Funday Cover Story: అత్యధిక దూరం వలసపోయే పక్షి ఏదో తెలుసా?

27 Nov, 2022 10:23 IST|Sakshi

నీలాకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పిట్టలకు ఎల్లలుండవు. ఆకాశమే వాటి హద్దు. రెక్కల సత్తువకొద్ది ఎక్కడికంటే అక్కడకు హాయిగా ఎగిరిపోవడమే వాటికి తెలుసు. దారుల్లో తారసిల్లే తరులు గిరులు సాగరులను దాటి కోరుకున్న చోటుకు అవి రివ్వున చేరుకోగలవు. అప్పటి వరకు ఉంటున్న వాతావరణంలో కాస్త మార్పు కనిపించగానే, అనుకూల వాతావరణం ఉండే చోటును వెదుక్కుంటూ ఎంతదూరమైనా ఎగురుతూ పోవడమే వాటికి తెలుసు.

వేల మైళ్లు ఎగురుతూ ప్రయాణిస్తూ, అనువైన చోటు దొరకగానే అక్కడ వెంటనే వాలిపోయి, కిలకిల రావాలతో సందడి చేస్తాయి. అక్కడ ఉండే జనాలకు కనువిందు చేస్తాయి. వలస వాటి జీవనశైలి. శీతాకాలం మొదలయ్యే తరుణంలో ఏటా ఠంచనుగా గుంపులు గుంపులుగా ఇక్కడకు వలస వస్తాయి. వేసవి మొదలవుతూనే తిరిగి తమ తమ నెలవులకు ఎగిరిపోతాయి. మన దేశానికి ఏటా వచ్చే వలస పక్షుల గురించి ఒక విహంగ వీక్షణం...

మన దేశంలో వలస పక్షుల సీజన్‌ ఏటా సెప్టెంబర్‌ నెలాఖరు లేదా అక్టోబర్‌ మొదటి వారం నాటికి మొదలవుతుంది. సైబీరియా, రష్యా, టర్కీ, తూర్పు యూరోప్‌ వంటి అత్యంత సుదూర ప్రాంతాలు సహా ఇరవై తొమ్మిది దేశాల నుంచి ఈ పక్షులు వేలాది కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి, ఇక్కడకు అతిథుల్లా వచ్చి వాలతాయి. వీటి రాకపోకల్లో ఏనాడూ క్రమం తప్పదు. మన దేశానికి 1,349 జాతులకు చెందిన లక్షలాది పక్షులు వస్తాయి. వీటిలో 212 పక్షిజాతులు ప్రమాదం అంచున ఉన్నట్లు పర్యావరణవేత్తలు ఇప్పటికే గుర్తించారు.

వీటిని కాపాడుకోకుంటే, ఇవి త్వరలోనే అంతరించిపోయే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ఏటా మన దేశానికి వచ్చే పక్షులు ఇక్కడి సరోవర తీరాలను, తడి నేలలు గల ప్రదేశాలను తమ ఆవాసాలుగా ఎంచుకున్నాయి. ఇవి స్వయంగా ఎంపిక చేసుకున్న ప్రదేశాల్లో తప్ప మరెక్కడా వీటి సందడి కనిపించదు. అందుకే వలస పక్షులు చేరే ప్రదేశాల్లో ఏటా సీజన్‌లో పర్యాటకుల సందడి కూడా కనిపిస్తుంది. వలస పక్షుల ఆవాసాలలో వాటి రక్షణ కోసం ప్రభుత్వం అభయారణ్యాలను ఏర్పాటు చేసింది. 

వలసపక్షుల విడిది కేంద్రాలు
మన దేశంలో ఏటా వలసపక్షులు విడిది చేసే ప్రదేశాలు చిన్నా చితకా కలుపుకొని దాదాపు ఇరవైకి పైగానే ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద పక్షుల అభయారణ్యం గుజరాత్‌లో ఉంది. అది నల సరోవర్‌ అభయారణ్యం. అహ్మదాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని నల సరోవర తీరంతో పాటు, చుట్టుపక్కల 120 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన తడినేలల్లోని చెట్టూ చేమలన్నీ ఈ సీజన్‌లో వలసపక్షుల రాకతో సందడిని సంతరించుకుంటాయి. గుజరాత్‌లోనే కచ్‌ ప్రాంతంలో ఉన్న గ్రేట్‌ ఇండియన్‌ బర్డ్‌ సాంక్చుయరీకి కూడా పెద్దసంఖ్యలో వలసపక్షులు వస్తుంటాయి. మన దేశంలో వలసపక్షులు చాలా విరివిగా కనిపించే ప్రదేశాల్లో ఒడిశాలోని చిలికా సరస్సు ముఖ్యమైనది.

ఆసియాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన చిలికా సరస్సు 1100 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. ఈ సరస్సు, దీనిలోని రెండు దీవులు, సరస్సు పరిసరాల్లోని తడినేలల్లో ఉండే చెట్టు చేమలన్నీ ఈ సీజన్‌లో వలస పక్షులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. గత ఏడాది దాదాపు పన్నెండు లక్షలకుపైగా వలస పక్షులు చిలికా తీరానికి చేరుకున్నాయి. ఒడిశాలోని కేంద్రపడా జిల్లా భితరకనికా జాతీయ అభయారణ్యానికి కూడా వలస పక్షులు పెద్దసంఖ్యలోనే వస్తుంటాయి. ఇక దేశంలోని రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన పులికాట్‌ కూడా వలస పక్షులకు విడిది కేంద్రంగా ఉంటోంది. ఆంధ్రప్రదేశ్‌–తమిళనాడులలో విస్తరించిన ఈ సరస్సు విస్తీర్ణం 250–450 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

పులికాట్‌ సరస్సు, పరిసర ప్రాంతాలతో కలుపుకొని పులికాట్‌ సరస్సు పక్షుల అభయారణ్యం 759 చదరపు కిలోమీటర్లలో విస్తరించి, సీజన్‌లో వలస పక్షులతో కళకళలాడుతూ కనువిందు చేస్తుంది. దేశంలో వలస పక్షులు పెద్దసంఖ్యలో చేరుకునే ముఖ్యమైన విడిది కేంద్రాల్లో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ పక్షుల అభయారణ్యం ఒకటి. ఇక్కడ సీజన్‌లో వలసపక్షులతో పాటు ఏడాది పొడవునా స్థానికంగా ఈ అభయారణ్యంలో సంచరించే కుందేళ్లు, జింకలు, కృష్ణజింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, పులులు, చిరుతపులులు, మనుబోతులు వంటి వన్యజంతువులు కూడా కనిపిస్తాయి.

హర్యానాలోని సుల్తాన్‌పూర్‌ పక్షుల అభయారణ్యం, గోవాలోని సలీం అలీ పక్షుల అభయారణ్యం, కేరళలోని కుమారకోం పక్షుల అభయారణ్యం, తమిళనాడులోని వేదాంతంగళ్‌ పక్షుల అభయారణ్యం, ఆంధ్రప్రదేశ్‌లోని హార్స్‌లీ హిల్స్‌ సమీపంలోని కౌండిన్య పక్షుల అభయారణ్యం, కొల్లేరు సరస్సు వద్ద ఉప్పలపాడు పక్షుల అభయారణ్యం..

మహారాష్ట్రలోని వడుజ్‌ పట్టణం వద్ద మాయానీ పక్షుల అభయారణ్యం, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ ప్రాంతంలోని చంద్రశేఖర్‌ ఆజాద్‌ పక్షుల అభయారణ్యం, రాయ్‌బరేలీ సమీపంలో సమస్‌పూర్‌ పక్షుల అభయారణ్యం, కేరళలోని తట్టెకడ్‌ పక్షుల అభయారణ్యం, కర్ణాటకలోని  మాండ్య జిల్లాలో రంగతిట్టు అభయారణ్యం, పశ్చిమబెంగాల్‌లో కోల్‌కతా శివార్లలోని చింతామణి కర్‌ పక్షుల అభయారణ్యం తదితర ప్రాంతాల్లో ఏటా అక్టోబర్‌–మార్చి మధ్య కాలంలో వలస పక్షుల సందడి కనిపిస్తుంది. రంగు రంగుల్లో కనిపించే అరుదైన పక్షులను తిలకించడానికి దేశాల విదేశాలకు చెందిన పర్యాటకులు పెద్దసంఖ్యలో ఈ అభయారణ్యాలకు వస్తుంటారు. ఇవే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా తేలుకుంచి, తేలినీలాపురం గ్రామాల పరిసర ప్రాంతాలకు కూడా వందలాదిగా వలసపక్షులు వస్తుంటాయి. 

రకరకాల పక్షులు... రంగురంగుల పక్షులు...
సుదూర తీరాల నుంచి ఎగురుతూ మన దేశంలో విడిది చేయడానికి వచ్చే రకరకాల పక్షులు, రంగు రంగుల్లో కనిపిస్తూ కనువిందు చేస్తాయి. వీటిలో కొన్ని పరిమాణంలో చాలా పెద్దగా ఉంటాయి. మరికొన్ని గుప్పిట్లో పట్టేంత చిన్నగా కూడా ఉంటాయి. వేలాది మైళ్లు దాటి అవి ఇక్కడకు చేరుకోవడమే ఒక ప్రకృతి విచిత్రం.

వాటి స్వస్థలాల్లో శీతాకాలంలో మంచుగడ్డ కట్టే పరిస్థితులు ఉండటం వల్ల అక్కడ అవి ఆ కాలంలో మనుగడ సాగించలేవు. అందుకే సమశీతల వాతావరణాన్ని వెదుక్కుంటూ అవి ఇక్కడకు చేరుకుంటాయి. మన దేశంలో వేసవి తీవ్రత ఎక్కువ కావడంతో వేసవి మొదలవుతూనే, ఇవి స్వస్థలాలకు తిరుగుముఖం పడతాయి. ఇక్కడ ఉన్నంతకాలం అనువైన చోట్ల గూళ్లు కట్టుకుంటాయి. గుడ్లు పెడతాయి. వాటిని పొదిగి పిల్లలను చేస్తాయి. పిల్లలకు రెక్కలొచ్చే నాటికి వాటి తిరుగుప్రయాణ కాలం మొదలవుతుంది.

వలస పక్షుల రాకపోకలు సజావుగా సాగుతున్నాయంటే, ప్రకృతి సమతుల్యత బాగున్నట్లే! వీటిలో కొన్ని జాతుల పక్షుల మనుగడ ప్రమాదం అంచుకు చేరుకుంటూ ఉండటమే కొంత ఆందోళన కలిగించే అంశం. ‘ఎక్కువగా సరోవర తీరాలకు చేరుకునే వలస పక్షులకు, సరోవరాల పరిసరాల్లోని చిత్తడి నేలలే ప్రధాన ఆవాసాలు. చిత్తడి నేలల్లో ఎలాంటి మార్పులు వచ్చినా, ఇక్కడకు వచ్చే వలస పక్షులకు ఇబ్బందే!

రకరకాల జాతులకు చెందిన కొంగలు, రకరకాల జాతులకు చెందిన బాతులు, రంగురంగుల రామచిలుకలు, గిజిగాళ్లు, మైనాలు, విదేశీ పావురాలు, రకరకాల గద్దలు, డేగలు, రాబందులు, ఎన్నో చిత్ర విచిత్రమైన చిన్నిచిన్ని పిట్టలు ఇక్కడకు సీజన్‌లో వలస వస్తుంటాయి. వాటిలో గేటర్‌ ఫ్లమింగో, లెస్సర్‌ ఫ్లమింగో, గ్రేట్‌ వైట్‌ పెలికాన్, కాస్పియన్‌ టెర్న్, యురేషియన్‌ బిట్టెర్న్, యురేషియన్‌ స్పూన్‌బిల్, బ్లాక్‌ క్రెస్టెడ్‌ బుల్‌బుల్, బ్లాక్‌ నేపెడ్‌ మోనార్క్, ఈజిప్షియన్‌ వల్చర్, ఎమరాల్డ్‌ డవ్, లాఫింగ్‌ డవ్, రాక్‌ డవ్, టఫ్టెడ్‌ డక్, ఇండియన్‌ స్పాట్‌ బిల్‌డ్‌ డక్..

