Funday Crime Story: తీగ లాగితే.. డొంక కదలడం అంటే ఇదే

26 Jun, 2022 16:30 IST|Sakshi

క్రైమ్‌ స్టోరీ

చెక్‌ బౌన్స్‌ ఐంది. కేసులో ఇరుక్కున్నాడు స్వామి. రగిలిపోయాడు. తను ప్రలోభపరచినా  లొంగక.. తన మీద కేసు పెట్టిన.. రావుని చంపించేయాలని యత్నించాడు.
‘వాడు ఒకే దెబ్బకి చావాలి’ చెప్పాడు.
‘తప్పక సారూ.. నా చేతి కత్తి వాటం చూస్తారుగా’ వాడి వాలకమే కాదు.. వాచకం కూడా భయంకరంగా ఉంది. వాడు సోములు.. కిరాయికి మనుషులను చంపే కర్కోటకుడు!
‘అడ్వాన్స్‌ కాదు.. పూర్తి మొత్తం ఒకే మారు చెల్లిస్తున్నా’ అంటూ ఒక బ్యాగుని.. సోములుకి అందించాడు స్వామి. 
బ్యాగులోని డబ్బుని తీసి.. లెక్కించుకున్నాడు సోములు. ‘సరిపోయింది’ అంటూ ఆ డబ్బుని బ్యాగులో సర్దుకున్నాడు.
‘పనితనం చూపు.. చావు తప్పకూడదు’ చెప్పాడు స్వామి.
‘రేపు ఈ పాటికి పనయిపోతుంది’ ధీమా చూపాడు సోములు.
∙∙ 
మర్నాడు.. గుండె పోటుతో స్వామి చనిపోయాడు.
ఈ విషయం తెలిసిన సోములు.. రావు హత్యని విరమించుకున్నాడు!
∙∙ 
సరిగ్గా పక్షం రోజుల తర్వాత.. శకుంతల హత్య సంచలనం ఐంది. స్వామి భార్య.. శకుంతల.పోలీసులు పరిశోధన చేపట్టారు. ‘మీకు ఎవరి మీదైనా అనుమానాలు ఉన్నాయా?’ ఇన్‌స్పెక్టర్‌ అడిగాడు.కృపాకర్‌ తల అడ్డంగా ఆడించాడు. అతను స్వామి, శకుంతల ఏకైక సంతానం.
‘తలతో కాదు.. మాట్లాడాలి’ ఇన్‌స్పెక్టర్‌ వాయిస్‌ ఫోర్స్‌గా ఉంది.
‘లేదు సార్‌. అమ్మ మంచిది. విరోధులు ఉండే అవకాశమే లేదు’ మాట్లాడేడు కృపాకర్‌.
‘మరి.. మీ తండ్రికి విరోధులు ఎవరైనా ఉన్నారా?’ ఇన్‌స్పెక్టర్‌ది మరో ప్రశ్న.
‘ఆయన కూడా మంచివారు. ఆయనకి విరోధులు ఉండరు’ కృపాకర్‌ జవాబు ఇచ్చాడు.విచారణ కొనసాగుతోంది.
∙∙ 
ఉదయం.. ఇంటి నుంచి స్టేషన్‌కి రాగానే ఇన్‌స్పెక్టర్‌.. కృపాకర్‌కి ఫోన్‌ చేసి పిలిపించాడు. 
కృపాకర్‌ వచ్చి.. తన ముందున్న కుర్చీలో కూర్చోగానే.. 
‘మీ ఇంటి పరిసరాల్లోని కొన్ని సీసీ కెమెరాల ఫుటేజీలను రాబట్టుకున్నాం. మీ వివరణ కావాలి’ అంటూ.. తన వైపు ఉన్న కంప్యూటర్‌ మానిటర్‌ను కృపాకర్‌ వైపు తిప్పాడు ఇన్‌స్పెక్టర్‌.
‘ఇతడు మీ ఇంటికి రావడం.. వెళ్లడం జరిగింది’ ఇన్‌స్పెక్టర్‌ వ్యాఖ్యానించాడు.. మానిటర్‌లోని విజువల్స్‌ చూపుతూ.
కృపాకర్‌ వాటిని చూసి తలెత్తాడు. ఇన్‌స్పెక్టర్‌నే చూస్తూ.. ‘ఇతను.. ఇతను ఎవరు? నాకు తెలీదు!’ చెప్పాడు.
ఇన్‌స్పెక్టర్‌.. మానిటర్‌ను  తన వైపు తిప్పేసుకుంటూ..‘వీడు సోములు. కిరాయి గూండా’ చెప్పాడు. 
కృపాకర్‌ తలాడించాడు. అది గుర్తించాడు ఇన్‌స్పెక్టర్‌. ‘ఇతడు వచ్చిన రోజున మీరు ఇంట్లో లేరా?’ అడిగాడు  ఇన్‌స్పెక్టర్‌.
