వెర్రింత: వద్దన్నా వినలేదు.. అనుమతి తీసుకుని మరీ.. 57 మీటర్ల ఎత్తు నుంచి దూకి చచ్చిపోయాడు!

29 May, 2022 11:45 IST|Sakshi

వెర్రింత

రెక్‌లెస్‌ ఇన్వెంటర్‌

ఫ్రాంజ్‌ రీచెల్ట్‌.. ఇతడు ఓ ఫ్రెంచ్‌ టైలర్‌. 1878 అక్టోబర్‌ 16న జన్మించిన రీచెల్డ్‌.. సొంతంగా పారాషూట్స్‌ తయారు చేసేవాడు. ఆ పారాషూట్స్‌ సాయంతో  ఎత్తయిన బిల్డింగ్స్‌ మీద నుంచి ఎన్నో సాహసాలు కూడా చేశాడు. అయితే ఒకసారి అతడికి ఒక ఆలోచన వచ్చింది. అత్యంత ఎత్తయిన చోట నుంచి దూకి తను తయారు చేసిన పారాషూట్స్‌ పనితనాన్ని ప్రదర్శించాలనుకున్నాడు.

దానికి తగ్గ పారాషూట్‌ను కూడా సిద్ధం చేసుకున్నాడు. అందుకు.. 330 మీటర్స్‌ (1,083 ఫీట్స్‌) ఈఫిల్‌ టవర్‌ని ఎంచుకున్నాడు. అయితే మొదట అతడికి అనుమతి లభించలేదు. ఎన్నో ప్రయత్నాలు చేయగా చేయగా 1912లో ఈఫిల్‌ టవర్‌ మొదటి ప్లాట్‌ఫామ్‌ నుంచి దూకేందుకు (57 మీటర్ల ఎత్తు నుంచి) ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

దాంతో 1912 ఫిబ్రవరి 4న పోలీస్‌ల ఆధ్వర్యంలో వేలాది మంది సమక్షంలో.. విలేకర్ల కెమెరా ఫ్రేముల నడుమ.. అతడు అనుకున్నదే చేశాడు. వ్యక్తిగత పారాషూట్‌ వద్దు అని ఎంతమంది వారించినా వినకుండా తను తయారు చేసిన పారాషూట్‌నే ఉపయోగించి అక్కడ నుంచి దూకాడు.

తీరా గాల్లో ఉన్నప్పుడు అతడి పారాషూట్‌ మొరాయించడంతో అతడి కథ ముగిసింది. ఫ్రాంజ్‌ రీచెల్ట్‌ తీవ్ర గాయలతో చనిపోయాడు. ఆ మరునాడు వార్త పత్రికలన్నీ అతడి గురించి రాసే వార్తకు ఒకే హెడ్డింగ్‌ పెట్టాయి... రెక్‌లెస్‌ ఇన్వెంటర్‌(నిర్లక్ష్య ఆవిష్కర్త) అని!

చదవండి: భయారణ్యం.. ఇదో ఆత్మహత్యల అడవి
  

మరిన్ని వార్తలు