిత్రాలను దక్షిణ భారతయ స్త్రీలలాగా ఊహించి ఎన్నో పెయింటింగ్స్‌ వేసేవారు. దక్షిణ భారత స్త్రీలు ఎంతో అందంగా ఉంటారని బాగా విశ్వసించేవారు. దేశంలోనే మొదటిసారిగా పెయింటింగ్స్‌ కోసం ముంబైలో అత్యాదునిక ప్రెస్‌ను ప్రారంభించిన రాజా రవి వర్మ ఇందుకోసం దేశం నలుమూలల నుంచి చిత్రకారులను పిలిపించుకున్నారు. ఇక 58 ఏళ్ల వయసులో మధుమేహం కారణంగా 1906లో కన్నుమూశారు. రాజా రవి వర్మ చనిపోయేనాటికి దాదాపు 7వేల పెయింటింగ్స్‌ను గీసినట్లు సమాచారం. రవి వర్మ  మరణానంతరం ఆయన పెయింటింగ్స్‌ను తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీలో భద్రపరిచారు. 


 

మరిన్ని వార్తలు