గుండె బరువుగా, ఛాతీ నొప్పిగా ఉంటోందా?

15 Jan, 2021 06:22 IST|Sakshi

సాధారణంగా బీపీ లేదా గుండెజబ్బులు మొదట్లో కాస్తంత పెద్ద వయసు వారికి, మధ్య వయసు దాటిన వారికి మాత్రమే వచ్చేవి. కానీ గత కొన్నేళ్లుగా ఈ విషయంలో  చాలా మార్పులు వచ్చాయి. ఉద్యోగం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి లేదా ఇతరత్రా కారణాల వల్ల నిండా  పాతికేళ్లు నిండని వయసు వాళ్లలో కూడా గుండె సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. ఒక్కోసారి తీవ్రమైన అనర్థాలు కూడా జరుగుతున్నాయి. బీపీతో మొదలైన సమస్య తీవ్రమైన గుండెపోటుకు దారితీస్తుంది. గుండె బరువుగా ఉండటం, ఛాతీలో నొప్పిగా ఉండటం లేదా గుండెదడగా అనిపించడం వంటి లక్షణాలు కొన్నిసార్లు తీవ్రమైన గుండెకు సంబంధించిన రుగ్మతలను సూచిస్తాయి.

గుండె సమస్యలనేవి ఆ స్థాయిలో లోలోపలే చేయాల్సిన చేటును చేసేస్తాయి. పని ఒత్తిడి తీవ్రంగా ఉన్నవారు హైబీపీ సమస్యకు లోనవుతారు. అలాగే పనిఒత్తిడి చాలా ఎక్కువగా ఉండటం అన్నది తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు. ఫలితంగా గుండెదడ, గుండె లయలోనూ మార్పులు కనిపించవచ్చు. ఇలాంటివారు... తమ కుటుంబాల్లో ఏవైనా గుండెజబ్బుల చరిత్ర ఉందేమో చూసుకోవాలి. అలా ఉన్నవారు తప్పనిసరిగా ఒకసారి హృద్రోగనిపుణులను కలిసి గుండె పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. ఆ పరీక్షల్లో తేలిన ఫలితాలను బట్టి అవసరమైతే మందులు వాడాల్సి రావచ్చు. అయితే ఈలోపు ఇలాంటివారందరూ తమ పని లక్ష్యాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్త వహించాలి. రోజుకు కనీసం అరగంటపాటు వ్యాయాయం లేదా వాకింగ్‌ చేయాలి. మంచి జీవనశైలి నియమాలు పాటిస్తూ మానసికంగా ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యమూ కుదుట పడుతుంది. భవిష్యత్తులో గుండెజబ్బులను నివారించుకోవచ్చు. 

మరిన్ని వార్తలు