Jyotsna Bose: కరోనా వారియర్‌.. సడలని పిడికిలి

23 May, 2021 01:27 IST|Sakshi

కార్మిక సంఘాల పోరుబాటలో జీవిత చరమాంకం వరకు పిడికిలి బిగించి ముందు వరుసలో నడిచిన జ్యోత్స్న బోస్‌.. కరోనా పై పోరులో మరణానంతరం కూడా యోధురాలిగానే నిలిచిపోయారు. కరోనాతో మరణించిన జ్యోత్స్నపై ‘పేథలాజికల్‌ అటాప్సీ’ (వ్యాధి అధ్యయనం కోసం చేసే శవ పరీక్ష) జరగడంతో.. దేశంలోనే తొలిసారి కరోనా ప్రభావాల పరిశోధనలకు ఉపయోగపడిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు.

జ్యోత్స్న కోల్‌కతాలోని బెలెఘటలో ఉంటారు. ఆమెకు కరోనా సోకినట్లు ఈ నెల 10న ఆమె కుటుంబం గుర్తించింది. ఆమె మనువరాలు తీస్తా బసు వైద్యురాలు. ప్రాథమిక చికిత్సతో నాలుగు రోజులైనా తగ్గకపోవడంతో జ్యోత్స్నను ఆమె మే 14 న బెలెఘటలోనే ఒక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మే 16న ఆమె మర ణించారు. తను చనిపోతే తన అవయవాలను దానం చేయాలని పదేళ్ల క్రితమే ఆమె అనుమతి పత్రంపై సంతకాలు పెట్టారు. అయితే ఇప్పుడామె చనిపోయింది కరోనాతో. అవయవదానం కుదరదు. అలాగని ఆమె అంతిమ కోరికను నెరవేర్చకుండా ఎలా... అనుకున్నారు తీస్తా బసు. జ్యోత్స్న ఆసుపత్రిలో చేరిన రోజు వేరొక ఆసుపత్రిలో కరోనాతో మరణించిన బ్రోజోరాయ్‌ అనే వ్యక్తికి కోల్‌కతాలోని ఆర్‌.జి.కార్‌ మెడికల్‌ కాలేజీలో పేథలాజికల్‌ అటాప్సీ జరిగింది.

అది స్ఫురించి, జోత్స్న మృతదేహాన్ని కూడా అక్కడికి పంపించారు తీస్తా బసు. మే 20 న అక్కడ ఆమెకు అటాప్సీ జరిగింది. దేశంలోనే తొలిసారి కరోనా పరిశోధనలకు తోడ్పడిన మహిళగా జోత్స్న చరిత్రలో నిలిచిపోయారు. ఆమె తర్వాత కోల్‌కతాలో ప్రముఖ నేత్ర వైద్యులు బిస్వజిత్‌ చక్రవర్తి (60) మృతదేహానికి అటాప్సీ జరిగింది.  జోత్స్న కు ముందు అటాప్సీ జరిగిన బ్రోజోరాయ్‌.. కోల్‌కతాలోని ప్రసిద్ధ అవయవదాన స్వచ్ఛంద సంస్థ ‘గణదర్పణ్‌’ వ్యవస్థాపకులు.  అవయవదానానికి అనుమతినిస్తూ పదేళ్ల క్రితం జ్యోత్స్న సంతకాలు పెట్టి ఇచ్చింది ఆ సంస్థకే. ఇప్పుడీ ముగ్గురి మృతదేహాలపై జరిగిన పరిశోధనల ఫలితాలు వస్తే కరోనాను నివారించేందుకు, నిరోధించేందుకు, నియంత్రించేందుకు దారేదైనా కనిపించవచ్చని ఈ పరీక్షలు నిర్వహించిన వైద్యుల కమిటీ ఆశిస్తోంది.

కరోనాతో మరణించినవారిపై విదేశాల్లో అరకొరగా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ మన దేశంలో ఇలా జరగడం ఇదే మొదటì సారి. పరిశోధనలకు ఉపయోగపడిన తొలి మహిళ జ్యోత్స్న.. మరణానంతరం కూడా కరోనా యోధురాలిగానే దేశానికి గుర్తుండిపోతారు. జ్యోత్స్న 1927లో చిట్టాగాంగ్‌ (నేడు బంగ్లాదేశ్‌లో ఉన్న ప్రాంతం) జన్మించారు. ఆనాటి సామాజిక, రాజకీయ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కార్మిక సంఘాల పోరాటాలలో పాలు పంచుకున్నారు. రాయల్‌ ఇండియన్‌ నౌకాదళ తిరుగుబాటుకు మద్దతుగా 1946లో తంతీతపాల కార్మికుల సమ్మెకు ‘నేను సైతం’ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె తండ్రి అదృశ్యం అయిపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడింది. జ్యోత్స్న చదువు కుంటుపడింది. బ్రిటిష్‌ టెలిఫోన్స్‌లో ఆపరేటర్‌గా చేరి బతుకుబండిని లాక్కొచ్చారు.

మరిన్ని వార్తలు