‘అదే.. ఆ రోజు ఏ రోజు? ఐనా అతడు నాకు తెలీదు. నేను చూడలేదు’ తంటాలు పడ్డాడు కృపాకర్‌.
‘మీ అమ్మగారి హత్య జరిగిన రోజు ఫుటేజీలు ఇవి’ ఇన్‌స్పెక్టర్‌ చెప్పడం ఆపాడు.
‘నేను క్యాంపులో ఉన్నాను. అమ్మ హత్య కబురు మా ఇంటి వాచ్‌మన్‌ ఫోన్‌ చేసి చెబితేనే తెలిసింది. ఎకాఎకీన వచ్చాను. ఆ తర్వాత.. నేను మీకు ఫోన్‌ చేసి చెప్పాను’ హైరానా పడుతూ చెప్పాడు కృపాకర్‌.
‘అవునా? మీ ఫోన్‌ కాల్‌తో మేము వచ్చేక.. అప్పుడు ఈ వివరాలేవీ మీరు చెప్పలేదు’ గుర్తుచేశాడు ఇన్‌స్పెక్టర్‌.
‘అవును. అప్పుడు నేను చాలా నెర్వసయ్యి ఉన్నాను. అమ్మ హత్య ఐనట్టే చెప్పగలిగాను’ తడబడ్డాడు కృపాకర్‌.
‘సరే. పాయింట్‌కి వద్దాం. ఆ రోజు ఏ ఊరు వెళ్లారు?’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌. ఆ అడిగే తీరు కృపాకర్‌లో దడ రేపింది.
‘చెప్పండి’ అదే రీతిని కొనసాగిస్తూ ఇన్‌స్పెక్టర్‌.
నిమిషం పిమ్మట చెప్పగలిగాడు కృపాకర్‌.
‘ఎవిడెన్స్‌ చూపగలరా’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.
కృపాకర్‌ బేలగా మొహంపెట్టాడు.
‘అదే.. టికెట్టు లాంటివి’ ఇన్‌స్పెక్టర్‌ క్లూ ఇచ్చాడు.
‘నేను నా కారులో వెళ్లాను’ చెప్పాడు కృపాకర్‌.
‘వెల్‌.. అక్కడి మీ స్టే ప్లేసెస్‌ గురించి.. అక్కడ మీరు కలిసిన వాళ్ల గురించి.. చెప్పండి’ మరో క్లూ ఇచ్చాడు ఇన్‌స్పెక్టర్‌.
నెమ్మదిగా జవాబు ఇచ్చాడు కృపాకర్‌.
‘సరే.. మీ ఇంటికి కాపలావాడు.. ఒక్కడేనా’ ప్రశ్నించాడు ఇన్‌స్పెక్టర్‌.
‘ఇద్దరు. నైట్‌ డ్యూటీలో ఒకడు.. డే డ్యూటీలో ఒకడు’ చెప్పాడు కృపాకర్‌.
‘హత్య కబురు మీకు చెప్పింది ఎవరు?’
‘డే డ్యూటీ అతను’
‘వాచ్‌మెన్‌ డ్యూటీస్‌ ఏంటీ?’ టక్కున అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.
‘గేట్‌ దగ్గర ఉండి.. లోనికి వచ్చే వారిని వాకబు చేయడం.. కొత్త వాళ్లెవరైనా వస్తే మాకు కబురు చేసి.. మా పర్మిషన్‌తో వాళ్లను లోపలికి పంపడం..  అంతే’ చెప్పాడు కృపాకర్‌.
‘మరి.. సోములు మీ ఇంటికి వచ్చినప్పుడు.. వెళ్ళినప్పుడు.. వాచ్‌మన్‌ గేట్‌ దగ్గరున్న జాడే ఫుటేజీల్లో లేదే!’ ఆశ్చర్యపడ్డాడు ఇన్‌స్పెక్టర్‌. 
ఆ మాటకు కృపాకర్‌ తికమక అవడం ఇన్‌స్పెక్టర్‌ గుర్తించాడు. వెంటనే ‘మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు’ అని ప్రశ్నించాడు.
‘అమ్మ, నేనే. నాన్న లేరుగా’ తడబడ్డాడు కృపాకర్‌.
‘ఇంట్లో పనివాళ్లు?’
‘వంట మనిషి లేదు కానీ.. పనమ్మాయి ఉంది’ చెప్పాడు కృపాకర్‌. 
∙∙ 
స్వామి వాళ్లింటి కాపలావాళ్లను, పనావిడను స్టేషన్‌కి పిలిపించాడు ఇన్‌స్పెక్టర్‌.
‘శకుంతల హత్య కబురును కృపాకర్‌కి ఎవరు చెప్పారు?’  
‘నేనే సార్‌..’  డే డ్యూటీ వాచ్‌మన్‌  చెప్పాడు.
అతడ్నే చూస్తూ ‘శకుంతల హత్య జరిగిన రోజున నువ్వేనా డ్యూటీలో ఉంది?’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.
తలాడించాడు వాచ్‌మన్‌.
‘నోరు తెరు’ చిరాకుపడ్డాడు ఇన్‌స్పెక్టర్‌.
‘యస్సార్‌. కానీ నేను అప్పుడు అక్కడ లేను. టీ తాగడానికి బయటికి వెళ్లాను. నేను తిరిగి వచ్చి డ్యూటీ ఎక్కేసరికి  పని మనిషి వచ్చింది. ఇంట్లోకి వెళ్లిన ఆవిడ.. గాభరాగా తిరిగొచ్చి.. నన్ను ఇంట్లోకి పిల్చుకెళ్లింది. నేను లోపలికి వెళ్లి చూశాకే  తెలిసింది.. మేడమ్‌ హత్య సంగతి. చూడగానే క్యాంపులో ఉన్న చిన్న సార్‌కి ఫోన్‌ చేశాను’ చెప్పాడు ఆ వాచ్‌మన్‌.
‘భేష్‌. నేను అడక్కుండానే చాలా చెప్పావే’ నవ్వేడు ఇన్‌స్పెక్టర్‌. తొట్రుపడ్డాడు ఆ వాచ్‌మన్‌.స్వామి వాళ్లింటి పనావిడను చూస్తూ.. ‘ఆ రోజు పనికి ఎన్ని గంటలకొచ్చావ్‌? ఆ రోజు ఏం జరిగింది’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.
‘ఎప్పటిలాగే వచ్చాను సర్‌. ఇంట్లోకెళ్లి చూస్తే హాల్లోగానీ.. కిచెన్‌లోగానీ అమ్మగారు కనిపించలేదు. అమ్మగారిని పిలుస్తూ తన గదిలోకి వెళ్లా.  మంచం మీద పడి ఉన్నారు ఆవిడ. చుట్టూ రక్తం.. భయమేసింది. వచ్చి వాచ్‌మన్‌కి చెప్పి లోపలికి పిల్చుకెళ్లాను. ఇతను అమ్మగారిని చూసి.. చనిపోయారు.. ఎవరో చంపేశారు అన్నాడు’ అంటూ ఆగింది ఆవిడ.
తను చూసిన ఫుటేజీలోవి.. పని వాళ్లు చెప్పేవి.. ట్యాలీ అవుతుండడం... కొత్త విషయమేదీ తెలియకపోవడంతో.. ఇన్‌స్పెక్టర్‌ దీర్ఘంగా నిట్టూర్చాడు. ఎంక్వయిరీ కొనసాగించాడు.
∙∙ 
విలేకర్ల సమావేశంలో..
‘శకుంతల హత్య ముడి విప్పగలిగాం. స్వామి.. చెక్‌ బౌన్స్‌ తతంగాన్ని తట్టుకోలేకపోయాడు. దాంతో రావుని హత్య చేయించాలనుకున్నాడు. అందుకు సోములుకు సుపారీ ఇచ్చాడు. ఐదు లక్షల పైకం కూడా చెల్లించేశాడు. రావుని సోములు హత్య చేసేలోగా.. స్వామి చనిపోయాడు. స్వామి మరణం.. ఒక మంచి అదను అనుకున్నాడు రాంశేఖర్‌. ఇతడు స్వామి వ్యాపార భాగస్వామి. తమ వ్యాపార వాటాల్లో.. భారీ స్థాయి పెట్టుబడులు స్వామివి కావడంతో.. వాటిలో చాలా వరకు ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న తలంపులో ఉన్న రాంశేఖర్‌.. తొలుత రావు ఇష్యూను తనకు  వీలుగా వాడుకోవాలనుకున్నాడు. రావును చంపేయమని స్వామిని ఉసికొల్పాడు. అందుకై సోములును స్వామికి పరిచయం చేశాడు. రావు హత్యతో.. స్వామిని జైలు పాలు చేసి.. స్వామిని హైరానా పెట్టి.. తన పేరున పవర్‌ ఆఫ్‌ పట్టా పొందాలని అనుకున్నాడు రాంశేఖర్‌. కానీ స్వామి గుండెపోటుతో చనిపోవడంతో తన ప్లాన్‌ మార్చుకున్నాడు.

రావు హత్య విషయంలో.. స్వామికి, సోములుకి మధ్య జరిగిన బేరసారాలు తెలిసి ఉండడంతో రాంశేఖర్‌..  సోములును కలిశాడు. రావు బదులు శకుంతలను హత్య చేయమని కోరాడు. అదనంగా మరో మూడు లక్షలు ముట్ట చెప్పాడు కూడా.

సోములు.. రాంశేఖర్‌ సూచనల ప్రకారమే ఇంట్లోకి చొరబడి.. శకుంతలను.. ఆవిడ గదిలోనే హత్య చేసి పోయాడు. ఆ సమయంలో కృపాకర్‌ క్యాంపులో ఉన్నాడు. స్వామి ఇంటి కాపలావాడు.. రాంశేఖర్‌ డైరక్షన్‌ ప్రకారం.. అప్పటికి బయటికి వెళ్లి ఉన్నాడు.  శకుంతల హత్య గురించి.. స్వామి ఇంటి కాపలావాడి ఫోన్‌ కాల్‌ ద్వారా తెలుసుకున్నాక.. ఆ హత్య కబురును.. ఆ వాచ్‌మన్‌ చేత.. కృపాకర్‌కి చేరవేయించింది రాంశేఖరే. ఆ వాచ్‌మన్‌కు డబ్బు ఎర వేశాడు. వాచ్‌మన్‌ ఫోన్‌కాల్‌ డేటా మూలంగానే రాంశేఖర్‌ మా దృష్టికి  వచ్చాడు.

హత్య జరిగిన సాయంకాలం..
కృపాకర్‌ ఇంటికి వచ్చిన తర్వాత.. అప్పుడే తనకి శకుంతల హత్య వార్త తెలిసినట్టు.. ఊర్లో ఉన్న తాను తక్షణమే తిరిగి వచ్చేసినట్టు నటించాడు రాంశేఖర్‌. మరి కొద్ది రోజుల్లోనే కృపాకర్‌ హత్యకూ ప్లాన్‌ చేసిపెట్టుకున్నాడు.. దానికీ సోములునే పురమాయించాడు రాంశేఖర్‌. మేము తీగ లాగితే.. డొంక కదిలింది. సంబంధితులందర్నీ పట్టుకున్నాం. తదుపరి చర్యలు చేపట్టాం’ అంటూ  ముగించాడు ఇన్‌స్పెక్టర్‌.
 -బివిడి ప్రసాదరావు 

మరిన్ని వార్తలు