మాగాణుల్లో మిథేన్‌కు చిరు చేపలతో చెక్‌! 

6 Feb, 2024 10:54 IST|Sakshi

వాతావరణాన్ని వేడెక్కిస్తున్న మిథేన్‌, కార్బన్‌ డయాక్సయిడ్‌ కన్నా 86 రెట్లు  ఎక్కువ పర్యావరణానికి హాని చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలోకి విడుదలవుతున్న మిథేన్‌ వాయువులో 10శాతం మేరకు వరి  పొలాల నుంచే వెలువడుతోందని అంచనా. అయితే, వరి  పొలాల్లోని నీటిలో చిరు చేపల (గోల్డెన్‌ షైనర్‌ రకం)ను పెంచితే మూడింట రెండొంతుల మిథేన్‌ వాయువు తగ్గిందని కాలిఫోర్నియాకు చెందిన రిసోర్స్‌ రెన్యువల్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఆర్‌ఆర్‌ఐ) అనే స్టార్టప్‌ కంపెనీ చెబుతోంది. 

‘ఫిష్‌ ఇన్‌ ద ఫీల్డ్స్‌’ పేరిట పైలట్‌  ప్రాజెక్టు ద్వారా రెండేళ్లుగా పరిశోధనలు చేస్తున్న ఈ స్టార్టప్‌ కంపెనీ ఇటీవల ‘ద జెఎం కప్లన్‌ ఇన్నోవేషన్‌ ప్రైజ్‌’ను గెల్చుకొని ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ‘వరి రైతులకు చేపల ద్వారా అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. సముద్ర చేపలను దాణాల్లో వాడే బదులు ఈ పొలాల్లో పెరిగే చేపలను వాడటం ద్వారా భూతాపాన్ని తగ్గించడానికి, చేపల జీవవైవిధ్యాన్ని పెంపొందించడానికి మా పరిశోధనలు ఉపకరిస్తాయి. 1,75,000 డాలర్ల ప్రైజ్‌ మనీతో మేం చేపట్టిన ప్రయోగాత్మక సాగుకు ఊతం వచ్చింది..’ అన్నారు ఆర్‌.ఆర్‌.ఐ. వ్యవస్థాపకులు దెబోరా మోస్కోవిట్జ్, ఛాన్స్‌ కట్రానో.

ఆసియా దేశాల్లో అనాదిగా సాగు చేస్తున్న వరి–చేపల మిశ్రమ సాగులో అదనపు ప్రయోజనాన్ని కొత్తగా వారు శోధిస్తున్నారు. సుస్థిర ఆక్వా సాగుతో పాటు రైతుల ఆదాయం పెరుగుదలకు, భూతాపం తగ్గడానికి ఉపకరిస్తుందంటున్నారు. మాగాణుల్లో వరితో పాటు చేపలు పెంచితే ‘కార్బన్‌ క్రెడిట్స్‌’ ద్వారా కూడా అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.              

మరికొన్ని సంగతులు
ప్రపంచంలోని గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో నాలుగింట ఒక వంతు ఆహారం , వ్యవసాయం నుంచి వస్తున్నవే. వీటిల్లో నైట్రస్ ఆక్సైడ్ , మీథేన్‌దే అగ్రభాగం. ప్రపంచ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో 13 శాతం వ్యవసాయం, అటవీ  భూ వినియోగంనుంచి వస్తుండగా,  21 శాతం ఇంధన కాలుష్యం. వరి పంట, పశువుల పెంపకం వంటి పద్ధతులు నేరుగా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు దోహదం  చేస్తాయనేది నిపుణుల వాదన. పంటకోత, నాటడం, రవాణా ద్వారా కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలు, అలాగే యూరియాతో పండించిన  గడ్డితినే పశువుల ద్వారా, పేడ  నిర్వహణ ద్వారా ద్వారా   మీథేన్  విడుదలవుతుంది. 

ఎరువుల వాడకం, నేల శ్వాసక్రియ వలన నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ-స్మార్ట్ వ్యవసాయం ద్వారా ఉద్గారాల ప్రభావాలను తగ్గించాలనేది ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా సమర్థవంతమైన పశువుల పెంపకం, శిలాజ ఇంధనంపై  ఆధారపడటాన్ని తగ్గించడం, జంతు-ఆధారిత ఆహార పదార్థాల నిర్వహణ లాంటివి ప్రధానంగా ఉన్నాయి. ఇవి సుస్థిర ఆహార వ్యవస్థకు దోహదపడతాయి కూడా.  గ్రీన్‌హౌస్ వాయువులపై వ్యవసాయ  ప్రభావాన్ని  తగ్గించడం మన భూగ్రహ మనుగడకు చాలా అవసరం. 
           

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega