సందేశమే ఆమె సినిమా

30 Dec, 2021 03:04 IST|Sakshi

డ్రగ్స్‌కు అలవాటుపడి, కన్నవారికి కష్టంగా మారిన బిడ్డల్లో మార్పు తీసుకురావడానికి సందేశాత్మక చిత్రాల బాట పట్టారు కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన సరళారెడ్డి. ఇటీవల ‘ది ట్రిప్‌’ పేరుతో గంటన్నర నిడివి గల సినిమా తీసిన ఈ గృహిణి గతంలో ‘డాక్టర్‌ భూమి’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ కూడా తీశారు. భర్త, కొడుకు, కోడలు ముగ్గురూ డాక్టర్లే. మరో కొడుకు విదేశాల్లో చదువుతున్నాడు. తమ ఇంటి డాక్టర్ల వద్దకు రకరకాల సమస్యలతో వచ్చేవారిని గమనించే సరళారెడ్డి, ఆ సమస్యల నుంచి షార్ట్, ఫుల్‌ లెంగ్త్‌ మూవీస్‌ తీస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

వాళ్లది డాక్టర్ల ఫ్యామిలీ. నిత్యం ఎంతోమందికి వైద్యం అందించే కుటుంబం. రకరకాల  వ్యక్తులు వస్తుంటారు. వాళ్ల వ్యథలు, గాథలను స్వయంగా చూసిన ఆ ఇల్లాలు చెడు మీద యుద్ధం చేయాలనుకున్నారు. యుద్ధమంటే కొట్లాట కాదు. చెడు అలవాట్ల బారిన పడి, కన్నవారికి కష్టంగా మారిన బిడ్డల్లో మార్పు తీసుకురావడానికి సందేశాత్మక చిత్రాల బాట పట్టారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన సరళారెడ్డి భర్త డాక్టర్‌ రాజమౌళి అక్కడే ఆస్పత్రి నిర్వహిస్తారు. కొడుకు, కోడలు, అల్లుడు ఇలా అందరూ డాక్టర్లే. మరో కొడుకు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్నాడు. తమ కుటుంబం సంతోషంగా ఉంది. కాని సమాజంలో చాలా రకాల రుగ్మతలతో సతమతమవడాన్ని చూస్తున్న సరళారెడ్డి తన వంతుగా ఏదైనా చేయాలని భావించారు.

సరళారెడ్డి రూపొందించిన ‘ది ట్రిప్‌’ సినిమా; ‘డాక్టర్‌ భూమి’ సినిమా

డ్రగ్స్‌.. ది ట్రిప్‌
మొదటి నుంచి తనకు సాహిత్యంపై అవగాహన ఉంది. కథలు చదవడం, రాయడం అలవాటు. సినీ పరిశ్రమలో కొందరు స్నేహితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో సమాజానికి ఉపయోగపడే విధంగా తన ఆలోచనలు సాగాయి. ఆ ఆలోచనల్లో నుంచి పుట్టిందే సందేశాత్మక చిత్రాలు తీయడం. ఇటీవలి కాలంలో గొప్పింటి బిడ్డలు డ్రగ్స్‌కు అలవాటు పడిన సంఘటనలను చూసి చలించి ‘ది ట్రిప్‌’ పేరుతో గంటన్నర నిడివి గల ఓ సినిమాను తీశారు. ఎదిగిన కొడుకు దారి తప్పితే తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. బిడ్డను దారికి తీసుకురావడానికి తల్లి పడిన తపనను కళ్లకు కట్టినట్టు చూపారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారిన వారు ఆ సినిమా చూస్తే ఎంతో కొంత మార్పు కనిపిస్తుంది. ఈ సినిమాలో తన కొడుకు గౌతమ్‌ రాజ్‌ను హీరోగా పెట్టి తీశారు. గౌతం రాజ్‌ జర్మనీలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు.

డాక్టర్‌ భూమి
రోడ్డు ప్రమాదంలో గాయపడిన గర్భిణి బిడ్డను ప్రసవించి ప్రాణం కోల్పోయింది. అనాథగా మారిన ఆ బిడ్డను అక్కున చేర్చుకుని పెంచి పెద్ద చేస్తుంది డాక్టర్‌ భూమి. పేదల కోసం తపించే మనస్తత్వమే ఆ బిడ్డను చేరదీసేలా చేసింది. మరో సంఘటనలో తల్లిని కోల్పోయిన ఓ యాచకురాలి కూతుర్ని తీసుకువచ్చి పెంచుతుంది. అయితే కార్పొరేట్‌ స్కూల్‌లో చదువుతున్న తన కొడుకు తనకు ఓ బెగ్గర్‌ చెల్లిగా రావడాన్ని తట్టుకోలేడు. తోటి స్నేహితులు హేళన చేస్తుంటే భరించలేకపోతాడు. ఆ పాపను తనకు చెల్లిగా అంగీకరించలేకపోతాడు. ‘అన్నయ్యా’ అనే మాట అంటే చాలు పళ్లు కొరుకుతాడు. ఓ రోజు తల్లితో గొడవ పడి ఇంటి గడప దాటి వెళతాడు.

తల్లి మీద కోపంతో ఓ పార్కులో కూర్చుని ఉన్న బాబును తన తల్లితో కలిసి పనిచేసే ఓ డాక్టర్‌ చూసి పలకరిస్తే బెగ్గర్‌ చెల్లిని తెచ్చిన తల్లిమీద తన కోపాన్ని వెళ్లగక్కుతాడు. అప్పుడు ఆ డాక్టర్‌ పన్నెండేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను వివరిస్తాడు. ఓ తల్లి బిడ్డను కన్న వెంటనే చనిపోయిన విషయం గురించి చెప్పి ‘ఆ బిడ్డ ఏమైందో తెలుసా?’ అని ప్రశ్నిస్తాడు. తెలియదంటే ‘ఆ బిడ్డవి నువ్వే’ అని డాక్టర్‌ చెప్పిన మాట విని బిత్తరపోతాడు. నీ కోసం తను పిల్లల్ని కనకుండా భర్తను ఒప్పించి మరీ ఆపరేషన్‌ చేయించుకుందని వివరించడంతో కనువిప్పు కలిగిన ఆ బాబు తల్లి దగ్గరకు వెళ్లి తన అనుచిత ప్రవర్తనకు క్షమాపణ కోరతాడు. ఈ సినిమాలకు కథ, మాటలు స్వయంగా తనే అందించారు. ఇలాంటి సందేశాత్మక సన్నివేశాలతో షార్ట్, ఫుల్‌లెంగ్త్‌ సినిమాలు నిర్మిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సరళారెడ్డి.

మార్పు కోసమే ప్రయత్నం
పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు పెరిగి పెద్దయ్యాక తమకు గొప్ప పేరు తేకున్నా ఫర్వాలేదు, కనీసం ఉన్న పేరు కాపాడితే చాలనుకుంటారు. కాని కొందరు పిల్లలు ముఖ్యంగా యువత చెడు వ్యసనాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎదిగిన కొడుకు దారితప్పాడని తెలిసి కన్నవారు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఒక్కోసారి దారి తప్పిన యువతను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ముఖ్యంగా మాదకద్రవ్యాలకు అలవాటు పడి బానిసలుగా మారుతున్న వారిని చూసి చలించిపోయి రాసిన కథ నుంచి పుట్టిందే ‘ది ట్రిప్‌.’ సందేశాన్ని ఇచ్చే సినిమాలు నిర్మించే ప్రయత్నం చేస్తున్నా. నా ప్రయత్నంతో కొందరిలోనైనా మార్పు వస్తే నా లక్ష్యం నెరవేరినట్టే.
– సరళారెడ్డి, గాంధారి గ్రామం, కామారెడ్డి జిల్లా

– ఎస్‌.వేణుగోపాల్‌చారి, కామారెడ్డి, సాక్షి

మరిన్ని వార్తలు