Ankita Shah: ఆసరాకు అంకితం

20 Apr, 2021 00:26 IST|Sakshi
అంకిత షా

ఆడపిల్లలు తల్లికి ఇంటి పనుల్లో తప్ప తండ్రికి ఏవిధంగా సాయపడగలరు... అనే ఆలోచన నిన్నామొన్నటి వరకు సమాజంలో ఉండేది. ఇప్పుడు ఏమరుపాటుగా కూడా అలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నారు అంకితలాంటి అమ్మాయిలు. గుజరాత్‌లో పుట్టి పెరిగిన అంకిత షా దివ్యాంగురాలైనా ఆటో నడుపుతూ తల్లిదండ్రులకు ఆసరా అయ్యింది. జీవితంలో నిలదొక్కుకోవడానికి తనలాంటి దివ్యాంగులకు ప్రేరణ గా నిలుస్తోంది.

అంకిత ఏడాది బిడ్డగా ఉన్నప్పుడు పోలియో వచ్చి కుడికాలు వైకల్యానికి లోనైంది. అయినా, తల్లిదండ్రులు ఆమెను చదువులో ప్రోత్సహించారు. దీంతో ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసింది అంకిత. 2009లో ఉద్యోగం కోసం అహ్మదాబాద్‌ కు వెళ్లింది. చుక్కెదురైంది అక్కడ. అక్కడనే కాదు, అలా చాలా చోట్ల ఇంటర్వ్యూలకు హాజరయ్యింది. కానీ, ప్రతీచోటా తిరస్కారాన్నే ఎదుర్కొంది. కొన్ని ఆఫీసులలో వైకల్యం కారణంగా జాబ్‌ ఇవ్వలేమన్నారు. అంకిత కుటుంబంలో తోబుట్టువులతో కలిపి ఏడుగురు సభ్యులు. తండ్రి సంపాదన పైనే ఇల్లు గడిచేది. అంకిత చిన్న చిన్న పనులు వెతుక్కొని చేసినా అవేవీ కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. ఇది చాలదన్నట్టు అంకిత తండ్రి నాలుగేళ్ల క్రితం క్యాన్సర్‌ బారిన పడ్డాడు.

మనో ధైర్యమే ఊతంగా..
సంపాదించే పెద్ద దిక్కు లేకపోతే ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితిలో ఉంటుందో ఊహించవచ్చు. అప్పటికీ కుటుంబ పోషణకు సరిపడా ఉద్యోగం కోసం అంకిత వెతుకుతూనే ఉంది. అలాంటి సమయంలోనే దివ్యాంగుడైన ఆటో డ్రైవర్‌ లాల్జీ బారోట్‌ పరిచయం అయ్యాడు. ఏ పనీ దొరక్క చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడంతో అతను అంకితకు ఆటో నడపడం నేర్పించాడు. ఆటో నడపడం పూర్తిగా వచ్చాక, లైసెన్స్‌ తీసుకుంది అంకిత. ఆటో రిక్షా కొనుగోలులోనూ అంకితకు సాయం చేశాడు బారోట్‌. దీంతో మూడేళ్లుగా అంకిత ఆటో డ్రైవింగ్‌ చేస్తూ నెలకు రూ.25 వేలు సంపాదిస్తోంది.

‘డ్రైవింగ్‌ వల్ల మొదట్లో వళ్లు నొప్పులు వచ్చేవి అయినా, కుటుంబం కళ్ల ముందు మెదిలి మనోధైర్యాన్నే ఊతంగా చేసుకుంది. శక్తినంతా కూడదీసుకొని డ్రైవింగ్‌లో నైపుణ్యం సాధించింది. ‘రోజూ ఉదయం 10:30 గంటల నుంచి ఆటో నడపడానికి బయల్దేరుతాను. తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి 8:30 గంటలు అవుతుంది. మా నాన్న బాధ్యత తీసుకోగలిగాను అనే ఆనందంతోపాటు కుటుంబానికి భరోసాగా ఉన్నాను అనే సంతృప్తి కలుగుతుంది. ధైర్యం చేసి ఉండకపోతే ఈ రోజు మా కుటుంబం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది’ అంటోంది అంకిత. తండ్రి బాధ్యతను భుజాలకెత్తుకున్న కూతురుగానే కాదు దివ్యాంగులకూ ప్రేరణగా నిలుస్తోంది అంకిత.

మరిన్ని వార్తలు