కోమాలోకి వెళ్తే ఏం చేయాలంటే..

15 Oct, 2020 08:33 IST|Sakshi

కోమా అనేది మరణం వంటి కండిషన్‌. అందుకు కోమాలోకి వెళ్తే వెనక్కి రారనేది  చాలామంది అపోహ. కానీ అది వాస్తవం కాదు. కోమాలోంచి వెనక్కి వచ్చిన కేసులూ చాలా ఎక్కువే. కాకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లేలోగానే రోగి కోమాలోకి వెళ్తే కొన్ని ప్రథమ చికిత్సలు చేయాల్సి ఉంటుంది. వాటిని ఏ, బీ, సీ అంటూ సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు. 
కోమాలోకి వెళ్తే చేయాల్సిన ఏబీసీ... 

  • ఏ – ఎయిర్‌ వే... అంటే ఊపిరి తీసుకునే మార్గంలో అంటే ముక్కు / నోరు దారుల్లో తెమడ / గల్ల వంటిది ఏదైనా ఉంటే దాన్ని గుడ్డతో గాని, చేత్తోగాని తొలగించాలి. 
  • బీ – బ్రీతింగ్‌ ... అంటే గాలి బాగా ఆడేలా చూడాలి. రోగికి ఊపిరి బాగా అందేలా జాగ్రత్తతీసుకోవాలి. 
  • సి – సర్క్యులేషన్‌... అంటే రక్తప్రసరణ వ్యవస్థ సరిగ్గా ఉండేలా చూడాలి. ఈ మూడు అంశాలతో పాటు తల వంటి చోట్ల దెబ్బతగిలి రక్తస్రావం అవుతుంటే... అది కట్టుబడేలా మరీ ఒత్తిడి పడకుండా చూస్తూనే గట్టిగా పట్టుకుని రక్తస్రావం ఆగేలా చూడాలి. 
  • కోమాలోకి వెళ్లిన రోగిని గాలి ధారాళంగా వచ్చే ప్రదేశంలో పడుకోబెట్టాలి. అతడిని వెల్లకిలా కాకుండా పక్కకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టాలి. కోమాలో వెళ్లిన వారిచేత బలవంతంగా నీళ్లు తాగించడం చేయవద్దు. ఈ చర్య ప్రమాదకరంగా పరిణమించవచ్చు. రోగి మెడకు దెబ్బతగిలిందని భావిస్తే సాధ్యమైనంత వరకు మెడను కదలనివ్వకుండా చూడాలి.  

ఆల్కహాల్‌తోనూ ‘కోమా’లోకి... 
మద్యపానం మితిమీరితే కోమాలోకి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ. అతిగా మద్యం తీసుకోవడం వల్ల మెదడు దెబ్బతింటుంది. అందుకే ఆల్కహాల్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఒక్కోసారి ఆల్కహాల్‌ వల్ల వచ్చే ఫిట్స్‌తో కూడా కోమాలోకి వెళ్లవచ్చు. ఆల్కహాల్‌ తీసుకోవడం వల కొన్ని సార్లు కొన్ని విటమిన్లు (ప్రధానంగా థయామిన్‌) లోపించడం వల్ల కోమాలోకి వెళ్తారు. ఈ కండిషన్‌ను ‘వెర్నిక్స్‌ ఎన్‌కెఫలోపతి’ అంటారు. వీరికి కేవలం థయామిన్‌ ఇస్తే చాలు కోమా నుంచి బయటకు వచ్చేస్తారు. ఆల్కహాల్‌ తాగాక తూలి పడిపోయి తలకు దెబ్బ తగలడం, దాని వల్ల రక్తస్రావం కావడం లేదా రక్తం గడ్డకట్టి కూడా కోమాలోకి వెళ్లవచ్చు. ఇలా కోమాలోకి వెళ్లడానికి ప్రధాన కారణం ఆల్కహాల్‌ కావడం వల్ల దాన్ని ఎంత త్వరగా మానేస్తే అంత మంచిది.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు