క్రైమ్‌ స్టోరీ: హంతకుడెవరు.. అసలు ట్విస్ట్‌ తెలిసిన తర్వాత!

13 Jul, 2022 17:07 IST|Sakshi

బుద్ధవరపు కామేశ్వరరావు

పసలపూడిలోని ఓ పంటపొలంలోనున్న బావిలో ఓ అమ్మాయి శవం తేలిందన్న సమాచారం అందడంతో వెంటనే తన సిబ్బందితో ఆ ప్రాంతానికి బయలుదేరాడు సీఐ జయసింహ. పోలీసులను చూడగానే ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చి ‘సార్‌! నా పేరు దుర్గారావు. ఆ దుర్మార్గుడు నా బిడ్డను ఈ బావిలోకి తోసి చంపేశాడు సార్‌’ బావి వైపు చూపిస్తూ భోరుమన్నాడు.

నూతిలోంచి మృతదేహాన్ని బయటకు తీయమని తన సిబ్బందికి పురమాయించి, ‘మీ అమ్మాయి పేరు?’ దుర్గారావును అడిగాడు సీఐ.  ‘విశాల.. ఆ దరిద్రుడు గోపాల్‌ గాడు.. రెండేళ్లుగా  మా అమ్మాయి వెంటపడి, ప్రేమించమని వేధిస్తున్నాడు. ఈరోజు ఇక్కడికి రమ్మని ఉంటాడు. తను కాదనడంతో ఇదిగో ఇలా తోసేసి..’  నూతిలోంచి తీస్తున్న కూతురు మృతదేహాన్ని చూస్తూ గుండెలు బాదుకున్నాడు దుర్గారావు.

‘ఆ గోపాలే తోసేశాడని అంత కచ్చితంగా ఎలా చెప్పగలరు?’ అనుమానంగా అడిగాడు సీఐ. ‘సార్, వీడు మా తమ్ముడు గౌరీపతి. ఈ ఘోరం జరిగిన తరువాత ఆ గోపాల్‌ పారిపోవడం వీడు ప్రత్యక్షంగా చూశాడు’ అంటూ తమ్ముడి వైపు చూపిస్తూ.. కూతురి శవం దగ్గర కూలబడిపోయాడు దుర్గారావు. 

‘గౌరీపతిగారూ! ఏం జరిగిందో వివరంగా చెప్పండి’ అంటూ అతన్ని సంఘటన స్థలం నుంచి కొంచెం దూరంగా తీసుకెళ్లాడు సీఐ జయసింహ.  ‘సార్, మా అన్నయ్యకు ఈ విశాల ఒక్కతే కూతురు. ఎలా పడిందో తెలియదు కానీ మా విశాల ఆ గోపాల్‌ గాడి బుట్టలో పడింది. వాళ్లిద్దరూ కలసి తిరగడం చాలాసార్లు చూశాను. ఇద్దరినీ మందలించాను కూడా.

అయితే ఈమధ్య ఎందుకో విశాల ముభావంగా ఉంటోంది. ఈరోజు నేను నా పొలం దగ్గరకు వస్తూండగా, విశాల కూడా మా పొలం వైపు వెళ్లడం  గమనించాను. కాసేపటికి ఆ గోపాల్‌ కూడా వచ్చాడు. దూరం నుంచి నన్ను చూసిన గోపాల్‌ అక్కడ నుంచి పారిపోవడం చూశాను. ఓ పావుగంట తరువాత విశాల ఏమైంది అన్న అనుమానంతో ఇక్కడకొచ్చి, ఆమె కోసం ఈ చుట్టుపక్కల అంతా వెతికాను. కాసేపటి తరువాత ఏదో అనుమానం వచ్చి నూతి దగ్గరకు వచ్చి చూస్తే..’ ఏడుపు దిగమింగుకుంటూ చెప్పాడు గౌరీపతి.
∙∙ 
అదే రోజు రాత్రి దుర్గారావు ఇంటికి వెళ్లాడు సీఐ.. ‘దుర్గారావు గారూ! ఈ సమయంలో మిమ్మల్ని బాధ పెట్టడం భావ్యంకాదు కానీ, మా డ్యూటీ మేం చేయాలికదా? ఒకసారి మీ అమ్మాయి విశాల గది చూపిస్తారా?’ అడిగాడు ఆ పరిసరాలను ఓ కంట పరిశీలిస్తూనే.