లిటిల్‌ స్విఫ్ట్, వాటర్‌కాక్, ఆసియన్‌ ఓపెన్‌బిల్, గ్రేట్‌ ఎగ్రెట్, ఇంటర్మీడియట్‌ ఎగ్రెట్, కెంటిష్‌ ప్లవర్, గ్రేటర్‌ సాండ్‌ప్లవర్, రివర్‌ లాప్‌వింగ్,  బ్రాడ్‌బిల్‌డ్‌ సాండ్‌పైపర్, గ్రేటర్‌ క్రెస్టెడ్‌ టెర్న్, లెస్సర్‌ క్రెస్టెడ్‌ టెర్న్, బ్లాక్‌వింగ్డ్‌ కైట్, బూటెడ్‌ ఈగిల్, అలెగ్జాండ్రిన్‌ పారాకీట్, రెడ్‌ రింగ్డ్‌ పారాకీట్, స్కార్లెట్‌ మినివెట్, మలార్డ్, గ్రీన్‌ బీ ఈటర్, హిమాలయన్‌ స్విఫ్ట్‌లెట్, పెయింటెడ్‌ స్టాక్, ప్లమ్‌హెడెడ్‌ పారాకీట్, పర్పుల్‌ హెరాన్, పర్పుల్‌స్వాంప్‌హెన్, రెడ్‌ క్రెస్టెడ్‌ పోచడ్‌ వంటి అరుదైన పక్షులు కూడా మన దేశంలోని వలసపక్షుల విడిది కేంద్రాల్లో ఈ సీజన్‌లో కనిపిస్తాయి.

వీటిని ఫొటోలు తీసేందుకు, వీడియోలు తీసేందుకు దేశ విదేశాలకు చెందిన వన్యప్రాణి ఫొటోగ్రాఫర్లు, అరుదైన పక్షుల తీరుతెన్నులను, వాటి అలవాట్లను నిశితంగా అధ్యయనం చేసే విహంగ శాస్త్రవేత్తలు (ఆర్నిథాలజిస్టులు)  కూడా ఈ ప్రాంతాలకు వస్తుంటారు.

అడుగడుగునా ప్రమాదాలే...
వలస పక్షులకు అడుగడుగునా ప్రమాదాలు ఎదురవుతుంటాయి. గుంపులు గుంపులుగా అవి వలస ప్రయాణంలో ఉన్నప్పుడు మార్గమధ్యంలో తలెత్తే తుపానుల వంటి ప్రకృతి వైపరీత్యాలు, వేటగాళ్ల ఉచ్చులు, విద్యుదుత్పాదన కోసం ఎత్తయిన ప్రదేశాల్లో అమర్చే గాలిమరలు, సముద్ర తీరాల్లోని ఆయిల్‌ రిగ్స్, అలవాటైన ఆవాసాలలో తడినేలల తరుగుదల వంటివి వలసపక్షులకు ప్రమాదకరంగా మారుతున్నాయి.

వేటగాళ్లు వలలు, ఉచ్చులు మాత్రమే కాకుండా, వలసపక్షులు వాలే చెట్ట కొమ్మల మీద జిగురుపూసి, వాటిని కదలకుండా చేసి బంధించే పద్ధతులు కూడా అవలంబిస్తున్నారు. కొన్ని సంపన్న దేశాల్లో అడవిపక్షుల మాంసానికి గిరాకీ ఉండటంతో ఇక్కడ పట్టుకున్న పక్షులను విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. వాతావరణ మార్పులు ఒకవైపు, వేటగాళ్ల దారుణాలు మరోవైపు వలసపక్షుల మనుగడకు పెనుముప్పు కలిగిస్తున్నాయి. వలసపక్షుల ఆవాసాలలోని పొలాలు, తోటల్లో వాడే పురుగుమందులు, రసాయనాలు కూడా వాటి ప్రాణాలను హరిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా డీడీటీ వినియోగం విపరీతంగా ఉండేది. డీడీటీ దెబ్బకు కోట్లాదిగా పక్షులు మరణించాయి.

మన దేశంలో 1972లో డీడీటీ వినియోగాన్ని నిషేధించారు. డీడీటీని నిషేధించినా, మరికొన్ని రకాల పురుగుమందుల వినియోగం నేటికీ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే, నొప్పినివారణకు వాడే ‘డైక్లోఫెనాక్‌’ కూడా పక్షులకు ముప్పుగా మారుతోంది. మనుషులతో పాటు పశువైద్యంలోనూ ‘డైక్లోఫెనాక్‌’ ఇప్పటికీ వాడుతున్నారు. డైక్లోఫెనాక్‌ ఔషధానికి అలవాటుపడిన జంతువు మరణించాక, వాటి కళేబరాలను తినే రకరకాల రాబందులు, డేగలు, గద్దలు పెద్దసంఖ్యలో మరణిస్తున్నాయి. డైక్లోఫెనాక్‌ ఎక్కువగా వాడటం వల్ల జంతువులు కిడ్నీలు విఫలమై మరణిస్తున్నాయని, వాటి కళేబరాలు తినడం వల్ల రాబందులు, డేగలు వంటి పెద్ద పక్షులు మరణిస్తున్నాయని ముఖ్యంగా యూరోప్‌ నుంచి ఆగ్నేయాసియా ప్రాంతానికి వలసపోయే పెద్దపక్షులు దీనివల్ల ఎక్కువగా  మరణిస్తున్నాయని యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ (ఈఎంఏ) దాదాపు దశాబ్దం కిందటే వెల్లడించింది.

పట్టణీకరణ పెరగడంతో రాత్రిపగలు తేడా లేకుండా వీథుల్లో వెలిగే విద్యుద్దీపాల వెలుగులు కూడా వలసపక్షులకు ముప్పుగా మారుతున్నాయి. దీపాల కాంతి వల్ల ఈ పక్షులు గందరగోళంలో పడి, తమ ఆవాసాలవైపు వెళ్లలేక, దారీతెన్నూ లేక ఎగురుతూ అలసి సొలసి నేలకు రాలిపోతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. ఆకాశహర్మ్యాలలో అద్దాల గోడల వెనుక వెలిగే దీపాల ఆకర్షణలో చిక్కుకుని, అద్దాల గోడలను ఢీకొని నేలరాలిపోతున్న ఉదంతాలూ ఉంటున్నాయి.

వాతావరణ మార్పులతోనూ సవాళ్లు
ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న వాతావరణ మార్పులతోనూ వలసపక్షుల మనుగడకు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. భూతాపం పెరుగుదల వల్ల రుతువుల రాకపోకల్లో తలెత్తే మార్పులను అంచనా వేయలేక వలసపక్షులు మనుగడను సాగించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అంతర్జాతీయ విహంగ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పారిశ్రామిక విప్లవం మొదలైన నాటి నుంచి నేటి వరకు చూసుకుంటే ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతల్లో 1 డిగ్రీ సెల్సియస్‌ పెరుగుదల నమోదవుతోంది.

