నది దాహం

23 Jan, 2021 00:42 IST|Sakshi

కిష్వర్‌ నషీద్‌ ఇరవయ్యో శతాబ్దపు గొప్ప స్త్రీవాద రచయిత్రి. గత ఏడాది జూన్‌తో ఎనభై ఏళ్లు నించిన కిష్వర్‌ పుట్టింది ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌ శహర్‌ లో. దేశ విభజన అనంతరం వారి కుటుంబం పాకిస్థాన్‌లోని లాహోర్‌కు వెళ్లింది. అక్కడ ఆమె ఉర్దూ, పర్షియా భాషలు చదువుకున్నారు. ఇల్లు దాటి బయటకు వెళ్లడానికి ఆడపిల్లలను అనుమతించని రోజుల్లో చదువు కోసం కిష్వర్‌ పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఇంట్లోనే ఉండి చదువుకుంటూ మెట్రిక్యులేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత చదువు కొనసాగించడానికి ఇంట్లో పెద్ద సమావేశం... సుదీర్ఘ చర్చ. ఎట్టకేలకు ఆమె కాలేజ్‌లో చేరగలిగారు. పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ అందుకున్నారామె.

ఆమె రచనా వ్యాసంగం 1968లో మొదలైంది. పన్నెండు స్వీయ రచనలతోపాటు అనేక అనువాద రచనలు కూడా చేశారామె. ఆమె కలం నుంచి జాలువారిన గజల్‌లకు లెక్కే లేదు. ప్రపంచ సాహిత్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు కిష్వర్‌. ఆమె రచనలు ప్రధానంగా మహిళలను ఒత్తిడికి గురి చేస్తున్న మతపరమైన విధానాల మీదనే సాగేవి. స్టార్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు, సాహిత్య విభాగంలో లైఫ్‌ టైమ అచీవ్‌మెంట్‌ అవార్డులతోపాటు ఇతర పురస్కారాలను కూడా అందుకున్నారు. గత ఏడాది కోవిడ్‌ బారిన పడి కోలుకున్న నషీద్‌ కోవిడ్‌ బారిన పడిన సమాజాన్ని అక్షరబద్ధం చేశారు. ‘దర్యా కీ తిష్ణాగీ(నది దాహం)’ పేరుతో ఉర్దూలో విడుదల చేసిన సంకలనంలో ఆమె కరోనా బారిన పడిన సమాజంలో ఆమె గమనించిన విషయాలను ప్రస్తావించారు. ఆ కవిత సారాంశం క్లుప్తంగా...

డబ్బాలు నిండే రోజు
‘‘కరోనా ఆర్థిక వ్యవస్థను నిలువుగా చిదిమేసింది. ఇల్లు దాటి కాలు బయటపెట్టకపోతే రోజు గడవదు, కాలు బయటపెట్టినా పని కనిపించదు. ‘ఎవరినీ తాకవద్దు– సామాజిక దూరం పాటించాలి’ అనే మాటలను వింటూనే రోజులు వెళ్లిపోతున్నాయి. మధ్య తరగతి ఎట్టకేలకు సొంతం చేసుకున్న కారును కరోనా అమ్మేసింది. ఇంటి నుంచే పని చేయమని కోరుతోంది ప్రపంచం. ఇంట్లో కూర్చుని చేసే పనులు కాని వృత్తుల్లో వాళ్లకు పని చేసే దారి మూసుకుపోయింది. ఇంట్లో దినుసుల డబ్బాలు ఎప్పుడు ఖాళీ అయిపోతాయోనని భయం. అప్పటికే ఖాళీ అయిన డబ్బాలు... నిండే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ రోజులు లెక్కపెట్టుకుంటున్నాయి. ఎవరి ముందూ చేయి చాచలేని మొహమాటం, అగ్గిపుల్లను కూడా అరువడగలేని ఆత్మగౌరవం. పిల్లల్ని ఇంట్లోనే అట్టి పెట్టుకోవాలి, ఏమీ తోచక ఏడుస్తున్న పిల్లలను రోజంతా సంతోషపెట్టాలి. ఇంటి పద్దులు చూసుకుంటూ అరుచుకుంటూ పరస్పరం కోపంతో విరుచుకుపడుతూ భార్యాభర్తలిద్దరూ అలసిపోతున్నారు. ఎవరినీ ఏమీ అడగడం చేతరానితనం, అడగడానికి అడ్డుపడే గౌరవాల మధ్య జీవితాలు నలిగిపోతున్నాయి. వాస్తవాలను అర్థం చేసుకున్న వృద్ధతరం మాత్రం ఈ కరోనా కష్టకాలానికి వారి జీవితానుభవాలను జోడించుకుని కొత్త భాష్యం చెప్పుకుంటోంది. ఇది ఇలా ఉంటే...

ఇదే ఏడాది పాకిస్థాన్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కొనుగోలు జరిగింది. వార్ధక్యంలో వివాహం జరిగింది. వరుడు  వివాహవేదికకు కిలో బంగారంతో వచ్చాడు. యూరప్‌ దేశాల వాళ్లు బాల్కనీలో నిలబడి గిటార్‌ వాయిస్తూ గడిపారు. కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. నలుగురు మనుషులున్న కుటుంబం కనిపించడం కష్టమైంది. సంగీతంలో శ్రావ్యతలన్నీ ఏకమయ్యాయి కానీ పాటలే వేరయ్యాయి. గోడను మరొక గోడ కలుపుతోంది. గోడల ఆలంబనతో జీవిస్తున్న ఇరుగుపొరుగు మధ్య పలుకు భయం మాటున మూగబోయింది. మౌనంగా సంభవించిన మరణాలు... పూడ్చి పెట్టిన బారులు చైనా గోడలాగ ఆకాశం నుంచి కూడా కనిపిస్తాయి. కరోనా దూసుకుపోతోంది... మానవత్వం మరణిస్తోంది... ఏడాది దాటి పోయింది’’.

>
మరిన్ని వార్తలు