వాల్తేరులో పుట్టిన అగ్గిబరాటా

30 Mar, 2021 07:18 IST|Sakshi

నేడు దేవికా రాణి 114వ జయంతి

ఫస్ట్‌ లేడీ ఆఫ్‌ ఇండియన్‌ సినిమాగా అందరూ కీర్తించే దేవికా రాణి మన వాల్తేరులో పుట్టింది. మరణించే నాటికి బెంగళూరులో 450 ఎకరాల విలువైన ఎస్టేట్‌ను వారసులు లేకపోవడం వల్ల ఎవరికి చెందాలో తేల్చక వదిలిపెట్టింది. ఆమె 1933లోనే తెర మీద ముద్దు సన్నివేశంలో నటించింది. దిలీప్‌ కుమార్‌ను స్టార్‌ను చేసింది. ఈ రాణి గురించి చాలామందికి తెలియని కొన్ని విశేషాలు...

సాధారణంగా మగవాళ్లు లిఖించే చరిత్రలే నమోదవుతూ ఉండే సందర్భంగా హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించి కొత్తదార్లు, వేర్లూ వేసిన దేవికా రాణిని మాత్రం అందరూ మార్గదర్శిగా గుర్తించి గౌరవిస్తారు. ఆమెను ‘ఫస్ట్‌ లేడీ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా’గా అభివర్ణిస్తారు. అందుకు కారణం ఆమె చేసిన ఘనమైన పనులే. వాల్తేరులో సంపన్న బెంగాలీ కుటుంబానికి దేవికా రాణి జన్మించింది. ఆమె తండ్రి కల్నల్‌ మన్మథనాథ్‌ చౌదరి జన్మతః జమీందార్‌.

తల్లి లీలాదేవి చౌదరి సాక్షాత్‌ రవీంద్రనాథ్‌ టాగూర్‌కు మేనకోడలు. అందుకని దేవికా రాణి 9 ఏళ్లకే లండన్‌ వెళ్లి అక్కడి బోర్డింగ్‌ స్కూల్‌లో చదువుకుంది. అక్కడే పరిచయమైన బారిస్టర్‌ చదువు చదివి సినిమా దర్శకుడైన హిమాంశును ప్రేమించింది. అతని కోరిక మేరకు సినిమా నటిగా మారింది. దానికి ముందే ఆమె సినిమా కళను అభ్యసించింది. మొత్తం మీద సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్‌ల అధ్యయనం తర్వాత ఆ జంట ఇండియా తిరిగి వచ్చి ముంబైలో ‘బాంబే టాకీస్‌’ను ప్రారంభించి సినిమాలు తీసి చరిత్ర సృష్టించారు.

తెర మీద ముద్దు
వెండి తెర మీద తొలి ముద్దు సన్నివేశంలో నటించిన భారతీయ నటి దేవికా రాణీయే. 1933లో తీసిన ‘కర్మ’ సినిమా కోసం భర్త హిమాంశును ఆమె నాలుగు నిమిషాలు ముద్దు పెట్టుకుంది. ఇప్పటికీ కూడా ఇది రికార్డు. ఆ తర్వాత అశోక్‌ కుమార్‌తో కలిసి ఆమె నటించిన ‘అఛూత్‌ కన్య’ సూపర్‌హిట్‌ అయ్యింది. ఆ తర్వాత అశోక్‌ కుమార్‌తో ఆమె చాలా సినిమాల్లో యాక్ట్‌ చేసింది. అశోక్‌ కుమార్‌ ఆ సంస్థలో భాగస్వామి కూడా అయ్యాడు. దేవికా రాణి నటుడు దిలీప్‌ కుమార్‌ను హీరోను చేసింది. ఆ రోజుల్లో (1944) దిలీప్‌ కుమార్‌కు  250 రూపాయలు జీతం ఆఫర్‌ చేస్తే అతను అది నెలకా సంవత్సరానికా తేల్చుకోలేక సతమతమయ్యాడు. కాని ఆమె ఇచ్చింది నెలకే! అప్పటికి రాజ్‌ కపూర్‌కు సంవత్సరమంతా కలిపి ఆర్‌.కె. స్టూడియోలో 150 రూపాయల జీతం వచ్చేది. అలాంటి ప్రభావం దేవికా రాణిది.

అశోక్‌ కుమార్, దేవికారాణి

భర్తతో విడిపోయి
భర్త హిమాంశు జీవించి ఉండగానే అతనితో వైవాహిక బంధంలో ఉండకుండా కేవలం ప్రొఫెషనల్‌ బంధంలోనే ఉండిపోయింది దేవికా రాణి. భర్త చనిపోయాక కొన్నాళ్లకు ఆమె రష్యన్‌ చిత్రకారుడు శ్వెతోస్లవ్‌ రోరిచ్‌ను వివాహం చేసుకుని మనాలిలో ఉండిపోయింది.

ఆ సమయంలో ఆమెకు నెహ్రూ కుటుంబం సన్నిహితమైంది. ఆ తర్వాత ఆ జంట బెంగళూరు వచ్చి 450 ఎకరాల ఎస్టేట్‌ కొని అందులో ఎవరినీ కలవక జీవించారు. ఆమె దగ్గర పని చేసిన మేనేజర్‌ ఒకామె ఆమె ఎస్టేట్‌ విషయాలు గోల్‌మాల్‌ చేసిందనే విమర్శలు వచ్చాయి. దేవికా రాణి మరణించాక ఆ ఎస్టేట్‌ను సొంతం చేసుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం పెద్ద యుద్ధమే చేసింది. చివరకు సొంతం చేసుకుంది. వెండితెర గతిని మార్చిన దేవికా రాణి ముంబైకి, వెండితెర వ్యక్తులకు దూరంగా జీవించడం ఒక విచిత్రం. 1994లో ఆమె మరణించాక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.

మరిన్ని వార్తలు