ఉండనివ్వరేల ఘనాఘనులు

26 Mar, 2021 00:04 IST|Sakshi
అంజు సేథ్‌

రాజీనామా

అరవై ఏళ్ల చరిత్ర కలిగిన కలకత్తా ఐ.ఐ.ఎం. (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌) కు సుమారు రెండున్నరేళ్ల క్రితం అంజు సేథ్‌ డైరెక్టర్‌గా వచ్చినప్పుడు కలకత్తా ఐ.ఐ.ఎం.కు తొలి మహిళా డైరెక్టరుగా ఆమె గుర్తింపు పొందారు. అయితే డైరెక్టరుగా మాత్రం ఆమె నిర్ణయాలకు, నిర్దేశాలకు, చివరికి ఆదేశాలకు కూడా గుర్తింపు గౌరవం లభించలేదన్న విషయం సోమవారం ఆమె రాజీనామా చేసి బయటికి వస్తున్నప్పుడు మాత్రమే ఆమెతో పాటు బయటపడింది!

పురుషుడు స్త్రీని అధికారంలోకి రానివ్వడా! రానివ్వక తప్పనప్పుడు ఉండనివ్వడా!. ఉండనివ్వక తప్పనప్పుడు బాధ్యతలన్నీ సగౌరవగా ఆమెపై కుమ్మరించి అధికారాలన్నీ తన దగ్గరే ఉంచేసుకుంటాడా! అధికారం లేకుండా బాధ్యతలు ఎలా నెరవేర్చడం?! స్త్రీ సాధికారత అని మాటలు చెబుతుండే.. చదువు, వివేకం గల పెద్దపెద్ద సంస్థలలో కూడా ఇంతేనా! స్త్రీ.. పేరుకేనా ‘పదవి’లో ఉండటం. అంజూ సేథ్‌ విషయంలోనూ ఇదే జరిగింది. పురుషాధిక్య ‘పోరు’ పడలేక ఆమె తన డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేసి ఐఐఎం (కలకత్తా) మెట్లు దిగి వెళ్లిపోయారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ ఐఐఎం కి తొలి మహిళా డైరెక్టర్‌ ఆమె.

అంజూ సేథ్‌ వెళ్లిపోతుంటే చైర్మన్‌ ముఖం చాటేశారు. బోర్డ్‌ చూస్తూ నిలబడింది. ఫ్యాకల్టీ మౌనంగా ఉండి పోయింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ నేడూ రేపట్లో ఏమైనా మాట్లాడుతుందేమో చూడాలి. మేనేజ్‌మెంట్‌ రంగంలో అంజూ సేథ్‌ అత్యంత సమర్థురాలని పేరు. ఐఐఎమ్‌కి 2018లో డైరెక్టర్‌గా వచ్చే ముందువరకు యూఎస్‌లో ఆమె పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. ఐఐఎమ్‌లో చేరినప్పటి నుంచీ డైరెక్టర్‌ హోదాలో ఆమె నిర్ణయాలను చైర్మన్‌ రెస్పెక్ట్‌ చేయడం లేదని ప్రధాన ఆరోపణ. ఆమెతో అతడి సమస్య ఏంటి? ఒక నిస్సహాయురాలిలా ఈ ఉన్నత విద్యావంతురాలు ఎందుకు వెళ్లిపోవలసి వచ్చింది? గ్లాస్‌ సీలింగ్‌ ని బ్రేక్‌ చేసిన మహిళను అసలే నిలవనివ్వరా ఈ ఘనాఘనులు?!  

అరవై ఏళ్ల చరిత్ర కలిగిన కలకత్తా ఐ.ఐ.ఎం. కు సుమారు రెండున్నరేళ్ల క్రితం అంజు సేథ్‌ డైరెక్టర్‌గా వచ్చినప్పుడు కలకత్తా ఐ.ఐ.ఎం.కు తొలి మహిళా డైరెక్టరుగా ఆమె గుర్తింపు పొందారు. అయితే డైరెక్టరుగా మాత్రం ఆమెకు గుర్తింపు గౌరవం లభించలేదన్న విషయం ఆమె రాజీనామా చేసి బయటికి వస్తున్నప్పుడు మాత్రమే ఆమెతో పాటు బయటపడింది! వర్జీనియాలోని ‘పంప్లిన్‌ కాలేజ్‌ ఆఫ్‌ బిజినెస్‌’లో ప్రొఫెసర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఇండియా వచ్చి 2018 నవంబరులో కలకత్తా ఐ.ఐ.ఎం.లో డైరెక్టర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించారు అంజు సేథ్‌. అయితే తనను ఏనాడూ ఇక్కడివాళ్లు ‘లోపలి మనిషి’ చూడలేదని, ఐ.ఐ.ఎం.–సి ఛైర్మన్‌ శ్రీకృష్ణ కులకర్ణిని ఉద్దేశించి ఆమె ఎప్పటి నుంచో అంటూనే ఉన్నారు.

సిబ్బంది చెబుతున్న దానిని బట్టి కూడా డైరెక్టర్‌ పరిధిని అతిక్రమించి వచ్చి మరీ ఛైర్మన్‌ ఆమె విధులకు ఆటంకాలు కలిగించారు. అనేక కమిటీల నుంచి ఆమెను ఉద్దేశపూర్వకంగా తొలగించారు! నిధుల సమీకరణ కమిటీ నుంచి తప్పించారు. ఆమెకున్న నియామక అధికారాలను నామమాత్రం చేశారు. ఆమెపై క్రమశిక్షణ చర్యలకు బోర్డు సభ్యులను ప్రేరేపించారు. పైపెచ్చు తిరిగి ఆమె మీదే గత డిసెంబరులో విద్యామంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్‌ఖేర్‌కు ఆమె పనితీరు సవ్యంగా ఉండటం లేదని, వివక్షతో కూడిన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫ్యాకల్టీ చేత లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయించారు. ఇవన్నీ కూడా అంజు సేథ్‌ తనకై తను బయటపెట్టినవి కాదు. బోర్డు సభ్యులలో, ఫ్యాకల్టీ విభాగంలో నిజానిజాలు తెలిసినవారు మీడియాకు వెల్లడించినవి.  

అంజు సేథ్‌ కూడా కలకత్తా ఐ.ఐ.ఎం.లోనే (1978) చదివారు. 1988లో మిషిగాన్‌ యూనివర్సిటీలో డాక్టరేట్‌ చేశారు. 2008లో వర్జీనియా టెక్‌ (పంప్లిన్‌ కాలేజ్‌ ఆఫ్‌ బిజినెస్‌) లో ప్రొఫెసర్‌గా చేరారు. తిరిగి పదేళ్ల తర్వాత ఇండియా వచ్చారు. తనొక మహిళ కాబట్టి వివక్షకు గురయ్యానని ఆమె బలంగా నమ్ముతున్నారు.

మరిన్ని వార్తలు