స్వేచ్ఛ.. ఆనంద హేతువు

15 Aug, 2022 00:17 IST|Sakshi

స్వేచ్ఛ ఒక పోరాటం, ఆనంద స్థితి. సత్యావగాహన, ఆస్వాదనీయం. ఒక అభిలషణీయమైన, హర్షదాయకమైన మార్పు. మనిషి మనీషిగా రూపొందగల మార్గం. స్వేచ్ఛ ఒక బాధ్యత, ఐక్యత, గౌరవభావన.

ఒక వృద్ధుడు రోడ్డు మీద నడుస్తూ తన చేతిలోని వాకింగ్‌ స్టిక్‌ని గిరగిరా తిప్పుతూ నడవసాగాడు. ఏదో కూనిరాగం తీస్తూ చాలా సంతోషంగా ముందుకు సాగుతున్నాడు. తనొక్కడే రోడ్డుమీద ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఆలా తిరిగే కర్ర దెబ్బ నుండి చాలా మంది తప్పించుకుంటూ, పెద్దవాడు కనుక ఏమనలేక  తిట్టుకుంటూ వెళ్లిపోతున్నారు.

చివరకు ఒక విద్యార్థి ధైర్యంగా ఆ తిరుగుతున్న కర్రను చేత్తో పట్టుకుని ఆపి ఆయన తన స్వేచ్ఛనుకుంటూ చేస్తున్న ఆ పని వల్ల మిగిలినవారు ఎలా ఇబ్బంది పడుతున్నారో వివరించాడు. అంతేకాదు, ఆ స్వేచ్ఛ లోని విశృంఖలతను ఆయన దృష్టికి తెచ్చి, ఆలోచింప చేసాడు. అంతేకాదు మనకూ దాన్ని స్ఫురింపచేసాడు.

నవ్వు తెచ్చే సంఘటనగా ఉన్నా దీని వెనక ఎంత గొప్ప భావన ఉందో చూడండి. స్వేచ్ఛను నిర్వచించి దానికున్న పరిధులు ఉంటాయన్న ప్రాథమికమైన ముఖ్య విషయాన్ని ఆ రచయిత చిన్న ఉదాహరణ ద్వారా ఎంత సులభంగా వివరించాడో చూడండి. మనం స్వేచ్ఛను అనుభవించే పద్ధతి ఇతరుల స్వేచ్ఛను హరించకూడదన్న విషయాన్ని ఎంత బాగా చెప్పాడో చూసారు కదా!

మనకు నచ్చిన విధంగా మన జీవితాన్ని గడపటమే వ్యక్తిగత స్వేచ్ఛ. ఆహార, ఆహార్యాలలో, మనదైన భావనలో, సిద్ధాంతాలతో, విశ్వాసాలతో మన చిత్తానికి తోచినట్టు జీవితాన్ని సాగించటంలో పూర్తి స్వాతంత్య్రం, అలాగే, మన విశ్వాసానికి అనుగుణంగా ఒక దైవాన్ని లేదా అనేక దైవాలను ఆరాధించటంతో పాటు ఆ దైవప్రదేశాల సందర్శన మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు.

మనకు నచ్చిన దైవాన్ని లేదా అందరి దైవాలను పూజించే హక్కు మన ప్రతి ఒక్కరికీ ఉంది. మన వ్యక్తిగతమైన ఈ  స్వేచ్ఛకు అడ్డు చెప్పటం గాని అవరోధం కలిగించటం కాని,  దీనిని తప్పు పట్టే అధికారం కాని ఇతరులకు లేదు. అలాగే మనకూ ఇతరుల స్వేచ్ఛలోకి చొరబడే హక్కు లేదని గ్రహించి అందుకు అనుగుణంగా వర్తించాలి. మన స్వేచ్ఛను పూర్తిగా అనుభవిస్తూ ఇతరులకు ఉన్న ఆ స్వతంత్రతను గౌరవించటం మన సంస్కారాన్ని, విజ్ఞతను చాటుతుంది.

మన భావప్రకటనా శక్తి కూడ మన స్వేచ్ఛను తెలియచేప్పేదే. విద్య, ఆధ్యాత్మిక, రాజకీయ రంగాలలోనే కాక ఇతర రంగాలలోనూ వచ్చే మార్పులకు మనం స్పందించి, దాన్ని వ్యక్తపరచటమూ మన స్వేచ్ఛను తెలియపరుస్తుంది. మన అభిప్రాయాలను స్పష్టంగా, సూటిగా తెలియపరచటంతో పాటు ఉచితమైన, ఆమోదయోగ్యమైన, మర్యాదకరమైన భాషను వాడాలి. సిద్ధాంతాలమీద, భావనల మీద మన ఉద్దేశాన్ని ఎంత నిర్కర్షగా మనం చెప్పదలచుకుంటే అంతగా చెప్పచ్చు. ఇక్కడ సమతౌల్యం, సంయమనం అవసరం. ఈ భావప్రకటనా స్వేచ్ఛ చక్కని ఆలోచనల, భావనల మార్పిడికి / బదిలీకి సహాయపడి మనలను వ్యవస్థను మెరుగు పరచుకునేందుకు మార్గం సుగమం చేస్తుంది.

