French Bubble Palace Facts: బుడగల మాదిరి భవనం..కట్టడానికే 14 ఏళ్లు..కానీ..

24 Sep, 2023 12:39 IST|Sakshi

ఈ విచిత్ర నిర్మాణం ఫ్రాన్స్‌లోనిది. పీయెయిర్‌ బెర్నార్డ్‌ అనే ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్త ఈ భవనాన్ని కట్టించుకున్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేనంత వినూత్నంగా భవనాన్ని నిర్మించాలని కోరడంతో ఫిన్నిష్‌ ఆర్కిటెక్ట్‌ యాంటీ లోవాగ్‌ 13 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బుద్బుద భవంతికి రూపకల్పన చేశాడు. దీని నిర్మాణానికి పద్నాలుగేళ్లు పట్టింది. చూడటానికి విచిత్రంగా బుడగల మాదిరిగా కనిపించే ఈ భవన నిర్మాణాన్ని 1975లో మొదలుపెడితే, 1989లో పూర్తయింది.

ఇందులోకి వచ్చిన రెండేళ్లకే బెర్నార్డ్‌ మరణించాడు. తర్వాత దీనిని ఫ్రెంచ్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ పీయెయిర్‌ కార్డిన్‌ కొనుగోలు చేశాడు. భవనం పాతబడినట్లు అనిపించడంతో ఫ్రెంచ్‌ ఆర్కిటెక్ట్‌ ఓడిల్‌ డెక్‌ ఆధ్వర్యంలో మరమ్మతులు జరిపించి, కొత్త హంగులు సమకూర్చాడు. దీనిని 2017లో 350 మిలియన్‌ యూరోలకు (రూ.3120 కోట్లు) అమ్మకానికి పెట్టినా, కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈలోగా 2020లో కార్డిన్‌ మరణించాడు. ఇప్పుడు దీన్ని విహారయాత్రలకు వచ్చే పర్యాటకులకు అద్దెకు ఇస్తున్నారు. 

(చదవండి: 16 రోజుల్లో యూరప్‌ చుట్టేశాడు!..అదికూడా కేవలం..)

మరిన్ని వార్తలు