ఫాస్టింగ్‌ కాస్తంత ఎక్కువగా... పోస్ట్‌ లంచ్‌ తక్కువగా ఉంటోందా? 

15 May, 2022 14:46 IST|Sakshi

గ్లూకోజ్‌ లెవెల్స్‌

డయాబెటిస్‌ను నిర్ధారణ చేసేందుకు సాధారణంగా పొద్దున్నే పరగడుపున (ఫాస్టింగ్‌) ఒకసారి రక్తపరీక్ష, తిన్న తర్వాత దాదాపు రెండు గంటలకు మళ్లీ మరోసారి రక్తపరీక్ష చేస్తారు. ఫాస్టింగ్, పోస్ట్‌ లంచ్‌ అని పిలిచే ఆ పరీక్షల్లో... ఫాస్టింగ్‌లో 100 పోస్ట్‌ లంచ్‌లో 140 ఉంటే అది నార్మల్‌గా పరిగణిస్తారు. ఒకవేళ ఫాస్టింగ్‌లో 126 వరకు వచ్చినా... అప్పుడే మందులు మొదలు పెట్టరు. కానీ... అలా వచ్చినవారికి వారు ‘బార్డర్‌లైన్‌’ అనే స్థితిలో ఉన్నారనీ... అంటే రక్తంలో చక్కెర అదుపు సరిగా లేని కారణంగా భవిష్యత్తులో డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ అని డాక్టర్లు హెచ్చరిస్తారు. 

ఫాస్టింగ్‌ విలువలు ఎక్కువగా... పోస్ట్‌ లంచ్‌ మరీ తక్కువగా ఉంటే...? 
కొందరిలో ఫాస్టింగ్‌ విలువలు 115 నుంచి 124 వరకు కనిపించవచ్చు. కానీ భోజనం తర్వాత చేసే పోస్ట్‌ లంచ్‌లో విలువలు మరీ తక్కువగా అంటే... 130, 135 రావచ్చు. ఇలా ఫాస్టింగ్‌లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ, పోస్ట్‌లంచ్‌లో మరీ తక్కువగా రావడాన్ని కూడా బార్డర్‌లైన్‌గానే పరిగణించాలి. పోస్ట్‌ లంచ్‌లో విలువలు మరీ తక్కువగా రావడాన్ని అంతా బాగున్నట్లుగా అనుకోడానికి వీల్లేదు. 

ఎందుకిలా జరుగుతుందంటే... 
రక్తంలో ఉన్న చక్కెర మోతాదును అదుపులో పెట్టేందుకు ఎంత అవసరమో తెలుసుకుని, దానికి తగ్గట్టుగా ప్యాంక్రియాస్‌ గ్రంథి ఇన్సులిన్‌ని విడుదల చేస్తుంది. కానీ రక్తంలో ఎంత చక్కెర ఉంది అన్న అంచనా ఒక్కోసారి ప్యాంక్రియాస్‌కు తెలియదు. అలాంటి సందర్భాల్లో అది ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్‌ను స్రవిస్తుంది. దాంతో రక్తంలోని చక్కెరపాళ్లు బాగా పడిపోతాయి. ఇలాంటి పరిణామం జరిగినప్పుడే పోస్ట్‌ లంచ్‌ విలువలు మరీ తక్కువగా వస్తుంటాయి. 

ముందస్తు సూచనగా పరిగణించాల్సిందే... 
డయాబెటిస్‌ వచ్చే ముందు ఇలా జరిగే అవకాశం ఉంది కాబట్టి... దీన్ని కూడా  డయాబెటిస్‌కు ముందు దశగా అంటే ‘బార్డర్‌లైన్‌’గా పరిగణించవచ్చు.  డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఆలస్యం చేసేందుకు లేదా చాలాకాలం పాటు నివారించేందుకు తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తింటుండాలి. ఆహారంలో పిండిపదార్థాలు తగ్గించి, అన్ని రకాల పోషకాలు అందేలా కూరలు ఎక్కువగా కలుపుకుని తింటుండాలి. వీలైనంతవరకు ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం మేలు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ, బరువును అదుపులో పెట్టుకోవాలి. ఈ నియమాలు కేవలం బార్డర్‌లైన్‌ వారికి మాత్రమే కాకుండా డయాబెటిస్‌ను నివారించాలని కోరుకునే ఆరోగ్యవంతులకూ బాగానే ఉపయోగపడతాయి.  

మరిన్ని వార్తలు