విద్యలో స్వేచ్ఛ అత్యంతావశ్యకం. గురువులు చక్కని వాతావరణాన్ని సృష్టించాలి. ఆ ఉత్సాహభరితమైన, ఉల్లాసభరితమైన స్థితి విద్యార్థులను నిర్భయులను చేసి  వారి సందేహాలను, అనుమానాలను వ్యక్తపరచి నివృత్తి చేసుకునేటట్టు చేస్తుంది. ఇరువురి మధ్య విద్యాసంబంధమైన చనువుతో పాటు ఒక ఆత్మీయతను ఏర్పరుస్తుంది. గురుశిష్యులను దగ్గరకు చేరుస్తుంది. వారి బంధాన్ని దృఢం చేస్తుంది. గురువులు చెప్పే విద్యను వెంటనే అంగీకరించక పరీక్షించే గుణాన్నిస్తుంది. శోధించే తత్వాన్ని పెంపొందిస్తుంది. ఈ రకమైన స్వేచ్ఛా వాతావరణం ఉభయులకూ ఎంతో మేలు చేస్తుంది. అంతే కాదు, ఇద్దరినీ అప్రమత్తులను చేస్తుంది.

స్వేచ్ఛ ద్విముఖి. సక్రమంగా వినియోగించుకున్నప్పుడు అనంత ప్రయోజనకారి. ఇది మనకు నిర్భయాన్నిస్తుంది. ధైర్య, స్థైర్యాలనిస్తుంది. స్వతంత్రంగా ఆలోచించే శక్తిని ప్రసాదిస్తుంది. ఇది మన ఊహాప్రపంచపు పరిధులను విస్తరింప చేస్తుంది. మన మేధను పదను పరుస్తుంది. మన సృజనకు నిత్య నూతనత్వాన్ని ఇస్తూ వికసింప చేస్తుంది. నిజమైన స్వేచ్ఛ ఏ నిర్బంధానికి, సంకుచితత్వానికి, స్వార్థానికి లొంగక ప్రజలు నిర్భయంగా, ఆనందంగా సంచరించే స్వర్గధామమని అన్నారు విశ్వకవి రవీంద్రులు.

స్వేచ్ఛ సహజంగా వీచే వాయువు లాంటిది. కాని అనేక కారణాలవల్ల ఆ స్వేచ్ఛావాయువును పీల్చు కోలేకపోతున్నాం. ముఖ్యంగా పిల్లలు. వీరి స్వేచ్ఛకు తల్లిదండ్రులు, గురువులు, సమాజం, దేశపరిపాలనా రీతి  కారణం. కొన్ని యుద్ధ ఉన్మాద దేశాలలోని భయానక వాతావరణం కూడ పిల్లల స్వేచ్ఛను హరించి వేస్తుంది. ఆహారం కాదు ఆహ్లాదం, ఆనందం లేనిచోట స్వేచ్ఛ లేనట్టే. అందుకే ‘స్వేచ్ఛ కోరే మనసు ఉంటే పొందలేనిది ఏముంది’  ‘మానవుడు పుట్టుకతో స్వేచ్ఛాజీవి.

కాని ప్రతి చోట బందీనే’ అంటారు రూసో. ఎలా..?  ఏమిటీ సంకెలలు? బంధాలు,అనుబంధాల పై మితిమీరిన మమేకత, ప్రేమ, మమకారం, ఆకర్షణ. నేను, నాది , ఆస్తి పాస్తులు , చరాచరాస్తులు, చావు పుట్టుకల సహజత్వాన్ని అంగీకరించని తత్వం అనే అనేకానేక శృంఖలాలు. వీటినుండి బయటపడే నిజమైన స్వేచ్ఛ అసలైన స్వేచ్ఛ. స్వాతంత్య్రం. అద్భుతమైన ఈ దశకు మనస్సు చేరుకునేందుకే ఆధ్యాత్మిక సాధన, ఆ సాధనాపరుల తపన, లక్ష్యం. మనస్సు ఈ అరిషడ్వార్గాలనుండి విముక్తి పొందటమే ఎంతో ఉన్నతమైన స్వేచ్ఛ. అపుడంతా, అన్నిటా ఆనందమే. స్వేచ్ఛ పరమావధి బహ్మానందమే.

మనస్సు ఒక స్వేచ్ఛా విహంగం. ఈ మాయామోహిత జగత్ప్రవాహంలో దాని రెక్కలు తడిసి ముద్దవుతుంటాయి. పక్షి తన పదునైన ముక్కుతో చిక్కుతీసుకుంటూ రెక్కలార్చుకుంటుంది. అలాగే మనిషి తన మనోవిహంగపు రెక్కలను భవబంధాల సంకెళ్ల నుంచి విడుదల చేసే యత్నానికే స్వేచ్ఛ అనే మరో పేరు. అపుడు మనోవిహంగపు సంచరించగల ఆవరణం అనంతం.

బలమైన దేశాలు బలహీనమైన దేశాలను తమ చెప్పుచేతల్లోకి తీసుకుని ప్రజలను బానిసత్వవు ఊబిలోకి తోసేసేసిన వైనాలెన్నెన్నో.  స్వేచ్ఛ అనే ప్రాణవాయువు అందక వారు ఎలా జీవచ్ఛవాలుగా మారారో చరిత్ర చెపుతుంది. అందుకే శ్రీ శ్రీ..
ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం.. అన్నాడు. స్వేచ్ఛ ప్రాణుల ఊపిరి.

– బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు

మరిన్ని వార్తలు