భయాన్ని  ధైర్యంగా ఎదుర్కోవాలి

31 May, 2021 00:16 IST|Sakshi

మంచి మాట

భయం ప్రాణికి సహజం. మనిషి లో కలిగే ఓ భావోద్వేగమే భయం. భయానికి హేతువు అవగాహనా లేమి. మనల్ని బాధ పెట్టే సమస్య కన్నా దాన్ని గురించి మనం చేసే అర్థరహితమైన ఆలోచన, గోరంతలు కొండంతలుగా చేసే మన దృష్టి మనల్ని  మరింతగా భయపెడుతుంది. మన అవగాహన రాహిత్యానికి ఊహాశక్తిని జోడించి ఆ సమస్య మనల్ని భయ విహ్వలలుగా చేసేటంతగా ఓ విశ్వమంత ఆకారాన్నిస్తాం. ఆది శాసించిన విధంగా నడుచుకుంటాం. 

ఆలోచన, విచక్షణ , వివేచన శక్తులను పోగొట్టుకుంటాం. అన్నిటికి మించి, తార్కికశక్తికి దూరమవుతాం. అహేతుకంగా ప్రవర్తిస్తాం. చదువుల సారాన్ని విస్మరించి కోపాన్ని పెంచుకుంటాం. అతిగా ఆలోచించి, ఆందోళన చెందుతూ ఇతరులకు ఆందోళన కలిగిస్తాం. అపుడే సమాజం మనలను అస్థిరులుగా, ఆస్థిమితులుగా భావిస్తుంది. కుటుంబ సభ్యులకు, మిత్రులకు, తోటివారికి దూరమై ఒంటరవుతాం. శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. మన క్తియుక్తులన్నీ బూడిద పాలవుతాయి. ఇంతటి దారుణమైన పరిస్థితికి కారణం మనల్ని బాధ పెట్టే విషయాన్ని గూర్చి పూర్తిగా, లోతుగా, సహేతుకంగా తెలుసుకోవటానికి ప్రయత్నించక పోవటమే. అలా చేయనంత వరకు భయం, ఆందోళన, వ్యాకులత అనే సునామి సుడిగుండం లోనే తిరుగుతూ, తిరుగుతూ జీవితాన్నే కోల్పోతాం.

 మరి  తరుణోపాయం..?
సాధారణంగా చెప్పాలంటే... ముందు మనం నిర్భయులం కావాలి. అంటే భయం లేనివారని కాదు. భయపెట్టే విషయాన్ని గూర్చి క్షుణ్ణంగా తెలుసుకోవడం. నదిలోతు  లోతు తెలిసినట్టు, ఆందోళన లేదా బాధ పెట్టే విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న వారికే, దానినెదుర్కొనే మానసిక సంసిద్ధత వస్తుంది. ఈ స్థితే నిర్భయత్వం. అది ఉన్నవాళ్లే నిర్భయులంటే. అప్పుడే మనలోని భయంతో పోరాడగలం.
ఈ పోరాట పటిమనే పెద్దలు మనలో కావాలన్నది. ఆ శక్తిని మనలో పెంపొందించు కోవాలన్నది. అపుడే ఏ భయమూ మనల్ని భయపెట్టదు. ‘దేని గురించీ భయపడ నక్కర్లేదు. ఆందోళన కలిగించే సమస్యను అర్థం చేసుకోవాలి. బాగా అర్ధం చేసుకోగలిగినప్పుడే తక్కువగా భయపడతాం’ అంది మేరీ క్యూరీ.

ఈ కరోనా కష్టకాలంలో మనకు కావాల్సింది అవగాహన, స్పష్టత. ఏ వాహికాశ్రయంగా అది మనలోకి ప్రవేశిస్తుందో ఇతమిత్థంగా తెలియదు కనుక అప్రమత్తంగా ఉండాలి. నిపుణుల, వైద్యుల సలహాలు, సూచనలు తు.చ.తప్పక పాటించాలి. నిర్లక్ష్యం కూడదు. తెంపరితనానికి తావే లేదు. 

భయం ఆరోగ్యకరమైనది. అనారోగ్యకరమైనది కూడ. మొదటిది మనల్ని మన అంతరాత్మకు బద్ధుల్ని చేస్తుంది. చెడు వైపు ప్రోత్సహించదు. హెచ్చరిస్తూ, హితవు చెపుతుంది. అప్రమత్తుల్ని చేసి మంచిమార్గంలో పయనింపచేస్తుంది. ఇక రెండవది. మనల్ని నాశనం చేసేది. నిర్వీర్యులుగా చేసేది. ఇది మన అతి ఆలోచన, ఊహ నుండి పుడుతుంది. మన శక్తిని హరిస్తుంది. చైతన్యరహితులుగా చేస్తుంది. ఏదేని సంక్షోభం ఎదురైనవేళ దానితో ప్రతిఘటించే స్థైర్యాన్ని ఇవ్వదు. దానిని చూసి అతిగా భీతిల్లేటట్లు చేస్తుంది. సమస్యలో కుంగి పోయేటట్లు చేస్తుంది. ప్రపంచంలో ఏదీ భయంలా భయపెట్టదు. ఈ రకమైన భయం మన శారీరక, మానసిక శక్తుల్ని మాయం చేస్తుంది. ఈ భయాన్ని మననుండి పారద్రోలాలి. ఈ రకమైన భయాన్ని మనమెలా స్వాధీనం పరచుకుని దాటగలుగుతామన్న దానిమీద మన జీవిత వికాసం ఉంటుంది.

ఆదిమానవుణ్ణి కూడ భయం వెంటాడింది. ప్రకృతి సహజపరిణామాలు, రుతు మార్పులు, వాతావరణ మార్పులు అతణ్ణి వణికింపచేసి, అవి అతీంద్రియ శక్తులన్న భావనను కలుగచేసాయి. సూర్య చంద్రులు, పగళ్ళు, రాత్రుల మార్పులు, గొప్ప శక్తులుగా భావించి దేవుళ్ళ గా ఆరాధించడం ప్రారంభించాడు. ఉరుములు, మెరుపులను దేవతల ఆగ్రహంగా అనుకున్నాడు. అవి ఎలా సంభవిస్తున్నాయో తెలుసుకోగల జ్ఞానం అతనికి లేదు. తన చుట్టూ ఉన్న ప్రకృతి నుండి, జంతువుల నుండి జీవనకళను నేర్చుకుంటూ భాషను తయారు చేసుకుని, భావనా సంపత్తిని పెంచుకుంటూ అభివృద్ధి చెంది నాగరికత నేర్చుకుని విజ్ఞానపరుడయ్యడు. ఆది మానవుడ్ని భయపెట్టిన పరిణామాలకు కారణం తెలుసుకున్నాడు. అజ్ఞానమనే అంధకారం నుండి వెలుగు అనే జ్ఞానం వైపు నడిచాడు. 

ఒకరికున్న ధైర్యనిష్పత్తిలోనే వారి జీవితం విస్తరించడం, కుంచించుకొని పోవడం జరుగుతుంది. అంటే వ్యక్తి ధైర్యవంతుడైతేనే అతని ప్రజ్ఞా విశేషాలు వికసించడం, ఆ వ్యక్తి పురోగతి సాధించడం. ఆ ధైర్యలక్షణం కొరవడిన వారిలో వారి ప్రజ్ఞ వికసించని మొగ్గలా ఉంటుంది. యుగాల మానవ జీవితాన్ని తడిమిచూస్తే ఎన్నో యుగాలు భయాంధకారంలోనే తచ్చాడాయి. ఈ భయం వల్ల ఆలోచనారహితులై ప్రజ బానిసత్వంలోనే మగ్గింది. ధైర్యలేమి వల్ల ప్రశ్నించే ఎరుకనే కోల్పోయింది. ఆ ఎరుక కలిగి, వారిలో స్వేచ్ఛా ఊపిరులూది, స్వాతంత్య్ర కాంక్షను రగిలించగలిగే ఆత్మస్థైర్యం గల నాయకులు అవసరమయ్యారు. వారి జీవితాలలో వెలుగు నింపారు.

చరిత్రను పరిశీలిస్తే ఎన్ని హృదయ విదారక దృశ్యాలు! భూకంపాలు, వరదలు, తుఫానులు డొక్కల కరువు, అణుబాంబు విస్పోటనాలు, జాత్యహంకార యుద్ధ కాండలు, మనుషుల ఊచకోతలు, నియంతల అమానుషత్వం, దమన కాండలు, మోగిన మరణ మృదంగాలు, మృత్యుహేల.... ఉదహరిస్తే ఈ కొన్నే. ఇంకా ఎన్నెన్నో చూసి తట్టుకుని నిబ్బరించుకున్న గుండె ఈ మానవాళిది. అది మనిషి ధీ శక్తి.
 అందుకే కదా షేక్‌స్పియర్‌ మనిషి ధీశక్తిని శ్లాఘిస్తూ అది అనంతమైనదన్నాడు అటువంటి మనిషికి కరోనా గడ్డుకాలాన్ని అప్రమత్తులై, వివేచనతో దాటడం అసాధ్యమా!
వాస్తవాన్నే చూద్దాం. కరోనా మృత్యుకౌగిలి నుండి రక్షించుకుందాం భయాన్ని జయించి.

  – బొడ్డపాటి చంద్రశేఖర్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు