రత్నమ్మ.. రియల్‌ ఫుడ్‌ హీరో!

13 Oct, 2020 09:14 IST|Sakshi

అనేక ఆహార పంటలను పండించడమే కాదు, వాటిని శుద్ధి చేసి నేరుగా వినియోగదారులకు అందిస్తూ ఇతర మహిళా రైతులకు కూడా అండగా ఉంటున్నారు ఫుడ్‌ హీరో కె. రత్నమ్మ (55).

రత్నమ్మది అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తలపూరు గ్రామం. 15 ఏళ్ల క్రితమే భర్త ఇల్వు వదలి ఎటో వెళ్లిపోయినా మనోధైర్యంతో నిలబడి ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేశారు. మూడెకరాల మెట్ట, నీటి వసతి ఉన్న రెండెకరాల భూమిలో కొర్రలు, సామలు, కందులు, అరికెలు, ఊదలు, వేరుశనగ వంటి పంటలను ఆమె సాగు చేస్తున్నారు. అంతేకాదు ఆమె మహిళా రైతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాని (ఎఫ్‌.పి.ఓ.)కి ఆమె అధ్యక్షురాలు కూడా. 4 పంచాయతీల్లోని 270 మంది మహిళా రైతులు ఆ ఎఫ్‌.పి.ఓ.లో సభ్యులు. వీరికి విత్తనాలు ఇచ్చి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించేందుకు తోడ్పడటం, ఆ పంటను ఎఫ్‌.పి.ఓ. ద్వారా కొనుగోలు చేసి.. శుద్ధి చేయించి విక్రయించటం.. సభ్యులకు లాభాలు పంచటం.. ఇదంతా సమర్థవంతంగా చేస్తున్న నిజమైన ఫుడ్‌ హీరో రత్నమ్మ.

‘బుచ్చి పద్ధతి’లో మిక్సీలతో ఇంటిపట్టునే సిరిధాన్యాల పొట్టు తీసి బియ్యం తయారు చేస్తున్న రత్నమ్మ

కొర్రలు, సామలను డా.ఖాదర్‌ వలి సూచించిన ‘బుచ్చి పద్ధతి’లో మిక్సీలతో ఇంటిపట్టునే పొట్టు తీసి బియ్యం తయారు చేసి గ్రామంలోని వారికి, ఇతర ప్రాంతాల వారికి విక్రయిస్తూ ఈ ఎఫ్‌.పి.ఓ. సభ్యులు మంచి ఆదాయం పొందుతుండటం విశేషం. తమ గ్రామాల్లో 79 మంది షుగర్‌ వ్యాధితో బాధపడుతున్న వారిని ఎంపిక చేసి వారికి నెలనెలా ప్రత్యేకంగా తయారు చేసిన సిరిధాన్యాల కిట్‌ను అందిస్తుండటం రత్నమ్మ చేయిస్తున్న మరో మంచి పని. ‘రెడ్స్‌’ సంస్థ వ్యవస్థాపకులు భానుజ (9440017188) తోడ్పాటుతో రత్నమ్మ తన జీవితాన్ని చక్కదిద్దుకోవడంతో పాటు ఎఫ్‌.పి.ఓ.లోని ఇతర మహిళా రైతులకు మెరుగైన జీవనానికి బాటలు వేస్తున్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఈ ఫుడ్‌ హీరోలందరికీ జేజేలు!రత్నమ్మ 

మరిన్ని వార్తలు