థియేటర్‌లో మీరొక్కరే.. తోడుగా 60 సినిమాలు

10 Jan, 2021 10:07 IST|Sakshi

థియేటర్‌ మొత్తానికి ఒక్కళ్లమే కూర్చొని సినిమా చూస్తే కలిగే ఫీలో, థ్రిల్లో ఎలా ఉంటుందో ఇటీవల కొందరు ప్రేక్షకులు ఢిల్లీలో, ముంబైలో, ఇంకా కొన్ని మెట్రోల్లో.. ఆఖరికి మన హైదరాబాద్‌లో కూడా విధిలేక అనుభూతి చెందారు. కొందరైతే కూర్చోలేక మధ్యలోనే హాల్‌ బయటికి వచ్చేశారు. కరోనా లేని నార్మల్‌ టైమ్‌లో కూడా ఒకరిద్దరితో నడిచిన సినిమాలు అక్కడక్కడా ఆడలేక పోలేదు. 

చాలాకాలం క్రితం ఓ నిర్మాత ప్రేక్షకులకు ఛాలెంజ్‌ విసిరారు. అతడు నిర్మించినది దెయ్యం సినిమా. ఆ దెయ్యం సినిమాను ఒంటరిగా ఒక్కరే హాల్లో కూర్చొని సినిమా మొత్తం చూస్తే ఎన్ని లక్షలో ఇస్తానని ఆయన ప్రకటించారు. ఫలితం ఏమైందన్నది ఇప్పుడు టాపిక్‌ కాదు. వందల సీట్ల మధ్య ఒక్కరమే కూర్చొని గంటా గంటన్నరసేపు సినిమా చూడ్డం ఎలా ఉంటుంది అన్నదీ కాదు. ఎవరికైనా అలా సింగిల్‌గా, ఏకాంతగా సినిమా చూడాలని ఉంటే వాళ్ల కోసం స్వీడన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వాళ్లు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ఏమిటా ఏర్పాట్లు, ఎలా వాళ్లను సమీపించాలి, టిక్కెట్‌ ధర ఎంత.. ఇలాంటివన్నీ నెట్‌లో వెదికితే దొరకుతాయి. ఏమైనా మీరు జనవరి 17 లోపు వెదకాలి.  

ఇప్పుడిక ఒంటరిగా సినిమా చూడాలని లేకపోయినా.. ఈ ఒంటరిగా సినిమా చూడ్డం ఏంటని తెలుసుకునేవాళ్ల కోసం ఈ స్టోరీ అంతా. సంగతేంటంటే ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు స్వీడన్‌లో ఎర్తెబోజియే ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరుగుతోంది. ఎర్తెబోజియే అనేది బాల్టిక్‌ సముద్ర తీర ప్రాంతంలోని ఒక స్వీడన్‌ పట్టణం. ఆ పేరును ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు పెట్టనైతే పెట్టారు గానీ, సినిమాల స్క్రీనింగ్‌లన్నీ జరుగుతున్నది చాలా వరకు అక్కడికి సమీపంలోని పేటర్‌ నోస్టర్‌ దీవిలో. అందులో కొన్ని స్క్రీన్స్‌ ఉన్నాయి. కొన్ని ఆ దీవిలోనే మరోచోట ఉంటాయి. మొత్తం 60 సినిమాలను ప్రదర్శిస్తారు. యేటా ఎర్తెబోజియే ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరుగుతూ వస్తున్నదే కానీ ఈ ఏడాది ఫెస్టివల్‌ ఒక్కటే జరుగుతుంది. ప్రేక్షకులు ఉండరు. ఉండరంటే ఉండరని కాదు. స్క్రీన్‌కి ఒక్కరు, సినిమాకు ఒక్కరు, సినిమా వేళలకు ఒక్కరు ఇలా ఆ వారం రోజులూ వేర్వేరు కాల మాన స్థల పరిస్థితుల్లో సినిమాల ప్రదర్శన ఉంటుంది. ఇక ఆ సినిమాలు తీసిన వాళ్లు, నటించినవాళ్లు, ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్లు, విమర్శకులు వీళ్లుంటారు కదా స్క్రీనింగ్‌ బ్రేక్‌లో.. వాళ్లందరితో ఆన్‌లైన్‌లో వర్చువల్‌ టాక్‌ ఉంటుంది. సరే, ఇప్పుడివన్నీ మామూలే. సోషల్‌ డిస్టెన్స్‌ కాబట్టి ఎర్తెబోజియే కూడా ప్రేక్షకులకు డిస్టెన్స్‌ పాటిస్తోంది.


స్వీడన్‌లోని పేటర్‌ నోస్టర్‌ దీవి (ఇందులో కనిపిస్తున్నవి ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఏర్పాటు చేసిన థియేటర్‌లు); ఆ చివర ఉన్నది బాల్టిక్‌ సముద్రంలోని పేటర్‌ నోస్టర్‌ లైట్‌ హౌస్‌. 

ఒంటరివాడను నేను
సింహం సింగిల్‌గా వస్తుంది అన్నట్లు ఈ ఫెస్టివల్‌ సినిమాలకు సింగిల్‌గా వచ్చేందుకు అర్హత సాధించినవాళ్లకు రెడ్‌ కార్పెట్‌ పరిచి ఉంటుంది. ఉదాహరణకు ఎలాగంటే.. ఎర్తెబోజియేలో స్కాండినేవియమ్‌ ఇండోర్‌ ఎరీనా ఉంది. (ఫొటో చూడండి) అందులో కొన్ని స్క్రీన్‌లు ఉంటాయి. అలాంటి ఎరీనాలు, థియేటర్‌లు పేటర్‌ నోస్టర్‌ దీవిలోనూ మరికొన్ని ఉంటాయి. ఎర్తెబోజియే పట్టణం, పేటర్‌ నోస్టర్‌ దీవి ఆనుకునే ఉంటాయి. ఎవరికి ఏ సినిమాకు, ఏ ఆటకు, ఏ వేళకు లాటరీ తగిలితే (ఇవన్నీ ఆన్‌లైన్‌లోనే అయిపోతాయి. టికెట్‌ ధర మొదలు.. రానుపోను ఖర్చులన్నీ ‘ఒంటరివాడను నేను’ అని సరదాగా పాడుకుంటూ వెళ్లివాళ్లవే). ఆ సంగతి తెలీసీ వెళ్తారు కనుక, వెళ్లాక ఏం జరుగుతుందో చూద్దాం. రెడ్‌ కార్పెట్‌పై మీదుగా నడిచి థియేటర్‌లోకి వెళ్లగానే.. ‘వెల్‌కమ్‌ ఫలానా గారూ.. ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను చూసేందుకు వచ్చిన మీకు మా స్వాగతం. ఈ సినిమాను ప్రత్యేకంగా మీకోసమే వేస్తున్నాం’ అని అనౌన్స్‌మెంట్‌ వినిపిస్తుంది. తర్వాతేముంది? సినిమా చూడ్డమే. రెడ్‌ కార్పెట్‌ వరకు వెళ్లేందుకు మాత్రం దీవిలో పడవ దిగాక.. మరికొన్ని నీళ్లను, రాళ్లను, రప్పల్నీ, కప్పల్నీ, గాలుల్ని దాటుకుని వెళ్లాలి. అదొక అనుభూతి.


పేటర్‌ నోస్టర్‌ దీవిలోని ఇండోర్‌ ఎరీనా (ఇందులో కొన్ని సినిమాలు మీ కోసం స్క్రీన్‌ అవుతాయి).

కరోనా వచ్చి కొత్త కొత్త అనుభవాల్ని చూపించి వెళుతోంది. ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ‘ఐసోలేటెడ్‌ సినిమా’ కూడా అలాంటి అనుభవమే. చివరిగా ఒక మాట. టిక్కెట్‌ గెలుచుకున్నవారు ఆ షో ముగిసేవరకు కొన్నిటిని కోల్పోవలసి ఉంటుంది. ముందుగా సెల్‌ ఫోన్‌. తర్వాత ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు. అక్కడ ఉన్న వారం రోజులూ పూర్తిగా ఆ ఒంటరి వాళ్లవే. పూర్తిగా వాళ్లు ఒంటరి వాళ్లే.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు