నా జీవితం సుడిగుండంలో చిక్కుకుపోయింది

16 Dec, 2020 04:20 IST|Sakshi
లక్ష్మి

పెళ్లంటే ఏమిటో తెలియని వయసులోనే ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నాడు తండ్రి. పెళ్లయిన తర్వాత అతి కష్టం మీద ప్రైవేటుగా టెంత్‌ వరకు చదువుకుంది. ముగ్గురు పిల్లలను పెంచుకుంటూ ఎలాగో పన్నెండో తరగతి పూర్తి చేసింది. ఆ తర్వాత అనుకోకుండా అనేక మలుపులు తిరిగింది ఆమె జీవితం. మహిళా చైతన్య ఉద్యమ సారథిగా మారింది. ఆమె మూలంగా కొన్ని వేలమంది జీవితాలు బాల్యవివాహమనే చీకటిలో చిక్కుకోకుండా ఒడ్డున పడ్డాయి. ఆమె చేసిన పోరాటం సామాన్యమైనది కాదు. అందుకు స్ఫూర్తి ఎవరో కాదు... తనకు తనే!మహారాష్ట్రలోని తుల్జాపూర్‌కు చెందిన ఓ లక్ష్మి స్ఫూర్తి గాథ ఇది. 

పితృస్వామ్య ఆధిపత్యం వల్ల మహిళా లోకానికి జరుగుతున్న అన్యాయం మీద గొంతు పెగల్చింది. తమకు హక్కులున్నాయనే నిజాన్ని మహిళలకు తెలియచెప్పింది. తమ జీవితంలో తమ ప్రమేయం లేకుండా జరుగుతున్న నిర్ణయాల మీద గళం విప్పుతున్నారు అక్కడి మహిళలు. లక్ష్మి చేపట్టిన మహిళా చైతన్య ఉద్యమంలో ఇప్పటి వరకు పదిహేడు వేల మంది జీవితాలు గట్టున పడ్డాయి. బాల్యవివాహపు ఊబిలో చిక్కుకోకుండా రక్షణ పొందిన వాళ్లు కొందరు, రెండవ వివాహపు కోరల్లో చిక్కకుండా తప్పించుకున్నవారు మరికొందరు. పెద్దగా చదువు లేని, ఒక సామాన్య గ్రామీణ మహిళ... ఇంత పెద్ద ఉద్యమాన్ని చేపట్టడానికి స్ఫూర్తి ఎవరని లక్ష్మిని అడిగితే ఆమె చెప్పే సమాధానం ఒక్కటే. ‘‘నా జీవితం బాల్యవివాహం అనే సుడిగుండంలో చిక్కుకుపోయింది. నన్ను నేను నిలబెట్టుకోవడానికి... నేను చేసిన పోరాటం చిన్నది కాదు. ఇంతకంటే స్ఫూర్తి ఏం కావాలి?’ అని అడుగుతుంది.

లక్ష్మిది మహారాష్ట్ర, తుల్జాపూర్‌లో చర్మకారుల కుటుంబం. ఎనిమిదేళ్లకే పెళ్లి. వరుడు మేనమామ. తనకంటే పదమూడేళ్లు పెద్దవాడు. ‘‘ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరినీ సంబంధాలు వెతికి పెళ్లి చేయడం కంటే చిన్నప్పుడే పెళ్లి చేస్తే ఒక బాధ్యత తప్పుతుందని మా అమ్మానాన్నల ఆలోచన. అలా నాకు పెళ్లంటే ఏంటో తెలియని వయసులోనే పెళ్లయింది. కొంతలో కొంత మేలు ఏంటంటే... పెళ్లయిన తర్వాత బడికి వెళ్లగలగడం. అయితే తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు మెచ్యూర్‌ కావడంతో అక్కడితో చదువాగిపోయింది. చదువు కొనసాగించడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. భోజనం మానేసి అలకబూనాను. చచ్చిపోతానన్నా కూడా మా అత్తవారింట్లో ఎవరూ నేను చదువుకోవడానికి ఒప్పుకోలేదు. పైగా వాళ్ల మాటను మా అమ్మ చేత చెప్పించి నా నోరు నొక్కేశారు. కొన్నేళ్ల తర్వాత ప్రైవేటుగా పదో తరగతి పూర్తి చేశాను. ముగ్గురు పిల్లలను పెంచుకుంటూ అతి కష్టం మీద పన్నెండు వరకు చదివాను. కానీ నాకు సంతృప్తి కలగలేదు’’ అని గతాన్ని గుర్తు చేసుకుంది లక్ష్మి.

ఆర్థిక స్వావలంబన
ప్రభుత్వ సూచనతో స్వయం సహాయక బృందాల ఏర్పాటులో కూడా లక్ష్మి చురుగ్గా ఉంటోంది. అయితే ఆమె భర్త నుంచి విడిపోయిన మహిళలు, వితంతు మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వాళ్ల కోసం విడిగా బృందాలు చేసింది. వాటి పేరు ఏకల్‌ మహిళా సంఘటన్‌. అంటే సింగిల్‌ ఉమెన్స్‌ ఆర్గనైజేషన్‌. జిల్లా అధికారులతో మాట్లాడి సింగిల్‌ ఉమెన్‌కు ష్యూరిటీ అవసరం లేకుండా బ్యాంకు రుణాలు అందేటట్లు చొరవ తీసుకుంది. దాదాపు 200 మంది ఔత్సాహిక మహిళలకు శిక్షణనిచ్చింది. వారి ద్వారా మహిళలను చైతన్యవంతం చేసే మహోద్యమాన్ని విస్తృతం చేసింది. ఇలా రెండు దశాబ్దాల పాటు సాగిన ఆమె సామాజిక సహాయక ఉద్యమంలో లక్ష్మి ద్వారా ప్రత్యక్షం గా, పరోక్షంగా సహాయం పొందిన వాళ్లు పదిహేడు వేల మంది ఉన్నారని లక్ష్మిని సిఐఐ సీఈవో సీమా అరోరా ప్రశంసల్లో ముంచెత్తారు. 

పూల వర్షమే కాదు...
లక్ష్మి జీవితంలో ఆటుపోట్లు, పోరాటాలు, ప్రశంసల పూల వానలు మాత్రమే కాదు, సూటిపోటి మాటల రాళ్లు కూడా ఉన్నాయి. ఆమె భర్త నిరక్షరాస్యుడు. గేదెలను మేపడం, సాయంత్రం మద్యం తాగి తూలుతూ రాత్రికి ఇంటికి రావడం అతడి దినచర్య. ‘ఊరిని ఉద్ధరించింది చాల’ని ఆమె మీద చెయ్యి చేసుకునేవాడు. ‘నీకింకా ముప్పై ఎనిమిదేళ్లు మాత్రమే. ఇంకా చాలా జీవితం ఉంది. ఈ ముళ్లు విడిపించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించ’మని  చెప్పిన అక్కచెల్లెళ్ల లో ‘‘పిల్లల కోసం కొన్ని తప్పవ’’ంటుంది లక్ష్మి ఆవేదనగా. ముఖ్యంగా తల్లి కోసం మాత్రమే అతడిని భర్తగా భరిస్తున్నట్లు వాపోతుంటుంది. తన వైవాహిక జీవితాన్ని చూసిన ఏ తల్లిదండ్రులూ తమ పిల్లలకు బాల్యవివాహాలు చేయరు. తన కష్టం మిగిలిన ఆడపిల్లలకు ఇలాగైనా ఉపయోగపడుతోంది, మంచిదేగా... అంటుంది పంటిబిగువున దుఃఖాన్ని అదిమిపెడుతూ. కొవ్వొత్తి కూడా తాను కాలిపోతున్నానని అనుకోదు. వెలుగునిస్తున్నానని మాత్రమే అనుకుంటుంది. లక్ష్మి కూడా అంతే.

ఊరి డాక్టర్‌
మా ఊరిలో చదువుకున్న వాళ్లు చాలా తక్కువ. రెండు వేల సంవత్సరంలో భారత్‌ వైద్య ప్రోగ్రామ్‌ ప్రారంభమైంది. వైద్య సహాయకురాలిగా పని చేయడానికి ఆ మాత్రమైనా చదివిన మహిళను నేను మాత్రమే. ఊరిలో హెచ్‌ఐవీ, టీబీ, ఇతర అనారోగ్యాల పాలైన వాళ్లను గుర్తించి వైద్య విభాగానికి రిపోర్టు ఇవ్వడంతో నా సర్వీస్‌ మొదలైంది. పంచాయితీ పెద్దల సూచనతో నాకు వైద్యంలో ప్రాథమిక నర్సింగ్‌ సేవల్లో శిక్షణ కూడా ఇచ్చారు. చిన్న చిన్న అనారోగ్యాలకు మందులివ్వడం, గర్భిణులను నెలనెలా పరీక్షల కోసం పెద్దాసుపత్రికి తీసుకెళ్లడం వంటి పనులప్పగించారు. 300లతో మొదలైన నా జీతం ఇప్పుడు ఐదువేల రూపాయలైంది. ఒక్క సెంటు భూమి కూడా లేని నేను నా జీతం తో హాయిగా జీవిస్తున్నాను. ముగ్గురు పిల్లలను చదివిస్తున్నాను. మా ఊరిలో వాళ్లు నన్ను చిన్న డాక్టరమ్మ అంటారు. వాళ్లకు నేను చెప్పేమాట మీద మంచి గురి. అందుకే దేహానికి వైద్యంతోపాటు సామాజిక వైద్యం కూడా చేస్తున్నాను. బాల్యవివాహాలను వద్దని చెప్తూ, నా పోరాటాన్నే వివరిస్తున్నాను. చదువుతో వచ్చే జ్ఞానం, వ్యక్తిత్వం, స్వయం సాధికారతకు కూడా నన్నే మోడల్‌గా చూస్తున్నారు. దాంతో నా మాటకు విలువ పెరుగుతోంది.
– లక్ష్మి 

మరిన్ని వార్తలు