Friendship Day 2022: అల్లుకుంటున్న 'ఈ' స్నేహం.. ఫ్రెండ్‌షిప్‌ డే స్పెషల్‌ స్టోరీ!

7 Aug, 2022 17:33 IST|Sakshi

అల్లుకుంటున్న ఈ స్నేహం 
స్నేహం... చెప్పేది కాదు.. చేసేది!
వర్ణించే వీలు లేనిది.. ఆస్వాదనలో మాత్రమే అందేది!
కష్టాన్ని తీర్చేది.. సంతోషాన్ని పెంచేది! 
మంచి.. చెడులు ఎంచకుండా ఎల్లకాలం వెంట ఉండేది!
తప్పుల్ని కాస్తూ ఒప్పుల్లో నడిపించేది.. జనం మెప్పు అందించేది!
దీని గుణం ఇంత గొప్పది కాబట్టే ఫ్రెండ్‌ లేని జీవన ప్రయాణం ఎడారిని తలపిస్తుంది! 
ఈ ప్రస్తావనకు సందర్భం ‘ఫ్రెండ్‌షిప్‌ డే’ అని అర్థమయ్యే ఉంటుంది!

ఇరుగు,పొరుగు ఆవరణలు.. వీథులు.. బడులు.. కాలేజీలు.. ప్రయాణాలు ఎట్‌సెట్రా ఎట్‌సెట్రా.. స్నేహం కుదరని చోటు లేదు ఈ లోకంలో. కరోనా వచ్చి మనిషిని ఏకాకిని చేద్దామని ప్రయత్నించింది. ఆ పరీక్షకూ నిలబడింది స్నేహం.. సోషల్‌ మీడియా ద్వారా వర్చువల్‌ రూపం తీసుకుని. నిజానికి ఈ వర్చువల్‌ ఫ్రెండ్‌షిప్‌.. సోషల్‌ మీడియా పరిచయం అయిన నాటి నుంచే ఉనికిలో ఉంది.

దాన్ని కరోనా బలోపేతం చేసింది. ఆ మాటకొస్తే కలం స్నేహాల కాలంలోనే వర్చువల్‌ ఫ్రెండ్‌షిప్‌లు ఊపిరి పోసుకునుంటాయి. ఉత్తరాలు.. లాంగ్‌ డిస్టెన్స్‌ స్నేహాలను పదిలంగా ఉంచాయి. వీటన్ని భర్తీ చేస్తోంది సోషల్‌ మీడియా! మార్పులు మనుషుల మీద ప్రభావం చూపిస్తున్నా తాను ఇగిరిపోకుండా జాగ్రత్త పడుతూనే ఉంది స్నేహం.

ఏ కొత్త మీడియం వచ్చినా దాన్ని తనకు వేదికగా మలచుకుంటోంది మనిషిని వదిలి వెళ్లిపోకుండా! ఈమెయిల్స్‌ మొదలు ఆర్కుట్‌.. ఫేస్‌బుక్‌.. ట్విట్టర్‌.. ఇన్‌స్టాగ్రామ్‌.. వాట్సాప్‌ ఇలా ఏ నెట్‌వర్క్‌లోనైనా ముందు ఇమిడిపోయింది స్నేహమే. 
బిజీ లైఫ్‌.. సాయంత్రాలు వీథి మలుపుల్లో.. ఇరానీ చాయ్‌ సెంటర్లలో.. థియేటర్లలో.. బాతాఖానీ కొట్టే వెసులుబాటును ఇవ్వలేకపోయినా ‘ఆన్‌లైన్‌’లో కావలసినంత

స్పేస్‌ తీసుకుంటోంది ఫ్రెండ్‌షిప్‌. Hai.. Hwru, 5n అనే పొడి పొడి పదాల దగ్గర్నుంచి బాల్య స్నేహితుల గ్రూప్, స్కూల్, కాలేజ్‌ గ్రూప్స్, వర్క్‌ ప్లేస్‌ ఫ్రెండ్స్‌ గ్రూప్, ట్రావెల్‌ ఫ్రెండ్స్‌ గ్రూప్, కామన్‌ ఇంటరెస్ట్స్‌ ఫ్రెండ్స్‌ గ్రూప్‌ దాకా రకరకాల సమూహాల రూపంలో స్నేహం పలకరిస్తూనే ఉంది. నైతికంగా మద్దతిస్తూనే ఉంది. సోషల్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ వల్ల వ్యక్తిగతంగా కంటే వర్చువల్‌గా నడుస్తున్న స్నేహాలే ఇప్పుడు మనిషికి ఊరటనిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఆన్‌లైన్‌ స్నేహితులనే ఎక్కువగా కోరుకుంటున్న వాళ్లూ పెరిగిపోతున్నారు. అందుకే ఆన్‌లైన్‌ స్నేహం పాత జాన్‌ జిగ్రీలను బ్లెస్‌ చేస్తూనే కొత్త దోస్తుల జాబితానూ తయారు చేస్తోంది.

ఫేస్‌బుక్‌ ద్వారా 40 ఏళ్లకు.. 
నలభై ఏళ్ల కిందట.. విడిపోయిన బాల్యమిత్రులు ఫేస్‌బుక్‌ ద్వారా తిరిగి కలుసుకున్న ఘటన ఇది. వాళ్లది ఇరవై ఏళ్ల స్నేహం. ఒకరికి ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం రావడంతో కుటుంబసమేతంగా వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. అడ్రస్‌ మిస్సయ్యింది. పైగా అప్పట్లో ఫోన్‌ సౌకర్యం కూడా పెద్దగా లేకపోవడంతో ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. ఎయిర్‌ఫోర్స్‌ మిత్రుడు రిటైర్‌మెంట్‌ తర్వాత ఇంట్లోనే ఉండిపోయాడు.

ఒకరోజు.. ఫేస్‌బుక్‌లో తన చిన్ననాటి స్నేహితుడు తారసపడ్డాడు. రాజకీయవేత్తగా ఎదగడంతో సంతోషం వ్యక్తం చేసి.. ఫేస్‌బుక్‌లో అతని వాల్‌ మీద ఉన్న ఫోన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేశాడు. ఆ ఫోన్‌ రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి.. ‘ముంబై నుంచి జాకబ్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేశాడ’ని అవతలి స్నేహితుడికి చెప్పాడు. అతను ఎవరో కాదు టీఆర్‌ఎస్‌ నేత పద్మారావు. తనకు ఫోన్‌ చేసిన వ్యక్తి 40 ఏళ్ల కిందట దూరమైన తన బాల్యమిత్రుడు జాకబ్‌ అని తెలియడంతో పద్మారావు ఆనందంతో తబ్బిబ్బయ్యారు. 

ప్రాణ సఖి
వేలు నాచియార్‌.. పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన మహారాణి. బ్రిటిషర్స్‌ మీద మొట్టమొదటిసారిగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సాహసి. నిజానికి ఆమె చేసిన పోరును ప్రథమ స్వాతంత్య్ర సమరం అనొచ్చు. అయితే కుయిలీ అనే యోధ లేకపోతే  వేలు నాచియార్‌ ఆ పోరాటం అంత సులవయ్యేది కాదు.

కుయిలీ.. వేలు నాచియార్‌కు ప్రాణ స్నేహితురాలు. బ్రిటిష్‌ పాలకుల మీద స్నేహితురాలు తలపెట్టిన యుద్ధంలో ఆమెకు అండగా నిలిచి పోరాడింది. తన ఒంటి మీద నెయ్యి, నూనె పోసుకుని, నిప్పంటించుకుని మానవ బాంబుగా కదనరంగంలోకి దూకింది. తన స్నేహితురాలి కోటను కాపాడింది. భారతదేశ చరిత్రలో తొలి మానవ బాంబు కుయిలేనట.


 తుది శ్వాస వరకు.. 
కొప్పెరుంచోళుడు .. చోళుల తొలితరం రాజుల్లో ఒకడు. పిసిరంతైయార్‌ కవి. ఈ ఇద్దరూ తమ జీవితకాలంలో ఒకరినొకరు చూసుకోలేదు. కొప్పెరుంచోళుడి పరిపాలనకు ముగ్ధుడయ్యాడు పిసిరంతైయార్‌. అతని కవిత్వానికి ఆరాధకుడయ్యాడు కొప్పెరుంచోళుడు. కాలం గడుస్తోంది. కొప్పెురుంచోళుడి ఇద్దరు కొడుకులకు పరిపాలనా కాంక్ష పెరిగింది. తండ్రిని హింసించసాగారు. కొడుకులను ఏం చేయలేక.. అలాగని ప్రజల బాధ్యతను దుర్మార్గులైన తన కొడుకుల చేతుల్లో పెట్టలేక  తాను ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు అన్నపానీయాలు మానేసి.

తను ప్రాణత్యాగానికి సిద్ధమవుతున్నానని.. తానుంటున్న గదికి పక్కనున్న గదిలోకి వచ్చి ఉండాల్సిందిగా తన మిత్రుడు పిసిరంతైయార్‌కు వర్తమానం పంపాడు చోళరాజు. అయితే.. పిసిరంతైయార్‌ బయలుదేరి వచ్చేసరికే  కొప్పెరుంచోళుడు ప్రాణాలు వదిలేశాడట. అప్పుడు ఆ కవి.. తనను తన స్నేహితుడు కూర్చోమన్న గదిలో కూర్చుని అతనూ అన్న, పానీయాలు మానేసి.. ప్రాణాలను వదిలేశాడట స్నేహితుడిలాగే. అలా చివరికి ప్రాణాలు విడిచే సమయంలోనూ ఆ ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేదు.


హిస్టరీ మెన్‌
జధునాథ్‌ సర్కార్, జీఎస్‌ సర్దేశాయి, రఘుబీర్‌ సింగ్‌.. ఈ ముగ్గురూ  చరిత్రకారులు. చక్కటి స్నేహితులు. ఎలాంటి పొరపొచ్చాలకు తావీయని యాభై ఏళ్ల స్నేహ బంధం వాళ్లది. ముందు ఉత్తరప్రత్యుత్తరాల ద్వారానే వీళ్ల మధ్య స్నేహం కుదిరింది. నాలుగేళ్ల ఆ లెటర్‌ కరెస్పాండెన్స్‌ అనంతరం 1909లో సర్దేశాయి, సర్కార్‌ మొదటిసారి కలుసుకున్నారు.

ఆ తర్వాత కొన్నాళ్లకు రఘుబీర్‌ సింగ్‌ కూడా తోడయ్యాడు. అప్పటి నుంచి ఈ ముగ్గురూ తరచుగా కలుసుకుంటూ చరిత్ర నుంచి ప్రాపంచిక విషయాల దాకా ఎన్నిటినో చర్చించుకునేవాళ్లు. ఈ చర్చలు, వాళ్ల స్నేహం భారతదేశ చరిత్రలో కొత్త కోణాలు శోధించడానికి.. సరికొత్త అధ్యాయాలను రచించడానికి దోహదపడ్డాయి. వాళ్ల మైత్రిని ‘హిస్టరీ మెన్‌’ అనే పుస్తకంగా మలచాడు టీసీఏ రాఘవన్‌ అనే రచయిత.

జాన్‌ జిగ్రీస్‌
మహ్మద్‌ అలీ జిన్నా.. లోకమాన్య బాల గంగాధర్‌ తిలక్‌..  సిద్ధాంతాలు, అభిప్రాయ భేదాలకు అతీతంగా చక్కటి స్నేహం చేయొచ్చని నిరూపించిన మంచి మిత్రులు. తీరిగ్గా  తిలక్‌ వాళ్లింట్లో .. పనిలో ఉన్నప్పుడు  హైకోర్ట్‌లోని జిన్నా చాంబర్‌లో కూర్చుని ఈ ఇద్దరూ గంటల కొద్దీ మాట్లాడుకునేవాళ్లట. ఆ సంభాషణల్లో వాళ్ల రోజూవారి పనుల నుంచి దేశ స్వాతంత్య్రం వరకు ఎన్నో విషయాలుండేవట. తిలక్‌తో తన స్నేహం గురించి తన దగ్గరి వాళ్లతోనే కాదు బహిరంగ సమావేశాల్లోనూ ప్రస్తావించేవాడు జిన్నా.  తర్వాత కాలంలో జిన్నా తన రాజకీయ వైఖరిని మార్చుకున్నప్పటికీ తిలక్‌తో స్నేహంలో మాత్రం రవ్వంత తేడా కూడా రానివ్వలేదట.

మైత్రీ మధురిమలు
జార్జ్‌ హ్యారిసన్‌.. పండిట్‌ రవిశంకర్‌ల స్నేహం చెప్పుకుని తీరాల్సిందే. ఏషియన్‌ మ్యూజిక్‌ సర్కిల్‌ ద్వారా పండిట్‌ రవిశంకర్‌ పరిచయమయ్యాడు హ్యారిసన్‌కు. అప్పుడు మొదలైన స్నేహం.. మ్యూజిక్‌ ఫ్యూజన్‌గా సంగీతాభిమానులకే కాదు.. యావత్‌ స్నేహ ప్రపంచానికి మైత్రీ మధురిమలను పంచింది. 

తోడు నీడ
 ఇందిరా గాంధీ, పుపుల్‌ జయకర్‌..  ఇద్దరూ అలహాబాద్‌లోనే పుట్టి.. కలసి పెరిగారు. కష్టాల్లో, సుఖాల్లో, దుఃఖంలో, సంతోషంలో ఈ ఇద్దరూ ఒకరినొకరు వీడలేదు. ఇందిరా గాంధీ రాజకీయ జీవితం వాళ్ల స్నేహాన్ని ఏ మాత్రం చెక్కుచెదరనీయలేదు. ఇందిరాగాంధీ విజయాల్లోనే కాదు ఆపత్కాలంలోనూ ఆమె వెన్నంటే ఉంది జయకర్‌. ఆపరేషన్‌ బ్లూస్టార్‌ సమయంలోనూ ఇందిరాగాంధీనే సపోర్ట్‌ చేసింది. తన ఆత్మకథ రాయమని చాలాసార్లు జయకర్‌ను కోరిందట ఇందిరా. ఎందుకో రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిందట. చివరకు ఇందిరా గాంధీ చనిపోయాక ఆమె బయోగ్రఫీ రాసింది పుపుల్‌ జయకర్‌.

బాబాయ్‌.. అబ్బాయ్‌
స్నేహం.. కుల, మత, ప్రాంత, కలిమిలేములకు మాత్రమే కాదు .. వయసు క్కూడా అతీతమే అనిపిస్తుంది రతన్‌ టాటా, శంతను నాయుడుల ఫ్రెండ్‌షిప్‌ చూస్తే. ఈ ఇద్దరి మధ్య స్నేహాన్ని కుదిర్చిన కామన్‌ పాయింట్‌ మూగజీవాల పట్లæ ఇద్దరికీ ఉన్న ప్రేమ. స్ట్రే డాగ్స్‌ కోసం శంతను నాయుడు చేసిన వర్క్‌ గురించి తెలిశాక అతనికి ఈ మెయిల్‌ పంపాడు రతన్‌ టాటా.

బదులు ఇచ్చాడు శంతను. అలా  వాళ్ల ఫ్రెండ్‌షిప్‌ మొదలైంది. కార్నెల్‌ యూనివర్శిటీలో శంతను కాన్వొకేషన్‌కు రతన్‌ టాటా హాజరయ్యారు. చిత్రమేంటంటే రతన్‌ టాటా ఆ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి. ఈతరం ప్రతినిధి శంతను.. నాటి విలువల మనిషి రతన్‌ టాటాకు సాంఘిక మాధ్యమాలను ఎలా ఉపయోగించాలో నేర్పించాడు. అప్పటి నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడట రతన్‌ టాటా. 

బాధ్యతలను పంచుకున్నాడు
గాంధీ దక్షిణాఫ్రికా జీవితం ఆయన బయోగ్రఫీలో భాగంగానే కాదు.. చాలా కథలుగానూ  ఎంతో ప్రచారంలో ఉంది. అయినా ఆయనకు సంబంధించి బయటి ప్రపంచానికి తెలియని విషయాలున్నాయి ఇంకా. వాటిల్లో ఒకటే హెన్రీ పోలాక్, మిల్లీ దంపతులతో ఆయనకున్న స్నేహం. విప్లవభావాలున్న యూదుడు హెన్రీ. క్రైస్తవాన్ని పాటించే స్త్రీవాది మిల్లీ. ఈ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పరస్పర విరుద్ధ మతాలు వీళ్ల పెళ్లికి అడ్డం పడ్డాయి. ఇరు పెద్దలూ ఒప్పుకోలేదు. కోకపోగా మిల్లీని మరచిపోవడానికని హెన్రీని దక్షిణాఫ్రికా పంపించారు అతని పెద్దలు.

జోహాన్నెస్‌ బర్గ్‌లోని ఓ శాకాహార హోటల్‌లో హెన్రీకి గాంధీ పరిచయమయ్యాడు. అనతికాలంలోనే అది స్నేహంగా మారింది. గాంధీతో తన గోడంతా వెళ్లబుచ్చుకున్నాడు హెన్రీ. మిల్లీ తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యత తీసుకున్నాడు గాంధీ. ఒప్పించి మిల్లీని దక్షిణాఫ్రికా రప్పించాడు. హెన్రీ, మిల్లీ పెళ్లికి ప్రధాన సాక్షిగా సంతకం కూడా చేశాడు గాంధీ. దాంతో హెన్రీ దంపతులకు గాంధీ అప్తమిత్రుడుగా మారాడు. ఎంతలా అంటే  మన దేశ స్వాతంత్య్ర సమరంలో గాంధీ జైల్లో ఉన్నప్పుడు గాంధీ మొదలుపెట్టిన ఉద్యమాలను తాను ముందుండి నడిపించాడు హెన్రీ.

ఫ్రెండ్‌.. గురు, గైడ్‌ అన్నీ!   
సోషల్‌ మీడియా ఒకరకమైన గ్రూప్‌ థెరపీ సెషన్‌. ఎలాంటి భావోద్వేగాలను అయినా.. సోషల్‌ మీడియాలో పంచుకుంటే ఊరట దక్కుతోంది అంటున్నారు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే వాళ్లు. ఏదైనా విషయాన్ని షేర్‌ చేసుకున్నప్పుడు ఆ మాధ్యమంలో లేదా ఆ గ్రూపుల్లో జరిగే చర్చలు.. వచ్చే జవాబులతో ఎంతోకొంత ధైర్యం, ఉపశమనం కలుగుతుందంటారు వాళ్లు.

కరెంట్‌ టాపిక్స్‌ దగ్గర్నుంచి వ్యక్తిగత సమస్యలు, ఉద్యోగ విషయాలు, వ్యాపారలావాదేవీలు, ఆరోగ్యం ఒక్కటేంటి సమస్త అంశాల మీదా   సలహాలు, సూచనలు దగ్గర్నుంచి అనుభవాలు, అభిప్రాయాల దాకా అన్నీ అందుతున్నాయి. ఏదైనా విషయం మీద మద్దతు దొరకాలన్నా.. అవగాహన పెంచుకోవాలన్నా ఇప్పుడు సోషల్‌ మీడియానే ఫ్రెండ్, గురు, గైడ్, ఫిలాసఫర్‌ అన్నీ! ‘రోజూ కలిసే ఫ్రెండ్స్‌ కంటే.. సోషల్‌ నెట్‌వర్క్‌ స్నేహాలే మెదళ్లకు పదును పెట్టిస్తున్నాయి.

చర్చల ద్వారా ఎక్కువ మందిని స్నేహితులను తయారు చేసుకునేందుకు చాన్స్‌ ఇస్తున్నాయి’ అంటున్నారు ఆన్‌లైన్‌ ఫ్రెండ్‌ షిప్‌ను ఇష్టపడేవారు. స్నేహ బంధాన్ని బలంగా ఉంచడంలో సోషల్‌ మీడియా చేస్తున్న మరో సాయం.. పాత స్నేహాలను పైకి తేవడం. ఎప్పుడో విడిపోయిన స్నేహితులు, బంధువులు సైతం దీని ద్వారా తిరిగి దగ్గరవుతున్నారు.

సోషల్‌ మీడియాలోని అకౌంట్లలో సెర్చింగ్‌ ద్వారా, ఫోన్‌ నెంబర్లను సంపాదించడం ద్వారా తిరిగి ఆ పాత స్నేహాలను పునరుద్ధరించుకుంటు న్నారు. పలుచబడ్డ బంధాలను మళ్లీ బలోపేతం చేసుకుంటున్నారు. కామన్‌ స్నేహితులు లేదంటే గ్రూపుల ద్వారా మళ్లీ పాత స్నేహాలను.. పాత రోజుల్ని గుర్తు చేసుకునే అవకాశం కలుగు తోంది. గెట్‌ టు గెదర్, ఔటింగ్స్‌ వంటివన్నీ ఇప్పుడు వాట్సాప్‌ గ్రూపుల ద్వారానే నిర్వహించుకుంటున్నారు. 

అయినా అప్రమత్తం
సోషల్‌ మీడియాను వాడే ప్రతీ వందలో 80 మంది.. దీన్నొక ఫ్రెండ్‌షిఫ్‌ ప్లాట్‌ఫామ్‌గానే అభివర్ణిస్తున్నారు. ఆన్‌లైన్‌ స్నేహితులు.. తమ క్రియేటివిటీకి తోడుగా ఉంటున్నారని కొందరు, గ్రూపు స్నేహాలు పెంపొందడానికి వీలుగా ఉంటోందని ఇంకొందరు, కష్టకాలంలో మద్దతు దొరుకుతోందని మరికొందరు చెబుతున్నారు. నాణేనికి రెండు వైపులున్నట్లే.. ఆన్‌లైన్‌ స్నేహాలకూ రెండు కోణాలు ఉన్నాయి. వాస్తవ ప్రపంచ స్నేహంలోనే కాదు.. వర్చువల్‌ ఫ్రెండ్‌షిప్‌లోనూ గొడవలు సహజం. మోసాలకు, వెన్నుపోట్లకు ఆస్కారం ఎక్కువే.

అలాగని సోషల్‌ మీడియా చెడ్డది కాదు. ఆన్‌లైన్‌ స్నేహాలన్నీ మోసాలే కావు. అయితే అప్రమత్తం గా ఉండడం మాత్రం అవసరమే. అనుమానా స్పదంగా ఉన్న వ్యక్తులను, పూర్తి అపరిచితులను ఫ్రెండ్స్‌లిస్ట్‌లోకి చేర్చుకోకపోవడమే ఉత్తమం. అలాగే సోషల్‌ మీడియాలో వ్యక్తిగత వివరాలను ఎంత తక్కువగా షేర్‌ చేసుకుంటే అంత మంచిది. కనిపించిన వాళ్లందరినీ కలుపుకుని వెళ్లడమే సోషల్‌ నెట్‌వర్క్‌ సిస్టం. నమ్మకాన్ని, వంచనను వేరు చేసే గుణం దానికి లేదు. అసలు అది దాని ప్రోగ్రామే కాదు. కాబట్టి మనమే ఆ జాగ్రత్త తీసుకోవాలి. స్నేహానికి చేయి చాచాలి.. స్నేహితులను అండగా ఉండాలి. కానీ మోసాన్ని పసిగట్టే పరిశీలనను అలవర్చుకోవాలి. అదీ స్నేహమే నేర్పిస్తుంది. నేర్చుకోవాలి. హ్యాపీ ఫ్రెండ్‌షిప్‌ డే!! 
∙భాస్కర్‌ శ్రీపతి
 

మరిన్ని వార్తలు