‘అలాగే.. రండి సార్‌! ఇంతకీ ఆ గోపాల్‌ గాడు దొరికాడా సార్‌?’ కూతురు గది చూపిస్తూ, గాద్గదిక స్వరంతో అడిగాడు దుర్గారావు. ‘లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇల్లు వదలి పారిపోయాడుట. ఓ రెండు బృందాలు ఆ పని మీదే ఉన్నాయి. త్వరలో పట్టుకుంటాం’ అంటూనే ఆ గదిని క్షుణ్ణంగా పరిశీలించసాగాడు. అక్కడ దొరికిన కొన్ని వస్తువులను తీసుకుని వెళ్లిపోయాడు  సీఐ.
∙∙ 
హత్య జరిగిన మూడవ రోజు రాత్రి.. విజయనగరంలో తమ దూరపు బంధువుల ఇంట్లో రహస్యంగా తలదాచుకున్న గోపాల్‌ను అరెస్ట్‌ చేసి తీసుకొచ్చారు పోలీసులు. ‘గోపాల్‌! నువ్వు విశాలను నూతిలోకి తోసేస్తుంటే చూసినవాళ్లున్నారు. అందుచేత ఏం జరిగిందో చెప్పి తప్పు ఒప్పుకో. శిక్ష తగ్గించేలా చూస్తా’ ఇంటరాగేషన్‌లో భాగంగా ప్రశ్నించాడు సీఐ జయసింహ.

‘సార్‌! ఈ హత్యకు.. నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను నమ్మండి.  విశాల.. నేనూ ప్రేమించుకున్నాం. మా పెళ్లికి మా ఇంట్లో వాళ్లకెలాంటి అభ్యంతరం లేదు. కానీ విశాల వాళ్ల నాన్న, చిన్నాన్నలకు మాత్రం మేం కలవడం ఇష్టం లేదు.. మేం వాళ్లకన్నా తక్కువ కులం వాళ్లమని! నన్ను మరచిపొమ్మని విశాలను హింసించేవారుట సార్‌.

అంతే కాదు అవసరం అయితే నన్ను లేపేస్తామని కూడా బెదిరించారుట. తనే చెప్పింది ఈ విషయాలన్నీ’ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు  ‘మరైతే ఆ రోజు సాయంత్రం దుర్గారావు పొలం దగ్గర నువ్వెందుకు ఉన్నావ్‌?’ అనుమానంగా  సీఐ.

‘సార్, ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు నన్ను, వాళ్ల పొలం దగ్గర కలుసుకొమ్మని కబురు పంపింది విశాల. నేను అక్కడికి వెళ్లగానే నా దగ్గరకు వచ్చి .. వెంటనే నన్ను అక్కడ నుండి వెళ్లిపొమ్మంటూ ఏడ్చింది. లేకపోతే వాళ్ల బాబాయ్‌ నన్ను చంపేస్తాడని అక్కడే దూరంగా ఉన్న తన బాబాయ్‌ని చూపిస్తూ చెప్పింది సార్‌. నాకేం అర్థంకాక అయోమయంగా అక్కడ నుండి వెళ్లిపోయాను’ చెప్పాడు గోపాల్‌.

‘మరి ఊర్లోంచి ఎందుకు పారిపోయావ్‌?’ కొంచెం వెటకారంగా అడిగాడు సీఐ. ‘నేను ఇంటికి చేరిన కాసేపటికే విశాల చనిపోయినట్టు తెలిసింది. అది హత్యనీ.. ఆ హత్య నేనే చేశానని ఊర్లో పుకారు పుట్టడంతో వణికిపోయాను. విశాల ఇంట్లో వాళ్లు నన్ను చంపేస్తారనీ.. అలాగని నన్ను ఒంటరిగా పంపిస్తే నేను ఏ అఘాయిత్యానికి ఒడిగడతానోనని భయపడి మావాళ్లు నాకు ఓ మనిషిని తోడిచ్చి అప్పటికప్పుడు విజయనగరం పంపేశారు సార్‌’ బెదురుతూ చెప్పాడు గోపాల్‌.

గోపాల్‌ కళ్లల్లోకే సూటిగా చూస్తూ ‘గౌరీపతిని పిలిపించండి’ అంటూ కానిస్టేబుల్స్‌కు ఆర్డర్‌ వేశాడు సీఐ. 
∙∙ 
‘మిస్టర్‌ గౌరీపతీ! విశాలను నూతిలోకి తోసి చంపింది నువ్వేనని బలమైన ఆధారాలు ఉన్నాయి’ అంటూ ఓ బాణం వేశాడు సీఐ జయసింహ. ‘ఏంటి సార్‌ మీరు మాట్లాడేది? మా పిల్లను నేను ఎందుకు చంపుతాను?’ ఆశ్చర్యపోయాడు గౌరీపతి.

‘ఎందుకంటే, ఆ గోపాల్‌ను విశాల పెళ్లి చేసుకుంటే మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు రావనీ.. ఆమె చనిపోతే మీ అన్నగారి ఆస్తికి నువ్వే వారసుడివి కావచ్చనీ’ అన్నాడు సీఐ క్రీగంట గౌరీపతి హావభావాలను కనిపెడుతూ. 

‘సార్‌! మీరేమైనా అనుకోండి..  నేను చెప్పింది మాత్రం నిజం. ఆ రోజు వాళ్లిద్దరినీ చూశాను. గోపాల్‌ పారిపోయాడు. విశాల నూతిలో పడుంది’ జరిగిన విషయం మరోసారి చెప్పాడు గౌరీపతి.

‘పోనీ మీ అన్నగారు ఎవరైనా కిరాయి మనుషులతో..’ అడగబోతున్న సీఐతో ‘సార్, అవసరం అయితే ఆ గోపాల్‌ గాడిని లేపేస్తాం కానీ, సొంత బిడ్డను చంపుకుంటామా సార్‌? ఇదంతా ఆ గోపాల్‌ గాడు చేసిందే సార్‌’  కరాఖండీగా చెప్పాడు గౌరీపతి. 

‘సరే.. నిజానిజాలను త్వరలోనే నిగ్గు తేలుస్తాం కానీ మీరు మాత్రం మాకు చెప్పకుండా ఈ పొలిమేర దాటకూడదు’ అంటూ స్టేషన్‌ బయటకు నడిచాడు సీఐ. 
∙∙ 
తన గుమ్మంలో సీఐని చూసిన దుర్గారావు.. ‘సార్, నా కూతుర్ని చంపిన ఆ గోపాల్‌ గాడిని వదలకండి సార్‌’ అంటూ బిగ్గరగా ఏడవడం మొదలెట్టాడు. ‘నీ దొంగ ఏడుపు ఆపు మిస్టర్‌ దుర్గారావ్‌. మీ విశాల.. గోపాల్‌ను  ప్రేమించడం ఇష్టం లేని నువ్వు, ఆ అమ్మాయిని  కిరాయి గూండాల చేత నూతిలోకి తోసేయించావని మీ తమ్ముడు వాంగ్మూలం ఇచ్చాడు.

అందుకే, హత్యా నేరం కింద నిన్ను అదుపులోకి తీసుకుంటున్నాం’  చెప్పాడు సీఐ. ‘సార్‌! మా అమ్మాయిని నేను చంపుకోవడమేంటి సార్‌! ఆ గోపాల్‌ గాడే..’ చెప్పబోతున్న దుర్గారావుతో.. ‘స్టాపిట్, ఈ విషయాలన్నిటినీ విశాల ఓ లెటర్‌లో రాసింది. అది దొరికితే ప్రమాదమని ఆ ఉత్తరాన్ని దాచేశావ్‌’ అంటూ కానిస్టేబుళ్ల సహాయంతో దుర్గారావును స్టేషన్‌కు తీసుకెళ్లాడు సీఐ జయసింహ. 
∙∙ 
‘గుడ్‌ మిస్టర్‌ జయసింహ! ఆ విశాల మర్డర్‌ కేసు సాల్వ్‌ చేశావుట. ఇంతకీ హంతకుడు ఎవరు? గోపాలా లేక గౌరీపతా?’ అడిగారు స్టేషన్‌కు వచ్చిన డీఎస్పీ రంగనాథ్‌.  ‘వాళ్లెవరూ కాదు సార్‌. అసలు ఇది హత్య కాదు, ఆత్మహత్య’ కూల్‌గా చెప్పాడు సీఐ.

‘వ్వాట్‌.. ఎలా కనిపెట్టావ్‌?’ అనుమానంగా అడిగారు డీఎస్పీ. ‘సార్‌! ఆ రోజు సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌ చూడగానే నాకు అనుమానం వచ్చింది ఇది హత్య కాకపోయుండొచ్చని. ఎందుకంటే నూతి దగ్గరున్న మట్టినేల మీద పెనుగులాట జరిగినట్లు ఆనవాళ్లు కానీ.. వేరే పాదముద్రలు కానీ లేవు. ఆమె ధరించిన జోళ్లు ఆ పాక దగ్గర నీట్‌గా పెట్టున్నాయి.

అంతేకాదు నూతి గట్టు మీద విశాల పాదముద్రలున్నాయి. హత్య చేసినవాడు ఆమెను నూతిలోకి తోసేస్తాడు కానీ ఆమెను గట్టు మీద నిలబెట్టి తర్వాత నూతిలోకి తొయ్యడు కదా? విశాలే నూతి గట్టు మీద నిలబడి లోపలికి దూకి ఆత్మహత్య చేసుకుందని నా పరిశీలనలో తేలింది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవడం కోసమే ఈ ఇంటరాగేషన్‌ చేయవలసి వచ్చింది సార్‌’ అంటూ మొత్తం విచారణా వివరాలు డీఎస్పీకి వివరించసాగాడు సీఐ జయసింహ.

‘సార్, గోపాల్‌తో ప్రేమ వ్యవహారాలు మానేయమని, తమ కుటుంబం పరువు కాపాడమని లేకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని కూతురిని చాలాసార్లు బెదిరించాడు దుర్గారావు. కానీ విశాల.. గోపాల్‌కు దూరం కాలేకపోయింది. ఆమె చనిపోయే రోజు ఉదయం.. తన తండ్రి, బాబాయ్‌లు.. గోపాల్‌ను హత్యచేసే విషయం గురించి మాట్లాడుకున్న మాటలను ఆమె రహస్యంగా విన్నది. వెంటనే ఓ స్థిర నిర్ణయానికి వచ్చి ఇదిగో ఈ లెటర్‌ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుంది’ అంటూ టేబుల్‌ మీదున్న ఫైల్లోంచి ఓ లెటర్‌ తీసి డీఎస్పీకిచ్చాడు సీఐ జయసింహ.   

తను గోపాల్‌ లేకుండా బతకలేనని, అలాగని గోపాల్‌తో తను వెళ్లిపోతే తన తండ్రి, బాబాయ్‌లు పొందే అవమానాన్నీ తాను భరించలేనని, తన తండ్రి, బాబాయ్‌లు కలసి గోపాల్‌ను చంపాలని వేసుకున్న ప్లాన్‌ను తాను రహస్యంగా విన్నానని, గోపాల్‌ చాలా మంచివాడని, అతన్ని ఏం చేయొద్దని వేడుకుంటూ, ఈ సమస్యకు పరిష్కారం తన చావొక్కటేనని.. అందుకే నూతిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నాని.. విశాల రాసిన ఆ సూసైడ్‌ నోట్‌ సారాంశం.  

‘ఆ ఉత్తరం దుర్గారావు కంటబడేటప్పటికే విశాల నూతిలో శవమై పడి ఉందని, గోపాల్‌ పారిపోయాడనీ తన తమ్ముడు పంపిన సమాచారం అందింది. ఉక్రోషంతో ఊగిపోయాడు దుర్గారావు. అతనిలోని రాక్షసుడు మేల్కొన్నాడు. తన కూతురు చావుకు కారణమైన ఆ గోపాల్‌ మీద కక్ష తీర్చుకోవడానికి అదే మంచి సమయమని భావించాడు.

ఈ ఆత్మహత్యని గోపాల్‌ చేసిన హత్యగా చిత్రీకరించి అతడిని కటకటాల పాలు చెయ్యాలనుకున్నాడు. ఆలెటర్‌ ఎవరికీ కనబడకుండా దాచేశాడు. యామై కరెక్ట్‌ మిస్టర్‌ జయసింహ?’ అడిగారు డీఎస్పీ రంగనాథ్‌. ‘కరెక్ట్‌ సార్‌. ఇదే విషయం దుర్గారావు కూడా చెప్పాడు నా విచారణలో’ డీఎస్పీ కన్‌క్లూజన్‌కు ఆశ్చర్యపోతూ అన్నాడు సీఐ.

‘ఓకే బాగానే ఉంది కానీ అసలు విశాల ఆ లెటర్‌ రాసుంటుందని నీకు ఎలా తెలిసింది?’ అడిగాడు డీఎస్పీ కుతూహలంగా.  ‘సార్, విశాలది ఆత్మహత్య అయి ఉండొచ్చన్న అనుమానం వచ్చిన వెంటనే.. అదే రోజు రాత్రి వాళ్లింటికి వెళ్లి విశాల గదిని పరిశీలించాను. టేబుల్‌ మీద పెట్టున్న స్క్రిబ్లింగ్‌ పాడ్, బాల్‌ పెన్నుల మీద నా కన్ను పడింది.

అసలు అవి అక్కడ ఎందుకున్నాయన్న అనుమానం వచ్చి, ఆ పాడ్‌లోని మొదటి పేజీ చూడగానే, దాని ముందు పేజీ మీద బాల్‌పెన్‌తో గట్టిగా రాసిన అక్షరాల తాలూకు ఇంప్రెషన్స్‌ కనపడ్డాయి. నా అనుమానం నిజమయింది. అయితే ఆ లెటర్‌లో ఏముంది? ఆ లెటర్‌ ఎక్కడుంది? అసలు ఇది ఆత్మహత్య అని నిరూపించడం ఎలాగో రాబట్టడం కోసమే ఇంత టైమ్‌ పట్టింది సార్‌’ తన పరిశోధన వివరాలు చెప్పాడు సీఐ జయసింహ.

‘అయితే ఆ లెటర్‌ దుర్గారావు దగ్గరుందని  నీకు తెలియదు, అలాగే గౌరీపతి అన్నీ చెప్పేశాడని అతడిని జస్ట్‌ భయపెట్టావ్‌ అంతేనా?’ అడిగారు డీఎస్పీ. ‘ఔను సార్‌’ నవ్వుతూ చెప్పాడు సీఐ జయసింహ.

చదవండి: కథ: అద్దం.. అప్పుడు అసహ్యంగా కనిపించింది.. ఇప్పుడేమో! 

కథలో అయినా.. నిజ జీవితమైనా ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు.. తీవ్రమైన నిర్ణయం తీసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు