తస్మాత్‌ జాగ్రత్త.. కావ్యలా మీ ఫొటోలు లీక్‌ అయ్యే ఛాన్స్‌!

16 Dec, 2021 00:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రోజువారీ అలవాటుగా ఉదయం నిద్రలేస్తూనే ఫోన్‌ చూడటం మొదలుపెట్టింది కావ్య (పేరుమార్చడమైనది). సోషల్‌ మీడియా అకౌంట్‌ ఓపెన్‌ చేయగానే తన ఫొటోతో కనిపించిన ఓ నోటిఫికేషన్‌ చూసి, ఆశ్చర్యపోతూ యాక్సెప్ట్‌ చేసింది.

అందులో తన వ్యక్తిగత ఫొటోలు కనిపించడంతో ఒక్క సారిగా నిద్రమత్తు వదిలిపోయింది. ఆ ఫొటోలు తను అప్‌లోడ్‌ చేయలేదు. కేవలం తను ఉన్న ఫొటోలతో మరో అకౌంట్‌ ఉండటం ఏంటో అర్థం కాలేదు. అసలు ఆ ఫొటోలు ఎవరి చేతిలోకి ఎలా వెళ్లాయో తెలియదు. తనెంతో ముచ్చటపడి తీసుకున్న ఫొటోలు, ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు. రెండేళ్ల క్రితం ఫొటోలు అవి.

ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో హుందాగా ఉండే కావ్యకు ఈ పరిస్థితి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ ఫొటోలను, వీడియోలను చూసిన తన స్నేహితులు, బంధువులు ఫోన్లు చేసి, ‘ఏంటీ పిచ్చి పని?’ అంటూ అడగడం మొదలుపెట్టారు. తనకేమీ తెలియదని ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు. ‘నలుగురిలో పెట్టవలసిన ఫొటోలేనా ఇవి’ అంటూ కొందరు కావ్య పేరెంట్స్‌ కి ఫోన్‌ చేసి మరీ అడగడంతో ఇంటిల్లిపాదికి ఈ సమస్య పెద్ద భూతమైపోయింది.

ఎప్పుడూ ఆ ఫోన్‌లోనే ఉంటావ్, ఏ ఫోటో పోస్ట్‌ చేయాలో, ఏ ఫొటో దాచుకోవాలో ఆ మాత్రం తెలియదా! ఇలా అందరిలో పరువు తీయాలని కంకణం కట్టుకున్నావా’ అంటూ కూతురినే తప్పు పట్టారు తల్లీదండ్రి. తనకేమీ తెలియదని కావ్య ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. విషయాన్ని ఢిల్లీలో ఉంటున్న తన కజిన్‌తో పంచుకుంది కావ్య. ఈ సమస్యను పరిష్కరించుకునే మార్గం తెలియడం లేదని, బయటకు వెళ్లడానికే భయంగా ఉందంటూ కళ్లనీళ్లతో చెప్పింది. ‘నీ ఫోన్, ట్యాబ్‌.. వంటి పరికరాలు ఏవైనా ఎవరికైనా ఇచ్చావా’ అని అడిగింది కావ్య కజిన్‌. ‘లేదు’ ఏడుస్తూనే చెప్పింది కావ్య.

‘బాగా గుర్తు తెచ్చుకొని, మళ్లీ ఫోన్‌ చెయ్‌’ అంది కావ్య కజిన్‌. తీవ్రంగా ఆలోచించిన కావ్యకు ఏడాది క్రితం తన పాత ఫోన్‌ పాడైతే రిపేర్‌కు ఇచ్చిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ ఫోన్‌ నుంచి తీసుకున్న ఫొటోలే ఇప్పుడు తన ఈ సమస్యకు అతి పెద్ద కారణం అన్నమాట... అనుకుంది. ఆర్నెల్ల క్రితం కొత్త ఫోన్‌ కొనుక్కొని, ఆ ఫొటోలన్నీ సిస్టమ్‌ స్టోరేజీలో కాపీ చేసుకుంది. ఫోన్‌ మాత్రం ఎవరికీ అమ్మలేదు. ఎప్పుడైనా అవసరం వస్తే వాడచ్చులే అని ఇంట్లోనే ఉంచింది. ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థమైంది కావ్యకు. ఆ షాప్‌ మీద పోలీస్‌ కంప్లైంట్‌ ఇవ్వడంతో తన సమస్యకు పరిష్కారం దొరికింది. ఎవరు ఆమె ఫొన్‌లోని డేటాను తస్కరించింది, సోషల్‌మీడియాలో ఫేక్‌ అకౌంట్‌ సృష్టించి, ఫొటోలు ఎలా అప్‌లోడ్‌ చేసిందీ తెలిసింది.

► పాడైన డిజిటల్‌ పరికరాల డేటా మొత్తం కాపీ చేసుకొని, ఫార్మాట్‌ చేసి, అప్పుడు రిపేర్‌కు ఇవ్వడం శ్రేయస్కరం.
► తొందరపడి అనుచిత నిర్ణయాలు తీసుకోవడం కంటే నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌
www.cybercrime.gov.in లో రిపోర్ట్‌ చేయడం లేదా 155260 కి కాల్‌ చేయడం వల్ల పరిష్కారం లభిస్తుంది.
► సోషల్‌ మీడియా ఖాతాను ఉపయోగిస్తున్నప్పుడు ప్రత్యేక అక్షరాలున్న పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం, కాలానుగుణంగా మార్చడం వల్ల హ్యాక్‌ అవడం, డేటా తస్కరించడం వంటి వాటికి అడ్డుకట్ట వేయవచ్చు.
► సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో గోప్యత కోసం జిపిఎస్‌ సెట్టింగ్‌లను కాన్ఫిగర్‌ చేయాలి.
► సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వ్యక్తిగతమైన సమాచారాన్ని ఎప్పుడూ షేర్‌ చేయవద్దు.
► తెలియని పరిచయాల నుంచి వచ్చే అనుమానాస్పద లింక్‌లను క్లిక్‌ చేయడం మానుకోవడం వల్ల వ్యక్తిగత డేటాకు సంబంధించిన సమాచారం మోసగాళ్ల చేతికి చిక్కకుండా చేయగలం. అలాగే, ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేసినవారమవుతాం.
► మీరు ఇతరులకు షేర్‌ చేసే ఫొటో వెరిఫికేషన్‌ కోసం గూగుల్‌ రివర్స్‌ ఇమేజ్‌ ద్వారా చెక్‌ చేయచ్చు. లేదా
www.tineye ని ఉపయోగించవచ్చు,

అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

మరిన్ని వార్తలు