ఇప్పటికైనా భూతాపాన్ని అదుపుచేసే చర్యలు చేపట్టకుంటే, రానున్న దశాబ్దకాలంలోనే సగటు ఉష్ణోగ్రతల్లో మరో 2 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుదల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ సహా వివిధ అంతర్జాతీయ సంస్థలకు చెందిన పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల వలసపక్షుల ఆహార విహారాల్లోను, పునరుత్పత్తి క్రమంలోనూ మార్పులు వస్తున్నాయని, మార్పులను తట్టుకోలేని కొన్ని పక్షిజాతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని వారు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికీకరణ, పట్టణీకరణతో పాటు అడవుల నరికివేత కూడా వాతావరణ మార్పులకు దారితీస్తోంది. 

అడవుల నరికివేత వల్ల వలసపక్షులకు మరో సమస్య కూడా ఎదురవుతోంది. అవి గూళ్లు పెట్టుకోవడానికి అనువైన చెట్లు, చిత్తడి నేలల విస్తీర్ణం తగ్గిపోయి వాటికి అనువైన ఆవాసాలు తగినంతగా దొరకని పరిస్థితి నెలకొంటోంది. ఇలాంటి పరిస్థితుల కారణంగా మనదేశానికి వలస వచ్చే పక్షుల సంఖ్య ఏడాదికేడాది క్రమంగా తగ్గిపోతోందని పర్యావరణవేత్త విజయ్‌కుమార్‌ బాఘేల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

సెంట్రల్‌ ఆసియన్‌ ఫ్లైవే (సీఏఎఫ్‌) మీదుగా మన దేశానికి వచ్చే 279 పక్షిజాతుల్లో 29 పక్షిజాతులు పూర్తిగా ప్రమాదం అంచుల్లో ఉన్నాయని, ఇప్పటికైనా వాటిని కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మన దేశానికి వలస వచ్చే మొత్తం 1349 పక్షిజాతుల్లో 146 పక్షిజాతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని, గడచిన ఐదేళ్ల వ్యవధిలోనే ఈ జాతులకు చెందిన పక్షుల సంఖ్య 80 శాతం మేరకు తగ్గిపోయిందని, అలాగే మరో 319 జాతులకు చెందిన పక్షుల సంఖ్య 50 మేరకు తగ్గిపోయిందని ‘ది స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ బర్డ్స్‌’ నివేదిక ఈ ఏడాది ప్రారంభంలోనే వెల్లడించింది. 

పక్షుల రాకపోకలను, వాటి కదలికలను, తీరుతెన్నులను ఎప్పటికప్పుడు గమనించే విహంగ శాస్త్రవేత్తల పరిశీలనల్లో తేలిన అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ముఖ్యంగా సరస్సులు, ఇతర జలాశయాల వద్ద ఉండే చిత్తడినేలలకు వచ్చే పక్షిజాతుల్లో ఈ తగ్గుదల ఎక్కువగా నమోదవుతున్నట్లు ‘ది స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ బర్డ్స్‌’ నివేదిక వెల్లడించింది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలంటే, వలస పక్షులను కాపాడుకోవలసిన అవసరం ఉందని, వీటి పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలు తగిన చర్యలు తీసుకోవాలని ‘ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌’ సహా పలు అంతర్జాతీయ సంస్థలు పిలుపునిస్తున్నాయి.

సవాళ్లతో కూడుకున్న పని
ప్రభుత్వాలు ఎన్ని అభయారణ్యాలను ఏర్పాటు చేసినా, పక్షుల రక్షణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, వేటగాళ్లు అతిథుల్లా వచ్చే వలసపక్షులనూ విడిచిపెట్టడం లేదు. వేటగాళ్ల ధాటికి ఇప్పటికే సైబీరియన్‌ క్రేన్‌ జాతి పూర్తిగా కనుమరుగైంది. వలస పక్షులు విడిది చేసే ప్రాంతాల్లో సమీప జనావాసాలకు చెందిన ప్రజలు కూడా వీటి రక్షణలో పాలు పంచుకుంటేనే వీటి భద్రతకు భరోసా ఉంటుంది. ఏయే జాతుల పక్షులు కచ్చితంగా ఎక్కడెక్కడ విడిది చేస్తున్నాయో గుర్తించడం, అక్కడి పరిసరాల పరిస్థితులు విహంగాలకు సానుకూలంగా ఉండేలా కాపాడుకోవడం సవాళ్లతో కూడుకున్న పని. పక్షుల పరిరక్షణకు ప్రభుత్వాల చర్యలతో పాటు సమీప జనావాసాల్లోని ప్రజలు అవగాహన కలిగి ఉండటం కూడా ముఖ్యం.
– అర్పిత్‌ దేవ్‌మురారి, వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్, వైల్డ్‌లైఫ్‌ కన్జర్వేషన్‌ టెక్నాలజీ లీడ్, డబ్ల్యూడబ్యూఎఫ్‌– ఇండియా

పక్షులలో వలస పక్షులే వేరు...
భూమ్మీద దాదాపు పదకొండువేలకు పైగా పక్షి జాతులు ఉన్నాయి. వాటిలో దాదాపు నాలుగువేల పక్షిజాతులు రుతువుల్లో మార్పులు వచ్చినప్పుడు తమకు అనువైన ప్రదేశాలను వెదుక్కుంటూ వలసలు వెళుతుంటాయి. వీటిలో సుమారు 1800 జాతుల పక్షులు తమ తమ నెలవుల నుంచి అత్యంత సుదూర ప్రాంతాలకు సైతం వలస వెళుతుంటాయి. వీటిలో రోజుకు ఏకబిగిన వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తూ, దాదాపు 20వేల కిలోమీటర్లకు పైగా దూరాలను అధిగమించేవి కూడా ఉంటాయి. వలస పక్షుల జాతుల్లో దాదాపు 683 జాతులకు చెందిన పక్షులు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయని ‘ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌’ ఇటీవల వెల్లడించింది.

పక్షుల వలస విశేషాలు
వలస పక్షులకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. అత్యధిక దూరాన్ని ఏకధాటిగా అతి తక్కువకాలంలో అధిగమించేవి కొన్ని, వేలాది కిలోమీటర్లు ప్రయాణించే గుప్పెడంత పిట్టలు కొన్ని... ఈ పక్షుల వలస విశేషాల్లో అరుదైనవి కొన్ని...
►అత్యధిక దూరం వలసపోయే పక్షి ఆర్కిటిక్‌ టెర్న్‌. ఇది ఏకంగా 12,200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఎనిమిదిన్నర రోజుల్లోనే అధిగమించి, అలాస్కా నుంచి న్యూజిలాండ్‌కు చేరుకుంటుంది.
►సరస్సులు, ఇతర జలాశయాలు ఉండే చోటుకు వలసవచ్చే పక్షుల్లో మొదటగా బాతుజాతులకు చెందిన పక్షులు చేరుకుంటాయి. మిగిలిన వలసపక్షుల కంటే ఇవి దాదాపు నెల్లాళ్ల ముందే–అంటే సెప్టెంబర్‌లోనే మన దేశానికి చేరుకుంటాయి.
►చాలా ఎత్తున ఎగిరే వలసపక్షి బాతుజాతికి చెందిన బార్‌హెడెడ్‌ గీస్‌. ఇది సముద్ర మట్టానికి దాదాపు 8.8 కిలోమీటర్ల ఎత్తున ఎగురుతుంది. ఈ జాతికి చెందిన పక్షులు హిమాలయాల నుంచి ప్రయాణం ప్రారంభించి, భారత భూభాగంలోని చిలికా, పులికాట్‌ తదితర సరస్సుల తీరాలకు చేరుకుంటాయి.
►అత్యధిక వేగంతో ప్రయాణించే వలసపక్షి గ్రేట్‌ స్నైప్‌. ఈ పక్షి గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో దాదాపు 6,500కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
►నిర్విరామంగా అత్యధిక దూరం ప్రయాణించే పక్షి బార్‌ టెయిల్డ్‌ గాడ్విట్‌. ఈ పక్షి ఎక్కడా ఆగకుండా 11 వేల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది.

మరిన్ని వార్తలు